విచిత్ర చదువులు... వింతైన పరీక్షలు

27 Oct, 2017 12:15 IST|Sakshi

మునిసిపల్‌ స్కూళ్లలో ఉత్తుత్తి ఫౌండేషన్‌ కోర్సులు

పుస్తకాలు లేకుండానే పరీక్షలు

సరఫరా చేయని సర్కారు

విద్యార్థులకు ప్రతీ వారం ర్యాంకుల ప్రకటన

పరీక్షల నిర్వహణపై సర్వత్రా విమర్శలు

ఏ విద్యా సంస్థలోనైనా విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రభుత్వం విడుదల చేసిన మెటీరియల్, పుస్తకాలను పరిశీలించి అవసరమయితే వాటిపై శిక్షణ తీసుకుని పిల్లలకు బోధించాకే కదా... కానీ పుస్తకాలు, మెటీరియల్‌ పాఠశాలలకు ఇవ్వకుండానే బొబ్బిలిలోని పురపాలక పాఠశాలల్లో ఐఐటీ కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాంకులు ఇస్తున్నారు. వీటిని రాష్ట్ర స్థాయిలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అసలు ఈ ర్యాంకులేమిటో... ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో... విద్యార్థులకే తెలియడం లేదు. ఇదీ మునిసిపాలిటీల్లో అనుసరిస్తున్న విద్యా విధానం.

బొబ్బిలి: పురపాలక సంఘాల పరిధిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సులు ఇటీవల ప్రారంభించారు. ఈ కోర్సులకు సంబంధించిన మెటీరియల్‌ అందకపోయినా పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం రెండో స్పెల్‌లో ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సుకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సులకు పరీక్షలు జరుగుతున్నాయి. మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియం ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా పాఠశాలల్లో విద్యార్థులను ఉన్నత ప్రయోజకుల్ని చేస్తామని ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సులను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతీ పాఠశాలలోనూ సాధారణ తరగతులు ప్రారంభించే గంట ముందు, ముగిసిన తరువాత ఓ గంట పాటు శిక్షణ పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఈ ఐఐటీ కోర్సుల్లో చేర్పించింది.

జిల్లాలో 1688మంది ఎంపిక
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 1688 మంది విద్యార్థులను ఐఐటీ కోర్సుల్లో చేర్పించారు. పార్వతీపురంలోని మూడు పాఠశాలలకు చెందిన 405 మంది, బొబ్బిలిలో రెండు పాఠశాలలకు చెందిన 317, సాలూరులోని రెండు పాఠశాలలకు చెందిన 423, విజయనరంలో మూడు పాఠశాలలకు చెందిన 543 మంది విద్యార్థులు ఈ కోర్సులో చేరారు. వీరికి  రోజూ ఉదయం 8.30 గంటల నుంచి, 9.30 వరకూ సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకూ బిట్లు ప్రాక్టీసు చేయడం, అడ్వాన్స్‌డ్‌ కోర్సులను చెప్పడం, కెరీర్‌ ఫౌండేషన్‌ సిలబస్‌ను అవలోకనం చేయడం వంటివి చేయాలి. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు 10 నుంచి 20 మంది బోధకులను ఎంపిక చేసి వారికి గంటకు రూ. 250ల చొప్పున చెల్లించి ఉన్నత ప్రమాణాలు బోధించాల్సి ఉంది. దీనికి సంబంధించి విడతల వారీగా మెటీరియల్, పుస్తకాలు ఇవ్వాలి. కానీ బొబ్బిలిలోని రెండు పురపాలక పాఠశాలల్లోనూ ఈ మెటీరియల్‌ ఇవ్వలేదు. పరీక్షలు మాత్రం నిర్వహించేశారు. గురువారం సాయంత్రం రెల్లివీధిలోని పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల, గొల్లపల్లిలోని వేణుగోపాల ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్టు కో–ఆర్డినేటర్, హెచ్‌ఎంలు స్వయంగా విలేకర్లకు తెలిపారు.

ఇవీ కారణాలు...
పాఠశాలలకు మెటీరియల్, పుస్తకాలు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అందుబాటులో లేరని కో–ఆర్డినేటర్‌ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. అలాగే తాను కూడా గుంటూరులో జరిగిన సమావేశానికి వెళ్లాల్సి వచ్చిందని, శుక్రవారం లేదా శనివారం  పుస్తకాలను ఆయా పాఠశాలలకు ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. జూలైలో ప్రారంభించిన ఈ శిక్షణకు సంబంధించి ఇప్పటికి రెండు స్పెల్స్‌లో పుస్తకాలు రావాల్సి ఉండగా ప్రారంభంలో ఒక స్పెల్‌ పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు రెండో స్పెల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి మూడో స్పెల్‌ కూడా తరగతులు ప్రారంభమయ్యే సమయం వచ్చేసిందని స్థానికులు చెబుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా