ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా 

27 Oct, 2017 12:12 IST|Sakshi

నాగావళి నదిలో మునిగి ఇద్దరు యువతుల  మృతి

ప్రమాదానికి గురైన విశాఖ యువతులు 

రాయగడ: విహారం కోసం  రాయగడ పట్నానికి వచ్చిన  ఇద్దరు యువతులు నాగావళి నదిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. విశాఖపట్నానికి చెందిన 9మంది యువతులు గురువారం  ఉదయం సమతా ఎక్స్‌ప్రెస్‌లో రాయగడ వచ్చి స్థానిక మజ్జిగౌరి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం స్థానిక పర్యాటక స్థలం, నిషేధ ప్రాంతమైన జోళాబ్రిడ్జిని చూసేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు.

నిషేధ స్థలంలో క్రీడలు, స్నానాలతో సహా  వివిధ భంగిమల్లో సెల్ఫీలు తీసుకుంటున్న  సమయంలో ఒక యువతి నీటిలో మునిగిపోగా ఆమెను రక్షించే క్రమంలో మరో యువతి కూడా నది నీటిలో మునిగి మృతిచెందింది. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను వెతకగా నాగావళి నది ఒడ్డుకు 5కిలోమీటర్ల దూరంలో గల గురుంగుడ వద్ద లభ్యమయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

ఒకరిని రక్షించబోయి మరొకరు కూడా
విశాఖపట్నంలో పనిచేస్తున్న 9మంది యువతులు దీపావళి పండగ సెలవుల సందర్భంగా రాయగడ మజ్జిగౌరి మందిరం దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ఆటో డ్రైవర్‌ను రూ.300కు మాట్లాడి పర్యాటక స్థలాలు చూసేందుకు వెళ్లారు.  మొదట నాగావళి నదిపై గల జోళా బ్రిడ్జిని చూసేందుకు   వెళ్లి బ్రిడ్జిని చూసిన అనంతరం నాగావళి నదిలో దిగి సెల్ఫీల కోసం విభిన్న భంగిమల్లో డ్యాన్సులు చేస్తూ    నీటి మధ్య ఫొటోలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో విశాఖపట్నంలోని  మురళీనగర్‌కు చెందిన ఇమంది జ్యోతి(27) ముందుగా నీటిలో పడిపోయింది. ఆమెను రక్షించే క్రమంలో విజయనగరం పట్టణానికి చెందిన సింగపురి దేవి(21) కూడా నదిలో కొట్టుకుపోయింది.  వీరితో పాటు ఉన్న టి.సుభాషిణి(32) సి.లక్ష్మి(31) పి.స్వర్ణలేఖ(25) జి.రూప(27) జి.లక్ష్మి(21)ఎం.స్వాతి(25) సి.దేవి(22)ఉన్నారు. వీరంతా ప్రమాదస్థలంలో కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు తెలియజేశారు. 

పోస్ట్‌మార్టం వాయిదా
తక్షణమే పోలీసులు,  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి గాలింపు చేపట్టారు. మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చిన అనంతరం పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మిగిలిన 7గురు యువతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేసి కేసులు నమోదు చేశారు. సాయంత్రం 5గంటల వరకు మృతుల కుటుంబసభ్యులు  చేరుకోలేకపోవడంతో  పోస్ట్‌మార్టం శుక్రవారం జరగనున్నట్లు  తెలిసింది.  

మరిన్ని వార్తలు