కార్యాచరణ రూపకల్పనపై మాకు స్వేచ్ఛ ఇవ్వాలి

8 Dec, 2014 01:38 IST|Sakshi

* సీఎంల కౌన్సిల్ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం: కేసీఆర్
* రాష్ట్రాలకు గ్రాంట్లు, ఆర్థిక నిధులను ఉమ్మడిగా ఉంచాలి
* దీర్ఘకాలిక దృష్టితో 10-15 ఏళ్ల ప్రణాళికలు తయారుచేయాలి
* రాష్ట్రాలు వార్షిక లేదా ద్వైవార్షిక ప్రణాళికలు రూపొందించాలి
* కేంద్ర నిధుల వినియోగంలో  మరింత స్వేచ్ఛనివ్వాలి
* ముఖ్యమంత్రుల సదస్సులో కేసీఆర్ సూచనలు

సాక్షి, న్యూఢిల్లీ:
ప్రణాళిక సంఘానికి కాలం చెల్లిందని, రాష్ట్రాల విభిన్న అవసరాలను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేసే ప్రతిపాదిత ముఖ్యమంత్రుల మండలి ఏర్పాటుకు తమ సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కనీసం 10 నుంచి 15 ఏళ్లకు దీర్ఘకాలిక వ్యూహాలతో ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్రాలే తమ కార్యాచరణ రూపొందించుకునే స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. ప్రణాళికాసంఘం భవిష్యత్తు అంశంపై ఆదివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల సదస్సులో కేసీఆర్ వెల్లడించిన అభిప్రాయాలు, చేసిన సూచనలు ఆయన మాటల్లోనే...
 
 ‘‘ప్రధానమంత్రి తీసుకున్న సాహసోపేతమైన ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. దీనికి మా సంపూర్ణ సహకారం అందిస్తాం. ప్రణాళికాసంఘానికి కాలం చెల్లింది. ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేసే ప్రతిపాదిత ముఖ్యమంత్రుల మండలిని స్వాగతిస్తున్నాం. ఈ ప్రతిపాదిత మండలికి ఒక శాశ్వత సెక్రటరేయట్ ఉండాల్సిన అవసరముంది. ఇప్పటివరకు రాష్ట్రాలకు విభిన్న పథకాల కింద నిధులు విడుదల చేస్తున్నారు. రాష్ట్రాలకు గ్రాంట్లు, ఆర్థిక నిధులను విడివిడిగా కాకుండా ఉమ్మడిగా ఉంచాలి. ఎంతమేర ఉండాలన్న దానిని ఆర్థికసంఘం నిర్ణయించాలి. నిధుల కేటాయింపులు కూడా లక్ష్యాలను అనుసరించి రంగాల వారీగా ఉండాలి. పంచవర్ష ప్రణాళికలకు బదులుగా ఒక వ్యూహాత్మక దీర్ఘకాలిక దృష్టితో కనీసం 10-15 ఏళ్ల ప్రణాళికలను రూపొందించాలి. వీటి అమలుకు వార్షిక ప్రణాళికలు ఉండాలి. ఈ వార్షిక ప్రణాళికలను రాష్ట్రాలు రూపొందించుకోవాలి.
 
శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటుచేయాలి...
 జాతీయ విధానాల రూపకల్పనలో రాష్ట్రాల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఒక ప్రభావవంతమైన వేదిక లేదు. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న వేదిక సమాఖ్య స్ఫూర్తికి సహకరించే రీతిలో ఉంది. ప్రధానమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కౌన్సిల్ దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది. ఇక కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యే కొన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు సబ్‌కమిటీలు ఉంటే సరిపోతుంది. ఉదాహరణకు గంగా కార్యాచరణ ప్రణాళిక, వామపక్ష తీవ్రవాదం వంటి అంశాలు కొన్ని రాష్ట్రాలకే సంబంధించినవి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో సబ్ కమిటీలు వేసుకోవచ్చు. ‘టీం ఇండియా’కు ప్రతి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తూ థింక్ ట్యాంక్ (మేధో నిధి) లాంటి ఒక సహాయక వ్యవస్థ ఉండాలి. ఇందుకు ఒక శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటుచేయాలి. ఇది ప్రతి విధానాన్నీ క్షుణ్నంగా పరిశీలించి వర్తమాన, భవిష్యత్తు ప్రభావాలను అంచనా వేయాలి. ‘టీం ఇండియా’ విధాన నిర్ణయాలు తీసుకునేముందు ఈ థింక్ ట్యాంక్ వ్యవస్థ సాంకేతిక సహకారం అందించాలి. అందువల్ల ఈ థింక్ ట్యాంక్‌లో నిపుణులైన వారిని నియమించాలి. విదేశీయులైనా సరే నియమించుకునే వీలుండాలి. కొన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా అమలైన పథకాలు ఇతర రాష్ట్రాలు అమలుచేసేలా ఈ థింక్ ట్యాంక్ సహాయపడాలి.
 
ప్రయివేటు రంగానికీ అవకాశమివ్వాలి...
 కనీసం ఒక దశాబ్ద కాలానికి సరిపడా ప్రణాళిక వేసుకోవాలి. అది రాష్ట్రాల అభివృద్ధిని, దేశాభివృద్ధిని ప్రతిబింబించాలి. ప్రస్తుతం ఉన్న పంచవర్ష ప్రణాళిక.. దానికి ఉన్న కాలవ్యవధిలో ఒకటి రెండేళ్లు అయిపోయిన తరువాత అమలు కావడం ప్రారంభమవుతోంది. విభిన్న రాష్ట్రాలు విభిన్న స్థాయిల్లో అభివృద్ధి చెంది ఉన్నాయి. కొన్ని వెనుకబడి ఉన్నాయి. అందువల్ల విభిన్న రాష్ట్రాలకు విభిన్న అవసరాలు ఉన్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. వీటిని రాష్ట్రస్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుంది. అందువల్ల రాష్ట్రాలు తమ కార్యాచరణ రూపొందించుకునే స్వేచ్ఛను ప్రసాదించాలి. అలాగే ప్రతిపాదిత కొత్త సంస్థ రచించే ప్రణాళికను అమలుచేసేందుకు రాష్ట్రాలు వార్షిక లేదా ద్వైవార్షిక ప్రణాళికలను రూపొందించుకోవాలి. వార్షిక బడ్జెట్లను అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రణాళికను అమలుచేయాలి. ప్రతిపాదిత దీర్ఘకాలిక ప్రణాళికలు దేశాభివృద్ధిలో ప్రయివేటు రంగ భాగస్వామ్యానికి కూడా అవకాశం ఇవ్వాలి. దేశంలో పెట్టే పెట్టుబడుల్లో నాలుగింట మూడో వంతు ప్రయివేటు రంగానిదే అయినందున వాటికి అనుగుణమైన వాతావరణం కల్పించాలి.
 
 ఆర్థికసంఘం సిఫారసుల మేరకే నిధులు...
 భవిష్యత్తులో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే నిధులన్నీ ఆర్థిక సంఘం సిఫారసుల ఆధారంగానే జరగాలి. ప్రణాళికాసంఘం ద్వారా కేటాయింపులు ఉండరాదు. ఆర్థిక సంఘం సిఫారసులన్నీ పారదర్శకంగా ఒక ఫార్ములా ఆధారంగా ఉండాలి. కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛనిచ్చి స్థానిక అవసరాలకు తగినట్టుగా నిధులు వాడుకునే వీలు కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు - మన ప్రణాళిక’ పేరుతో ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళుతోంది. ప్రణాళికల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి.’’

మరిన్ని వార్తలు