'రష్యా.. నిప్పుతో చెలగాటం వద్దు'

27 Nov, 2015 22:45 IST|Sakshi
'రష్యా.. నిప్పుతో చెలగాటం వద్దు'

ఇస్తాంబుల్ : రష్యా, టర్కీ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అలాగే కొనసాగుతోంది. టర్కీ అధ్యక్షుడు తాయిప్ ఎర్డోగన్ రష్యాకు తమ సూచనలు తెలుపుతూనే హెచ్చరికలు పంపారు. తమ దేశ యుద్దవిమానాన్ని టర్కీ కూల్చేయడంపై రష్యా తీవ్రంగా మండిపడుతుండటంతో, ఈ ఘటనలపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. ఉత్తర టర్కీలోని బేబర్ట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 'నిప్పుతో చెలగాటం వద్దు' అంటూ రష్యాను ఆయన హెచ్చరించడం గమనార్హం. అంకారా ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపడంతో పాటు రష్యా ఆంక్షలు విధించడంతో టర్కీ ఆ దేశంపై మండిపడుతోంది. జెట్ విమానాన్ని కూల్చేయడంపై క్షమాపణలు చెప్పని కారణంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టర్కీ అధినేతను సంప్రదించే యత్నం చేయలేదు.

అయితే, తమ అధికారులు ముందుగానే హెచ్చిరించినప్పటికీ రష్యా యుద్దవిమానం మా గగనతలంలో ఉన్న నేపథ్యంలోనే కూల్చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని టర్కీ ఇటీవలే వివరించిన విషయం విదితమే. ఈ సోమవారం తమ యుద్ద విమాన కూల్చివేతను 'ఉద్దేశపూర్వకంగానే మా సైనికులను చంపేశారు' అని రష్యా దిగువ సభ స్పీకర్ సెర్గేయ్ నారిష్కిన్ అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. రష్యా ఈ విషయాన్ని మాములుగా తీసుకోవాలని, ఆ దేశంతో సంబంధాలు మాకు అవసరమేనని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో వచ్చే వారం జరగనున్న వాతావరణ సదస్సుకు ఇరుదేశాల అధినేతలు పాల్గొనున్నారు.

మరిన్ని వార్తలు