‘కత్తి’పై దాడులు

22 Oct, 2014 00:47 IST|Sakshi
‘కత్తి’పై దాడులు

 చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ సంఘాల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్న ‘కత్తి’ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సినిమాను ప్రదర్శించనున్న థియేటర్లపై దాడులు చేసి ధ్వంసానికి పాల్పడ్డారు. చిత్రం విడుదల చేస్తే మరింత ఆందోళన తప్పదని ఆయా సంఘాలు హెచ్చరించినప్పటికీ బుధవారం కత్తి సినిమా విడుదలకు సిద్ధమైంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్, సమంత హీరో, హీరోయిన్లుగా నిర్మించిన చిత్రం కత్తి. ప్రసిద్ధ ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. లైకా మొబైల్స్ సంస్థ అధినేత సుభాష్‌కరన్ అల్లిరాజాకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే వ్యాపార భాగస్వామి అని తమిళ సంఘాల నేతలు చెబుతున్నారు.
 
 శ్రీలంక యుద్ధ సమయంలో వేలాది తమిళులను ఊచకోత కోసిన రాజపక్సే సన్నిహితుడు నిర్మించిన కత్తి సినిమాను రాష్ట్రంలో ప్రదర్శించేందుకు అనుమతించబోమని సుమారు 60 తమిళ సంఘాలు కొంతకాలంగా హెచ్చరిస్తున్నాయి. కత్తి సినిమా షూటింగ్ దశలోనే అనేక బహిరంగ ప్రకటనలు కూడా చేశాయి. ఈ నెల 22న రాష్ట్రంలోని 450 థియేటర్లలో కత్తి సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు ప్రారంభించారు. నిరసన కారులను ఒప్పించేందుకు ఈ నెల 20న నిర్మాతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ అనే పేరును చిత్రం నుంచి తొలగించాలని సంఘాలు పట్టుబట్టగా, ఈ డిమాండ్‌కు నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రశాంత వాతావరణంలో చిత్రం విడుదలకు సిద్ధమైందని అందరూ భావించారు.
 
 అర్ధరాత్రి ఆకస్మిక దాడులు
 కత్తి విడుదలను వ్యతిరేకిస్తూ కొందరు దుండగులు సోమవారం అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా రాష్ట్రంలో స్వైర విహారం చేశారు. చెన్నై, కడలూరు, నామక్కల్, తిరుచ్చి తదితర జిల్లాల్లో కత్తి సినిమా ప్రదర్శనకు సిద్ధమైన థియేటర్ల వద్ద విధ్వంసాలు సృష్టించారు. హీరో విజయ్ బ్యానర్లను చించివేశారు. నాలుగు ఆటోలు, రెండు కార్లలో సుమారు 50 మంది దుండగులు చెన్నై అన్నాశాలై సమీపంలోని సత్యం థియేటర్ల సముదాయం వద్దకు చేరుకుని పెట్రో బాంబులు విసిరారు. ఆ బాంబులు పెద్ద శబ్దంతో పేలడంతో థియేటర్ ముందు భాగంలోని అద్దాలు పగలిపోయాయి. బుకింగ్ కౌంటర్ల వద్దనున్న అద్దాలపై దుడ్డకర్రలు, రాళ్లతో దాడులు చేశారు. థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు పేలుళ్ల శబ్దాలకు భయపడి వెలుపలకు పరుగులు తీశారు. థియేటర్ సిబ్బంది ప్రేక్షకుల వాహనాలను వెనుకవైపు నుంచి పంపించేశారు. రాయపేటలోని ఉడ్‌ల్యాండ్స్ థియేటర్‌పై కూడా రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. విధ్వంసాలకు పాల్పడిన వారు తందెపైరియార్ ద్రావిడ కళగం కార్యకర్తలుగా సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అప్పు (32), జయ్‌వికాష్ (32), వాసుదేవన్ (28), జయకుమార్ (25), కృష్ణన్ (20) అనే యువకులను అరెస్ట్ చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.
 
 అడ్డంకులు తొలిగాయి : హీరో విజయ్

 కత్తి చిత్రం విడుదలపై తమిళ సంఘాలతో నెలకొన్న విబేధాలు, అడ్డకుంలు తొలగిపోయాయని హీరో విజయ్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ అనే పేరును తొలగించమని సంఘాలు కోరగా, నిర్మాతలు అంగీకరించడంతో వివాదం సమసిపోయిందని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారానికి సహకరించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, పోలీస్‌శాఖ, తమిళనాడు థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
 
కత్తిరూ.ని అడ్డుకుంటాం
 చర్చల పేరుతో తమిళ సంఘాల వారిని పిలిచి మోసగించారని తమిళర్ వాళ్వురిమై కూట్టమైప్పు అధ్యక్షులు వేల్‌మురుగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తాము వేచివుండేలా చేసిన నిర్మాతలు, ఆ తరువాత చర్చలు ఫలప్రదమైనట్లు ప్రచారం చేశారని ఆయన అన్నారు. సంఘాల డిమాండ్లు నెరవేరితేగానీ కత్తి చిత్రాన్ని ప్రదర్శించబోమని, థియేటర్ల యజమానులు కూడా తమకు సంఘీభావం తెలిపినట్లు ఆయన చెప్పారు. బుధవారం విడుదల కానున్న కత్తి సినిమాను అడ్డుకుని తీరుతామని ఆయన హెచ్చరించారు.  
 

మరిన్ని వార్తలు