టైగర్‌ జిందా హై..!

30 Jul, 2019 03:25 IST|Sakshi
నివేదికను విడుదల చేస్తున్న ప్రధాని మోదీ

పులులకు భద్రమైన దేశంగా భారత్‌

పులుల గణన నివేదిక విడుదల సందర్భంగా మోదీ వెల్లడి

2006తో పోలిస్తే దేశంలో రెట్టింపైన పులుల సంఖ్య

అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యం సాధ్యమన్న ప్రధాని 

దేశంలో పులులు 2,967

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో విడుదల చేశారు. పులులకు ప్రపంచంలోనే అత్యంత భద్రమైన నివాస స్థలంగా భారత్‌లోని అడవులు మారాయని ఆయన తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవమైన సోమవారమే మోదీ ‘అఖిల భారత పులుల సంఖ్య అంచనా–2018’ నివేదికను విడుదల చేస్తూ భారత్‌లో పులుల సంఖ్యను పెంచే ప్రక్రియలో పాలుపంచుకున్న వారందరినీ తాను ప్రశంసిస్తున్నానన్నారు.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం 2006లో దేశంలో 1,411 పులులు మాత్రమే ఉండగా, వాటి సంఖ్య 2014కు 2,226కు, 2018కి 2,967కు పెరిగింది. పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించారు. మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది.

2022 నాటికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడువు పూర్తవ్వడానికి నాలుగేళ్ల ముందే భారత్‌లో పులుల సంఖ్యను మనం రెట్టింపు చేశాం. సంకల్పంతో మనం దేన్నయినా సాధించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ’ అని వెల్లడించారు. 2006 నాటి లెక్కలను 2018 లెక్కలతో పోల్చుతూ మోదీ ఈ విషయం చెప్పారు. అదే 2014 లెక్కలను 2018 గణాంకాలతో పోలిస్తే పులుల సంఖ్య నాలుగేళ్లలో 33 శాతం పెరిగింది.

దాదాపు మూడు వేల పులులను కలిగిన ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే పులులకు అత్యంత భద్రమైన, పెద్ద నివాస స్థలంగా మారిందని మోదీ పేర్కొన్నారు. కాగా, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి, ఎం–స్ట్రైప్స్‌ అనే మొబైల్‌ యాప్‌ సాయంతో పులుల సంఖ్యను సులభంగా లెక్కించగలిగామని డబ్ల్యూఐఐలో పనిచేసే శాస్త్రవేత్త వైవీ.ఝాలా చెప్పారు. సమాచారాన్ని సేకరించడం సులభమైందిగానీ, దానిని విశ్లేషించడం కష్టంగా మారిందని ఆయన తెలిపారు.

‘ఎక్‌ థా టైగర్‌’ నుంచి...
సల్మాన్‌ ఖాన్‌ నటించిన రెండు బాలీవుడ్‌ చిత్రాల పేర్లను మోదీ ప్రస్తావిస్తూ, పులుల సంఖ్య పెరుగుదలపై చమత్కారంగా మాట్లాడారు. భారత్‌లో పులుల సంరక్షణ ప్రక్రియ ‘ఎక్‌ థా టైగర్‌’ (గతంలో ఓ పులి ఉండేది)తో మొదలై, ఇప్పుడు ‘టైగర్‌ జిందా హై’ (పులి బతికే ఉంది) వరకు చేరుకుందని మోదీ వివరించారు. అయితే ఇది ఇక్కడితో ఆగకూడదనీ, పులుల సంరక్షణను మరింత వేగవంతం, విస్తృతం చేయాలని ఆయన సూచించారు.

పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్యన ఆరోగ్యకరమైన సమతుల్యం తీసుకురావడం సాధ్యమేనని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంతోపాటు అడవుల విస్తీర్ణాన్ని కూడా పెంచగలిగిందని మోదీ తెలిపారు. 2014లో దేశంలో సంరక్షణ ప్రాంతాలు 692 ఉండగా, ప్రస్తుతం  860కి పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం జంతువుల కోసం కూడా మరిన్ని ఆవాసాలను ఏర్పాటు చేస్తుందన్నారు.

మధ్యప్రదేశ్‌లో అధికం
దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2014లో 308గా ఉన్న పులుల సంఖ్య 2018కి ఏకంగా 526కి పెరిగింది. అలాగే మహారాష్ట్రలోనూ 2014లో 190 పులులు ఉండగా, 2018లో 312 ఉన్నాయి.  2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 48 పులులు ఉన్నాయి. తెలంగాణలో గత నాలుగేళ్లలో పులుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెరిగింది.

తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో పులుల సంరక్షణ కేంద్రాలుండగా, ఈ రెండింటిలో కలిపి 2014లో 20 పులులు ఉండేవి. 2018 నాటికి ఆ సంఖ్య 26కు పెరిగింది. ఇవే కాకుండా, మరో ఆరు పులి పిల్లలు కూడా ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పులుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తగ్గింది. ఛత్తీస్‌గఢ్‌లో 2014లో 46 పులులు ఉండగా, 2018కి వాటి సంఖ్య 19కి పడిపోయింది.


మరిన్ని వార్తలు