సీనియర్‌కు మద్యం తెస్తూ మహిళా నేత బుక్కు

4 Mar, 2017 15:26 IST|Sakshi
సీనియర్‌కు మద్యం తెస్తూ మహిళా నేత బుక్కు

బిహార్‌: మద్యం నిషేధం కొనసాగుతున్న బిహార్‌లో ఓ సీనియర్‌ నేతకు మద్యం తరిలిస్తున్న ఓ మహిళా నేతను పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె నుంచి మొత్తం 16 ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌(ఐఎంఎఫ్‌ఎల్‌) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) పార్టీకి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్జేడీ పంచాయతీ విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నానని ఆమె పోలీసులకు చెప్పింది. గురువారం రాత్రి మాదెపురా జిల్లాలోని సరిహద్దు ప్రాంతం వద్ద ఔట్‌పోస్టును ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రేణుయాదవ్‌ వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు.

అందులో 16 మధ్యం బాటిళ్లు లభ్యం కావడం, ఆమె ఆర్జేడీకి చెందినామెగా చెప్పడంతో పోలీసులు ఖిన్నులయ్యారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. ఆ మద్యాన్ని పశ్చిమ బెంగాల్‌లోని దాఖోలా అనే ప్రాంతం నుంచి మాదెపురాలోని ఓ సీనియర్‌ పార్టీ నేతకు తీసుకెళుతున్నట్లుగా గుర్తించామని పోలీసులు చెప్పారు. అయితే, ఆమె మాత్రం ఆ సీనియర్‌ పార్టీ నేత ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా ఆమెకు తమ పార్టీకి సంబంధమే లేదని ఆర్జేడీ చెప్పింది. గతంలోనే పలు అవినీతిమయపనులు చేస్తుంటే తాము పార్టీలో నుంచి తొలగించామని ప్రస్తుతం ఆమె సీపీఐ(ఎంఎల్‌)లో పనిచేస్తుందని ప్రకటించింది.

మరిన్ని వార్తలు