నిజ జీవితంలోనూ 'స్కూబీ డూ' | Sakshi
Sakshi News home page

నిజ జీవితంలోనూ 'స్కూబీ డూ'

Published Fri, Nov 27 2015 7:00 PM

నిజ జీవితంలోనూ 'స్కూబీ డూ'

లండన్: నిజజీవితంలోని క్యారెక్టర్లను ఆదర్శంగా తీసుకొని సినిమాలు, కార్టూన్ సిరీస్  తీయడం సహజమే. కల్పనా చాతుర్యంతో జీవం పోసిన క్యారెక్టర్లు నిజ జీవితంలో కనిపించడం ఆశ్చర్యం, పిన్నా పెద్దలను కడుపుబ్బా నవ్వించే 'స్కూబీ డూ' లోని కుక్కను ఆకారంలోనే కాకుండా మనస్తత్వంలోనూ పోలిక ఉన్న నిజమైన గ్రేట్ డేన్ జాతి కుక్క కనిపించడం అద్భుతమే. వెస్ట్ మిడిలాండ్స్‌లోని ఓల్డ్‌బరిలో సియాన్ బారెట్ అనే 47 ఏళ్ల మహిళ పెంచుకుంటున్న కుక్కను చూస్తే, అవురా! అనిపిస్తుంది.
 
భుజం వరకే 38 అంగుళాలుండే ఆ శునకానికి బారెట్ ముద్దుగా ప్రెస్లీ అని పేరు పెట్టుకుంది. అచ్చం ఆరడుల కార్టూన్ క్యారెక్లర్లా కనిపించే ప్రెస్లీకి కూడా ఏదన్నా భయమే. పప్పీ పిల్లను చూసినా, పిల్లి కూనను చూసినా  ఆమడ దూరం పారిపోతుంది.  గోడపక్కన నక్కినక్కి అవి పోయేదాక నిరీక్షిస్తుంది. దగ్గర్లోనే యజమాని ఉంటే పరుగెత్తికెళ్లి యజమాని ఒళ్లో వాలిపోతోంది. ఇంట్లో కూడా అంతే. ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులను చూసినా భయపడి చస్తుంది. వాక్యూమ్ క్లీనర్ శబ్దం విన్నా గజగజ నిలువెల్లా వణికి పోతుంది.
 
85 కిలోల బరువుండే ప్రెస్లీ భయంతో పరిగెత్తికొచ్చి ఒళ్లోవాలితే ప్రాణం పోయినంత పనవుతుందని బారెట్ తెలిపారు. దాన్ని ఎత్తుకోవడం తనవల్ల కాదని అన్నారు. అది  పిరికి పందలా తయారైందని తన భర్త విసుక్కుంటాడని, అయితే సున్నితమైన మనస్సు ఉండడం వల్లనే అది అలా తయారైందని బారెట్ వివరించారు. చిన్న పిల్లలు ఏడుస్తుంటే భరించలేదని, ఏదో విధంగా వారిని ఊరడించాలని ప్రయత్నిస్తుందని, అందుకే అదంటే కాలనీ వాసులందరికీ ఇష్టమని తెలిపారు.

 ప్రెస్లీకి చిన్నప్పటి నుంచి తానే తినిపిస్తూ వస్తున్నానని, అందుకనే ఒక్క క్షణం అది తనను విడిచి ఉండలేక పోతోందని, తాను ఏ గదిలోకి వెళ్లి, ఏ పని చేస్తున్నా తోకూపుకుంటూ తోడై ఉంటుందని బారెట్ చెప్పారు. రాత్రి దాన్ని వదిలేసి పడక గదిలోకి వెళుతుంటే చంటి పిల్లలా ఏడుస్తుందని, దటీజ్ మదర్స్ డాటర్ అని ఆమె వ్యాఖ్యానించారు. 1969లో ప్రారంభమైన అమెరికా కార్టూన్ సిరీస్ 'స్కూబీ డూ'లో గ్రేట్ డేన్ లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయనడంలో సందేహం లేదు. 'వాట్ ఏ నైట్ ఫర్ ఏ నైట్' ఆ సిరీస్‌లో మొదట వెలువడింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement