ఔరా అనిపించిన అమ్మాయిలు

27 May, 2018 20:37 IST|Sakshi
నిధి ఉపాధ్యాయ (ఫైల్‌ ఫోటో)

నొయిడా: సీబీఎస్‌ఈ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈసారి కూడా 88.31 శాతం ఉత్తీర్ణతో బాలికలే ముందంజలో ఉండగా.. బాలురు 78.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన నిధి ఉపాధ్యాయ, సృష్టి సింగ్‌లు ఎన్నో కష్టాలు ఎదురైనా పట్టుదలతో చదివి 96 శాతం మార్కులు సాధించారు. వీరిద్దరు నొయిడాలోని సెక్టార్‌ 44 గల మహామాయ ప్రభుత్వ బాలికల ఇంటర్‌ కళాశాలలో చదువుతున్నారు. ర్యాంకులు సాధించడానికి పట్టుదల, నిబద్ధత అవసరమని రుజువు చేశారు. ఖరీదైన, కార్పొరేటు విద్యాలయాల్లో చదివితేనే ర్యాంకులు వస్తాయనే అపోహను పటాపంచలు చేశారు. హ్యుమనిటీస్‌ విభాగంలో నిధి ఉపాధ్యాయ 96.2 శాతం మార్కులు సాధించగా, బయాలజీ విభాగంలో సృష్టి సింగ్‌ 98.8 శాతం మార్కులు సాధించి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చారు. ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు.

ఐఏఎస్‌ కావడమే లక్ష్యం: నిధి
‘మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బాగా చదివాను. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు విషయంలో నాన్న  వెన్నంటి ఉన్నారు. నా లక్ష్యం ఐఏఎస్‌ కావడం. కష్టపడి చదివి నా తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేస్తా’

ఆమె కోసమే ఇక్కడికొచ్చా..
నిధి తండ్రి రామ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. ‘నా కూతురు చదువులో చురుగ్గా ఉంటుంది. ఆమె చదువు కోసమే ఈ పట్టణానికి వచ్చా. రోజంతా ఆటో నడిపినా పూట గడవడమే కష్టం. అయినే సరే ఆమె కోసం కష్టపడటంలో ఆనందం ఉంది. నిధి తప్పకుండా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది’

ఆర్మీ డాక్టర్‌నవుతా: సృష్టి
‘వ్యాపారం చేసుకుని మమ్మల్ని బాగా చూసుకునే నాన్నకు పెద్ద కష్టం వచ్చింది. గతేడాది నా అనారోగ్యం కారణంగా మా కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఆయన వ్యాపారం పూర్తిగా నష్టాల బాట పట్టింది. నా ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. కానీ, మా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పట్టుదలగా చదివా. నా కోసం మా టీచర్లు సాయంత్రం కూడా క్లాసులు పెట్టారు. వారికి నా ధన్యవాదాలు. చదువులో రాణించాలంటే గురువుల మార్గదర్శనం తప్పనిసరి. డాక్టర్‌ని అయి ఆర్మీలో సేవలందిస్తా’

>
మరిన్ని వార్తలు