తప్పుడు ప్రకటనల్లో ట్రంప్‌ రికార్డు!

23 Jan, 2019 04:14 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ 8,158 సార్లు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని వాషింగ్టన్‌ పోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అధ్యక్షుడిగా ట్రంప్‌ ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫ్యాక్ట్‌ చెకర్స్‌ డేటాబేస్‌’అనే కంపెనీ ట్రంప్‌ చేసిన ప్రతీ అనుమానిత తప్పుడు సమాచారాన్ని విశ్లేషించింది. తొలి ఏడాదిలో రోజుకు సరాసరి 5.9 తప్పుడు ప్రకటనలు చేశారని, రెండో ఏడాదికి వచ్చే సరికి ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగి, రోజుకు 16.5 తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని పేర్కొంది. మొత్తం 8,158 తప్పుడు ప్రకటనల్లో దాదాపు 6 వేలకు పైగా ప్రకటనలు రెండో ఏడాదే చేశారని తెలిపింది. అధ్యక్షుడైన తర్వాత తొలి 100 రోజుల్లోనే 492 తప్పుడు ప్రకటనలు చేశారని తేల్చింది. ఇప్పటి వరకు చేసిన తప్పుడు ప్రకటనల్లో అధికంగా వలసల గురించే చేయడం గమనార్హం. విదేశీ విధానం గురించి 900, వాణిజ్యం గురించి 854, ఆర్థిక వ్యవస్థ గురించి 790, ఉద్యోగాల గురించి 755 తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ రెండేళ్లలో 82 రోజులు మాత్రమే ఎలాంటి ప్రకటనలు చేయలేదు. 

మరిన్ని వార్తలు