‘ఆ అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర’

5 Dec, 2018 16:34 IST|Sakshi

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చెలరేగిన ఘర్షణల్లో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఓ యువకుడు మరణించిన క్రమంలో రాజకీయ దుమారం రేగుతుండగా, ఈ వ్యవహారం వెనుక కుట్ర కోణం ఉందని పోలీస్‌ ఉన్నతాధికారి పేర్కొన్నారు. బులంద్‌షహర్‌ ఘటన భారీ కుట్ర..ఇది శాంతి భద్రతల సమస్యే కాదని, అసలు అక్కడికి జంతు కళేబరం ఎలా వచ్చిందని, దీన్ని ఎవరు, ఎందుకోసం, ఏ పరిస్థితుల్లో తీసుకువచ్చారని యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ బుధవారం ప్రశ్నించారు.

మరోవైపు బులంద్‌షహర్‌ ఘర్షణ నాటకీయ ఘటన అని, హింసాకాండకు బీజేపీదే బాధ్యతని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం ఆరోపించింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ముజఫర్‌నగర్‌ ఘటన తరహాలోనే బులంద్‌షహర్‌ ఘటనను నాటకీయంగా ముందుకుతెచ్చారని శివసేన సందేహం వ్యక్తం చేసింది.

2019 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం అంత సులభం కాదని గ్రహించిన బీజేపీ మతపరంగా ప్రజల మధ్య వైషమ్యాల చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. కాగా, బులంద్‌షహర్‌లోని అక్రమ కబేళాలో గోవధ జరుగుతుందనే ఆరోపణలతో ఆందోళనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీస్‌ అధికారి సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ సహా ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు