టిప్పు చుట్టూ కన్నడ రాజకీయాలు

24 Oct, 2017 18:57 IST|Sakshi

చాలా కాలం తరువాత కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఏడాది కర్నాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీలు తమ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు మైసూర్‌ రాజు టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలను ఇరు పార్టీలు ఉపయోగించుకునే పనిలో పడ్డాయి.

బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం నవంబర్‌ 10 మైసూర్‌ పాలకుడు టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దశలో మరోమారు టిప్పు జయంతి వేడుకలపై వివాదాలు రాజుకున్నాయి. టిప్పు జయంతి వేడుకల్లో పాల్గొనాలంటూ.. ప్రొటోకాల్‌ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ప్రభుత్వం ఆహ్వానం పంపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపుతున్న ఈ ఆహ్వానాన్ని ఇప్పటికే పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు తిరస్కరించారు. ఇదిలా ఉండగా.. కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డే ఒక అడుగు ముందుకేసి.. ఈ అవమానకర కార్యక్రమానికి నన్ను అహ్వానించకండి అంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దీంతో వివాదం మరో మలుపు తీసుకుంది.

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ.. టిప్పు సుల్తాన్‌ తన పాలనలో వేలమంది హిందువులను ఊచ కోతకోశారని పేర్కొన్నారు. అంతేకాక బలవంతంగా వేల మందిని మతమార్పిడి చేయించారని అన్నారు. కర్నాటక ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే టిప్పు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు.

2015 నుంచి వివాదమే!
టిప్పు సుల్తాన్‌ జయంతి వివాదం 2015 నుంచి కొనసాగుతూనే ఉంది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టిప్పు జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ మొదట నుంచి వ్యతిరేకిస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇరు పార్టీలు టిప్పు జయంతి ఉత్సవాలను రాజకీయం చేసే పనిలో పడ్డాయి.

ఎందుకోసం?
కర్ణాటకలో ముస్లింలకు బలమైన ఓటు బ్యాంక్‌ ఉంది. దీంతో ముస్లిం ఓటు బ్యాంక్‌ను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ టిప్పు సుల్తాన్‌ 266వ జయంతి వేడుకలను 2015లో తొలిసారి నిర్వహణకు సిద్ద రామయ్య ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీనిని బీజేపీ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కర్ణాటకలో హిందువులు, క్రైస్తవును టిప్పు సుల్తాన్‌ ఊచ కోత కోశాడని బీజేపీ వాదిస్తోంది. టిప్పు సుల్తాన్‌.. హిందూ, కన్నడ వ్యతిరేకిగా బీజేపీ వాదిస్తోంది.

కాంగ్రెస్‌ వాదన
టిప్పు సుల్తాన్‌ విషయంలో బీజేపీ వాదనను కాంగ్రెస్‌ పార్టీ అదే విధంగా తిప్పికొడుతోంది. మైసూర్‌ రాజు టిప్పు సుల్తాన్‌.. స్వతంత్ర పోరాట యోధుడని కీర్తిస్తోంది. బ్రిటీష్‌ పాలనను అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోంది.

మొత్తానికి రెండు జాతీయ పార్టీల మధ్య ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు వేదికగా టిప్పు సుల్తాన్‌ జయంత్యుత్సవం మారిపోయింది.

మరిన్ని వార్తలు