కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది: ఉద్ధవ్‌ ఠాక్రే

22 Feb, 2020 09:41 IST|Sakshi

సాక్షి, ముంబై: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్నార్సీ)లపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని శివసేన చీఫ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. వాటి కారణంగా ఎవరినీ దేశం నుంచి బయటకు పంపబోరని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఉద్ధవ్‌ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకాబోదని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ‘‘మహారాష్ట్ర అవసరాలను మోదీకి వివరించాను. మహారాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ గురించి మేం చర్చించాం. సీఏఏపై నా వైఖరి స్పష్టం చేశాను. సీఏఏ కారణంగా ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. అణచివేతకు గురైన మైనార్టీలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.  ఎన్నార్సీ అమలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి సమస్యాలేదు. ఒకవేళ సీఏఏ, ఎన్నార్సీ కారణంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. అప్పుడు మేం కచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తాం’’అని భేటీ అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు.

ఇక మహారాష్ట్రలోని అధికార కూటమి మహా అఘాడిలో చీలకలేం రాలేదని.. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కూడిన తమ కూటమి అధికారంలో ఐదేళ్లు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ)ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనివ్వమని ఉద్ధవ్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్నార్సీకి తాము వ్యతిరేకమన్న ఉద్ధవ్ ఠాక్రే‌.. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి మాత్రం మద్దతు ప్రకటించారు. సీఏఏ వల్ల దేశంలోని పౌరుల హక్కులకు భంగం కలగదని... ఇక్కడి పౌరులు తమ పౌరసత్వం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గతంలో ఆయన పేర్కొన్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పౌరసత్వాన్ని నిరూపించుకోవడం హిందువులు, ముస్లింలకు కష్టమే. అయితే సీఏఏ ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వచ్చే మైనార్టీల కోసం. అది భారత పౌరుల పౌరసత్వాన్ని దూరం చేయదు’’ అని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు