‘టై’పై పోరుకు మరింత సహకారం

8 Jul, 2015 00:26 IST|Sakshi
‘టై’పై పోరుకు మరింత సహకారం

భారత్, మధ్య ఆసియాల మధ్య ఘనమైన ఉమ్మడి ఇస్లామ్ సంస్కృతి ఉంది: మోదీ
 
రెండు ప్రాంతాల సంస్కృతులు
పరస్పరం సుసంపన్నమయ్యాయి
ఉజ్బెక్ నుంచి కజకిస్తాన్ చేరుకున్న మోదీ  {పధానితో చర్చలు..

 
 అస్తానా: భారతదేశానికి, మధ్య ఆసియాకు మధ్య ఘనమైన ఉమ్మడి ఇస్లామ్ సంస్కృతి ఉందని.. అది తీవ్రవాద శక్తులను ఎల్లవేళలా తిరస్కరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ - మధ్య ఆసియాల నడుమ రక్షణ, భద్రత సహకారం పెంపొందాలని పిలుపునిచ్చారు. మధ్య ఆసియా దేశాల్లో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని మోదీ మంగళవారం కజకిస్తాన్‌లో పర్యటించారు. సోమవారం ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించిన మోదీ.. మంగళవారం తాష్కెంట్ నుంచి ప్రత్యేక విమానంలో కజకిస్తాన్ రాజధాని అస్తానా చేరుకున్నారు. కజక్ ప్రధాని కరీమ్ మాసిమోవ్‌తో పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపారు. తర్వాత నజర్‌బయేవ్ వర్సిటీలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. భారతీయ, ఇస్లామిక్ సంస్కృతులు మధ్య ఆసియాలో సమ్మిళతం కావటం జరిగిందని.. అది ఒకదానిని మరొకటి ఆధ్యాత్మిక చింతనతో పాటు.. వైద్యం, శాస్త్రపరిశోధన, గణితం, అంతరిక్షశాస్త్రాల్లోనూ సుసంపన్నం చేశాయని పేర్కొన్నారు. ‘‘ఢిల్లీ దర్గాలు సూఫీ సంగీతంతో ప్రతిధ్వనిస్తాయి. మధ్య ఆసియా యోగా, హిందీ కేంద్రాలయ్యాయి. అయితే.. భారత్, మధ్య ఆసియాల మధ్య సంబంధాలు వాటి సామర్థ్యానికి తగినంతగా బలోపేతం కాలేదు.

ఆ పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ఈ పురాతన సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించటానికి నేను వచ్చాను’’ అని చెప్పారు. ఉగ్రవాదం ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ సవాలుగా మారిందన్నారు. ‘‘అస్థిరత, తీవ్రవాదం, ఉగ్రవాదం ముంగిట్లో మనం నివసిస్తున్నాం. ఉగ్రవాదం తమలో చేరికలక కోసం సైబర్ స్పేస్‌ను వినియోగించుకోవటం చూస్తున్నాం. కాబట్టి.. ఈ పర్యటనలో.. మా రక్షణ, భద్రత సహకారాన్ని బలోపేతం చేసుకుంటాం. మా విలువలు, మానవత్వానికి మా కట్టుబాటు అనే మా బలంతో కూడా మేం ఉగ్రవాదంపై పోరాటం చేస్తాం’’ అని పేర్కొన్నారు.  మోదీ బుధవారం కజక్ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్‌తో సమావేశమవుతారు.

 ఓఎన్‌జీసీ ఆయిల్ డ్రిల్లింగ్‌ను ప్రారంభించిన మోదీ
 కజక్‌లోని సత్పయేవ్ చమురు క్షేత్రంలో.. భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థ విదేశీ విభాగమైన ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ చేపట్టిన తొలి డ్రిల్లింగ్(చమురు అన్వేషణ) ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో కజక్ ప్రధాని కూడా పాల్గొన్నారు. ఈ చమురు క్షేత్రంలో 25 శాతాన్ని ఓఎన్‌జీసీ కొనుగోలు చేసింది.

 హిందీ ప్రాధాన్యం పెరుగుతుంది
 తాష్కెంట్: ఒక భాష ప్రజాదరణ అనేది.. ఆ దేశ ఆర్థిక శక్తితో ముడిపడి ఉంటుందని మోదీ పేర్కొన్నారు. భారతదేశం ఆర్థిక సుసంపన్నత దిశగా వేగంగా అడుగులు వేస్తున్నందున.. హిందీ ప్రాధాన్యం పెరగనుందన్నారు. మంగళవారం తాష్కెంట్‌లో ఇండాలిజిస్టులు, హిందీ భాష విద్యార్థులు, భారత సమాజ సభ్యుల కూడిన ఒక సమావేశంలో మోదీ ప్రసంగించారు.  తొలి ఉజ్బెక్ - హిందీ డిక్షనరీని మోదీ ఆవిష్కరించారు.

 లాల్‌బహదూర్‌కు నివాళులు
 మాజీ ప్రధాని  లాల్‌బహదూర్‌శాస్త్రి గర్వించదగ్గ భారత పుత్రుడని మోదీ అభివర్ణించారు. 1966లో తాష్కెంట్‌లో గుండెపోటుతో మరణించిన లాల్‌బహదూర్ స్మారకార్థం ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు.
 
 

మరిన్ని వార్తలు