‘ట్రిపుల్‌ తలాక్‌’ బిల్లులో చిల్లులెన్నో!

28 Dec, 2017 18:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ట్రిపుల్‌ తలాక్‌’ పేరిట ముస్లిం యువతులకు ఏకపక్షంగా విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ది ముస్లిం విమెన్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆన్‌ మ్యారేజ్‌)–బిల్‌’ను గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ‘ట్రిపుల్‌ తలాక్‌’ చెల్లదంటూ గత ఆగస్టు నెలలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కచ్ఛితంగా అమలయ్యేలా చూడాలంటే ప్రభుత్వం జోక్యం అవసరమని భావించడం వల్ల ఈ బిల్లును తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

పెళ్లయిన ముస్లిం మహిళలను రక్షించడం కోసం తీసుకొచ్చిన ఈ బిల్లులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ముస్లిం యువకులను వేధించే అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. బిల్లులోని మూడవ సెక్షన్‌ ప్రకారం పెళ్లయిన ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు నోటిమాటగాగానీ, రాతపూర్వకంగాగానీ, ఎలక్ట్రానిక్‌ రూపంలోగానీ, మరే ఇతర రూపాల్లోగానీ ‘ట్రిపుల్‌ తలాక్‌’ చెప్పడం చెల్లదు, అది చట్టవిరుద్ధం. చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఈ సెక్షన్‌ సుప్రీం కోర్టు తీర్పుకు అనుకూలంగానే ఉంది. (సాక్షి ప్రత్యేకం) ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడాన్ని బిల్లులోని ఏడవ సెక్షన్‌ ‘కాగ్నిజబుల్‌ అఫెన్స్‌ (పరిగణించతగ్గ తీవ్రమైన నేరం)’గా పరిగణిస్తోంది. అంటే ఎలాంటి వారెంట్‌ లేకుండా పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేయవచ్చు. బాధిత భార్య భర్తను శిక్షించాలని కోరుకోక పోయినా ఈ సెక్షన్‌ కింద భర్తను విచారించి జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ భార్య తప్పుడు ఫిర్యాదు చేసినా భర్తకు శిక్ష తప్పదు. నాన్‌ కాగ్నిజబుల్‌ అఫెన్స్‌గా ఈ నేరాన్ని పరిగణించి నట్లయితే ముందుగా బాధితురాలు మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయాలి. ఆ కేసును విచారించాల్సిన అవసరం ఉందా, లేదా? పోలీసుల దర్యాప్తునకు ఆదేశించి నిందితుడికి శిక్ష విధించాల్సిన అవసరం ఉందా? అన్న అంశాలను మేజిస్ట్రేట్‌ నిర్ణయిస్తారు. (సాక్షి ప్రత్యేకం)

హిందువులకు సంబంధించిన చట్టాలతో ఈ కొత్త చట్టాన్ని పోల్చిచూస్తే మత వివక్ష కూడా స్పష్టంగా కనిపిస్తోందని న్యాయనిపుణులు చెబుతున్నారు. తన నుంచి విడిపోయిన భార్యను రేప్‌ చేసిన ఓ హిందూ భర్తను చట్టప్రకారం శిక్షించాలంటే భార్య అనుమతి తప్పనిసరి. ఇక్కడ త్రిపుల్‌ తలాక్‌ చెప్పిన ముస్లిం భర్తను శిక్షించడానికి భార్య అనుమతే అవసరం లేదు. హిందువుల్లో వరకట్నాన్ని నిషేధిస్తూ 1961లో తీసుకొచ్చిన చట్టంలో కూడా నిందితులకు రక్షణ ఉంది. (సాక్షి ప్రత్యేకం) భార్య లేదా సమీప బంధువులు ఫిర్యాదు చేస్తేగానీ కేసు నమోదు చేయకూడదు.  విచారణ జరపరాదు. మన దేశంలో ముస్లిం మహిళల వివాహాలను ‘అఖిల భారత ముస్లిం లా బోర్డు’ పర్యవేక్షిస్తోందన్న విషయం మనకు తెల్సిందే. ముస్లిం వివాహాలకు సంబంధించి ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా వాటికి సంబంధించిన బిల్లులపై ముందుగా ఆ బోర్డు అభిప్రాయాలను తీసుకోవడం మన గత ప్రభుత్వాల ఆనవాయితీ. ఈసారి అలాంటి అభిప్రాయలను తీసుకోకుండానే బిల్లును తీసుకొచ్చారు.

‘ట్రిపుల్‌ తలాక్‌’ నుంచి ముస్లిం మహిళలను రక్షించడం కోసం తీసుకొచ్చిన ఈ బిల్లు వల్ల ముస్లిం కమ్యూనిటీకే ముస్లిం మహిళలు దూరమై, మరింత సామాజిక శిక్షకు గురయ్యే ప్రమాదం ఉందని ‘శ్యారా బానో కేసు’లో ఆమెకు అండగా నిలబడి వాదించిన మహిళా సంఘం ‘బెబ్యాక్‌ కలెక్టివ్‌’ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లిం స్త్రీ, పురుషుల మధ్య వివక్షను తొలిగించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చామని చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని శంకించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘ట్రిపుల్‌ తలాక్‌’ చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంలో ఈ మహిళా సంఘం కృషి ఎంతో ఉందన్న విషయం తెల్సిందే. (సాక్షి ప్రత్యేకం)

మరిన్ని వార్తలు