జైపూర్‌ అల్లర్లు.. ఒకరి మృతి

9 Sep, 2017 11:15 IST|Sakshi
జైపూర్‌ అల్లర్లు.. ఒకరి మృతి
సాక్షి, జైపూర్‌: ఓ చిన్న ఘటన పింక్‌ సిటీలో శుక్రవారం అర్థరాత్రి చిచ్చును రగిల్చింది.  పోలీసులకు, స్థానికులకు మధ్య చెలరేగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతుండగా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను పోలీసులు నిలిపివేశారు. దీంతో జైపూర్‌ లో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. 
 
రామ్‌గంజ్‌ ఏరియాలో పోలీసులు వాహనాల తనీఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పారిపోయేందు ప్రయత్నించగా, ఓ అధికారి లాఠీ విసరటంతో అతనికి యాక్సిడెంట్‌ అయ్యింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీస్‌ స్టేషన్‌పై విరుచుకుపడ్డారు. రాళ్లు విసిరి పోలీసులను గాయపరిచారు.దీంతో అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. 
 
మరింత రెచ్చిపోయిన స్థానికులు ఓ పవర్‌ హౌజ్‌కు, ఓ ఆంబులెన్స్‌కు నిప్పుపెట్టారు. పలువురు జర్నలిస్ట్‌లకు కూడా గాయాలయినట్లు సమాచారం. హింసలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తదుపరి ఆదేశాలు వెలువడేదాకా మనక్‌ చౌక్‌, సుభాష్‌ చౌక్‌, గల్తా గేట్‌, రామ్‌గంజ్‌ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. 
>
మరిన్ని వార్తలు