ఒక్క అమ్మాయి వెంట ముగ్గురు మగాళ్లు!

8 Dec, 2018 16:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ఆన్‌లైన్‌ డేటింగ్‌ ఫ్లాట్‌ఫారాలపై ఒక్క అమ్మాయి వెంట ముగ్గురు మగవాళ్లు పోటీ పడుతున్నారు. అంటే దేశంలో డేటింగ్‌ యాప్స్‌ను ఉపయోగిస్తున్న వారిలో 26 శాతం మందే మహిళలు ఉన్నట్లు ‘వూస్‌’ అనే దేశీయ డేటింగ్‌ యాప్‌ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. అమెరికా మహిళలకన్నా ఈ సంఖ్య ఎంతో తక్కువ. అమెరికాలో టిండర్, బంబుల్‌ డేటింగ్‌ యాప్స్‌ను 40 శాతం మంది మహిళలను ఉపయోగిస్తున్నారు. 

డేటింగ్‌ యాప్స్‌ను పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కబుర్ల కోసం ఉపయోగిస్తుండగా భారత్‌లోనే లక్ష్యం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో భారతీయులను ఇంటర్వ్యూలు చేయగా ఎక్కువ మంది, అంటే 32 శాతం మంది అర్థవంతమైన సంబంధం కోసం అని సమాధానం ఇవ్వగా, కొత్త నగరానికి వెళ్లినప్పుడు అక్కడ కొత్త వారిని పరిచయం చేసుకోవాలనే ఉద్దేశంతోని 28 శాతం మంది సమాధానం ఇవ్వగా, కేవలం సామాజిక సర్కిల్‌ను పెంచుకోవడం కోసమే ఈ యాప్స్‌ను ఉపయోగిస్తున్నామని 17 శాతం మంది తెలిపారు. 

18 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్కులైన యువకులను ప్రశ్నించగా, కేవలం మిత్రల కోసమేనని, ముఖ్యంగా అమ్మాయిల స్నేహం కోసమని చెప్పారు. వారిలో ఎక్కువ మంది చదువురీత్యనో, ఉద్యోగం రీత్యనో దూరం ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన అమ్మాయిలతో స్నేహం చేయడానికి ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారని ‘ట్రూలీమాడ్లీ’ అనే డేటింగ్‌ యాప్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ భాటియా తెలిపారు. 

కొత్త నగరానికి వచ్చినప్పుడు ప్రజల సోషల్‌ నెట్‌వర్క్‌లు పరిమితం అవుతాయిగనుక, కొత్త వారిని పరిచయం చేసుకోవడానికి ఎక్కువ మంది డేటింగ్‌ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. యూజర్ల మధ్య ఏదో బంధం ఏర్పడడానికి ఈ యాప్స్‌ ఎంతో దోహదం చేస్తున్నాయని ఆయన తెలిపారు. సగటు యూజర్లు రోజుకు ఈ యాప్స్‌పై దాదాపు 45 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారు. ‘మహిళలతో పోలిస్తే మగవాళ్లే ఈ యాప్స్‌పై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఒకేసారి పలువురు మహిళలతో మాట్లాడేందుకు మగవారు ఇష్ట పడుతుండగా, మహిళలు మాత్రం ఒకేసారి ఇద్దరు, ముగ్గురు మగాళ్లకు మించి మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు’ అని సర్వే నివేదిక వెల్లడించింది. 

ఇష్టపడే లేదా నచ్చే మహిళా ప్రొఫైళ్లు ఎక్కువ కనిపించడం లేదని మగ యూజర్లు చెబుతుండగా, ఎక్కువ మంది మగాళ్ల ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నామని మహిళలు చెప్పారు. భారత్‌ లాంటి దేశంలో మహిళలు సామాజికంగా ఇంకా వెనకబడి ఉండడమే కాకుండా మొబైల్‌ ఇంటర్నెట్‌ యూజర్లు కూడా తక్కువే. మొబైల్‌ ఇంటర్నెట్‌ యూజర్లలో 89 శాతం మంది మగవాళ్లే ఉన్నారు. ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియాపై కూడా ముగ్గురు మగవాళ్లకు ఒక మహిళ ఉన్నారు. 

డేటింగ్‌ యాప్స్‌లో కూడా 70 శాతం మహిళలు వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించేందుకు భయపడుతున్నారు. డేటింగ్‌ యాప్స్‌ను ఉపయోగించే మహిళలకు మరింత భద్రతను కల్పించేందుకు తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే భద్రత విషయంలో ఇప్పుడు మెరుగ్గానే ఉన్నాయని మహిళా యూజర్లు అభిప్రాయపడ్డారు. 

అమెరికాలోని అతిపెద్ద ఆన్‌లైన డేటింగ్‌ సంస్థ టిండర్‌ గత సెప్టెంబర్‌లో ‘మై లవ్‌’ అనే డేటింగ్‌ యాప్‌ను ప్రవేశపెట్టగా, అమెరికాలోని దాని పోటీ సంస్థ ‘బంబుల్‌’ ఈనెలలో బాలివుడ్‌ సినీ తార ప్రియాంక చోప్రాతో కలిసి భారతీయ డేటింగ్‌ యాప్‌ను ప్రారంభించబోతోంది. ఈ యాప్‌ భారతీయ మహిళలు ప్రొఫైల్స్‌లోగానీ, సంభాషణలోగానీ తమ పూర్తి పేరును వెల్లడించాల్సిన అవసరం లేదని, పేరులోని మొదటి అక్షరాన్ని వెల్లడిస్తే సరిపోతుందని యాప్‌ నిర్వాహకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు