నగదు తక్కువగా వాడండి

27 Mar, 2017 02:01 IST|Sakshi
నగదు తక్కువగా వాడండి

అవినీతిపై పోరును ఉధృతం చేయండి
మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ


న్యూఢిల్లీ: నల్లధనం, అవినీతిపై పోరును ఉధృతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నోట్ల రద్దు తర్వాత మొదలైన డిజిటల్‌ చెల్లింపుల ఉద్యమానికి మద్దతు కొనసాగించాలని, దైనందిన జీవితంలో తక్కువ నగదు వాడాలని ఆదివారం తన ‘మన్‌కీ బాత్‌’ ప్రసంగంలో సూచించారు. ‘నల్ల ధనం, అవినీతిపై మన పోరాటాన్ని తదుపరి దశకు తీసుకెళ్లాలి... నగదు వాడకాన్ని తగ్గించేందుకు మనవంతు కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. స్కూలు ఫీజుల చెల్లింపు, మందులు, రేషన్‌ సరుకుల కొనుగోలుకు, విమానం, రైలు టికెట్లకు డిజిటల్‌ చెల్లింపులు చేయాలని కోరారు. ‘ఇలా దేశానికి ఎంత సేవచేయగలరో, నల్లధనం, అవినీతిపై పోరులో ధీర సైనికుడిలా ఎలా మారగలరో మీరు ఊహించలేరు’ అని పేర్కొన్నారు.

ఆరు నెలల్లోనే..
ఈ ఏడాది 2,500 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు ఉండగలవని బడ్జెట్‌లో అంచనా వేశారని, అయితే 125 కోట్లమంది దేశ ప్రజలు పూనుకుంటే ఈ లక్ష్యాన్ని ఆరునెలల్లోనే సాధించగలరని మోదీ అన్నారు. గత కొన్ని నెలల్లో ప్రజలు డిజిటల్‌ చెల్లింపుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ‘నగదు రహిత లావాదేవీలను నేర్చుకోవడానికి పేదలు యత్నిస్తున్నారు.. భీమ్‌ యాప్‌ను కోటిన్నరమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు’ అని వెల్లడించారు.

శిశువుకు అమ్మప్రేమ పూర్తిగా దక్కాలి
ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పెంచడం ద్వారా కార్మిక మహిళల సంక్షేమం దిశగా దేశం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ‘భావి భారత పౌరులైన నవజాత శిశువులకు తల్లిప్రేమ, సంరక్షణ పూర్తిగా దక్కాలి’ అని వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్, నవ భారత్‌ లక్ష్యాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఆహారాన్ని వృథా చేయడం పేదలకు అన్యాయం చేయడమేనన్నారు. నవ భారత్‌ ప్రభుత్వ పథకం కానీ, రాజకీయ పార్టీ కార్యక్రమం కానీ కాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పౌరులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తే నవ భారత నిర్మాణానికి అదే శుభారంభమవుతుందని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌ వాసులకు శుభాకాంక్షలు
బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, అభివృద్ధి కోసం చేసే పోరులో ఆ దేశ ప్రజలకు భారత్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌ ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ‘భారత్, బంగ్లాల జాతీయగీతాలను రచించిన రవీంద్రనాథ్‌ టాగూర్‌ జిలియన్‌వాలా బాగ్‌ మారణకాండకు నిరసనగా నైట్‌హుడ్‌ బిరుదును త్యజించడం గర్వకారణం. అంతవరకు మైదానంలో ఆటలకే పరిమితమైన ఓ కుర్రవాడికి ఇది ప్రేరణను, జీవితాశయాన్ని అందించింది. అమరుడిగా మారిన ఆ కుర్రవాడు మరెవరో కాదు, 12 ఏళ్ల భగత్‌సింగ్‌’ అని కొనియాడారు. మహాత్మాగాంధీ ప్రారంభించిన చంపారణ్‌ సత్యాగ్రహాన్నీ మోదీ ప్రశంసించారు. గాంధీ తన ఆచరణతో దేశ ప్రజలను బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి తెచ్చారన్నారు.

ఎవరిపైనా అభిప్రాయాల్ని రుద్దం
బ్రహ్మకుమారీల సదస్సులో మోదీ
మౌంట్‌ అబూ(రాజస్తాన్‌): భారత్‌ తన అభిప్రాయాలను ఎవరిపైనా బలవంతంగా రుద్దదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో సుసంపన్నమైన భిన్నత్వం ఉందని, దేవుడొక్కడే అన్నది దేశ సంప్రదాయ సారాంశమని వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ జరిగిన బ్రహ్మ కుమారీల సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు.

‘భారత్‌లో హిందువులు, ముస్లింలు, పార్సీలకు దేవుడంటే ఒక్కడే. సత్యం ఒకటే.. భిన్న వర్గాల ప్రజలు దాన్ని భిన్నరకాలుగా వ్యక్తీకరిస్తారు.. తన అభిప్రాయాలను ఇతరులపై రుద్దడంలో భారత్‌కు విశ్వాసం లేదు’ అన్నారు. 2030 నాటికి దేశ ఇంధనోత్పత్తిలో శిలాజేతర ఇంధనం 40 శాతంగా ఉండాలని భారత్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. బ్రహ్మకుమారీస్‌ సంస్థ నగదు రహిత లావాదేవీలు, శిశువులకు పోషకాహార ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. స్కూళ్లు, కాలేజీల్లో యోగాను తప్పనిసరి చేయాలని బ్రహ్మకుమారీస్‌  ప్రధాన కార్యదర్శి రాజయోగి బీకే నిర్వాయర్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు