'జైలుకైనా వెళ్తా కానీ.. ఫైన్ మాత్రం కట్టను'

10 Mar, 2016 16:37 IST|Sakshi
'జైలుకైనా వెళ్తా కానీ.. ఫైన్ మాత్రం కట్టను'

న్యూఢిల్లీ: యమునా నది ఒడ్డున శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం' నిర్వహణ విషయంలో ఇంకా వివాదాలు సద్దుమణగడం లేదు. రూ. 5 కోట్లు ప్రాథమిక జరిమానా కట్టి.. షరతులతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జరిమానా కట్టబోమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, 'ఆర్ట్‌ ఆఫ్ లివింగ్' ఫౌండేషన్ స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. 'మేము ఏ తప్పూ చేయలేదు. మేం జైలుకైనా వెళ్తాంగానీ ఒక్కపైసా కట్టబోం' అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అధికారులు ఈ విషయాన్ని హరిత ట్రిబ్యునల్‌కు తెలిపారు. ఇప్పటివరకు ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ జరిమానా కట్టలేదని వెల్లడించారు.

భారీ నిర్మాణాలతో అట్టహాసంగా ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌ వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తవచ్చునని, యమునా నది పర్యావరణపరంగా దెబ్బతినవచ్చునని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ 'ఇది సాంస్కృతిక ఒలింపిక్స్ లాంటిందని, దీనిని ప్రతిఒక్కరూ స్వాగతించాలని కోరారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం కోసం వెయ్యి ఎకరాల్లో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపడుతున్నామని, వాటిని తొందరగా తొలగించే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. శుక్రవారం ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశముంది. కానీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ కార్యక్రమానికి రావొద్దని నిర్ణయించుకున్నారు.

మరిన్ని వార్తలు