రాజస్థాన్‌లో రెండు ప్రమాదాలు: 19మంది మృతి

3 Jan, 2018 13:30 IST|Sakshi

సికార్‌/జైపూర్‌: రాజస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 19మంది మృతిచెందారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాతీయ రహదారి 11పై ఓ ట్రక్కును రాజస్థాన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీసు (ఆర్‌పీటీఎస్‌) బస్సు బుధవారం ఉదయం ఢీకొన్న ప్రమాదంలో 11మంది చనిపోగా మరో 12మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్‌ మరో బస్సును ఓవర్‌టేక్‌ చేస్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. క్షతగాత్రులను ఫతేపూర్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే 11మంది చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులలో ఎనిమిదిమందిని బర్కత్‌ అలీ, మణిరామ్‌, సిరాజుద్దీన్‌, నోపారం, రాజేంద్ర, గోపిరామ్‌, షకీల్‌, సురేంద్రగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన 12మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో జైపూర్‌ ఆస్పత్రికి తరలించారు. సికార్‌ కలెక్టర్‌ నరేష్‌కుమార్ థక్రల్‌, ఎస్పీ వినిత్‌కుమార్‌, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. 


కాగా, మరో ప్రమాదంలో 8మంది మృతిచెందారు. రెన్వాల్‌ ప్రాంతంలో ట్రక్కును టెంపో మంగళవారం రాత్రి ఢీకొన్న ఈ సంఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. బాధితులు చోము పట్టణంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను పప్పు పరేక్‌, మొహమ్మద్‌ అలీ(36), షరీఫ్‌(45), షమా బానో(35), గుల్షన్‌ బానో(56), ఫిరోజ్‌(35), రిహాన్‌(9), ఆహిల్‌(3)లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు