కేదార్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం

6 Oct, 2013 02:45 IST|Sakshi
కేదార్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం

గోపేశ్వర్: మూడు నెలల వ్యవధి తర్వాత హిమాలయ క్షేత్రాలైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు శనివారం నుంచి యాత్రలు పునఃప్రారంభమయ్యాయి. తొలి బృందంలో  రెండువందల మంది యాత్రికులు ఈ రెండు ఆలయాలను సందర్శించుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో సంభవించిన వరదల్లో భారీ ప్రాణనష్టం సంభవించిన దరిమిలా, ఈ క్షేత్రాలకు రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ క్షేత్రాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా నిర్మించిన కట్టడాలపై ఒత్తిడి ఎక్కువగా ఉండకుండా కేదార్‌నాథ్ ఆలయానికి రోజుకు వంద మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తున్నామని అధికారులు చెప్పారు.
 
 కేదార్‌నాథ్ ఆలయాన్ని శనివారం దర్శించుకున్న వారిలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ ఉన్నారు. కాగా, యాత్రల కోసం గుప్తకాశీలో రోజూ యాత్రికుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చౌహాన్ తెలిపారు. యాత్రికుల భోజన వసతుల కోసం గౌరీకుండ్-కేదార్‌నాథ్ మార్గంలోని భీమబలి, లెంచౌనీలలో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కేదార్‌నాథ్-బద్రీనాథ్ ఆలయాలకు వచ్చే యాత్రికుల కోసం ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ సమితి ప్రధాన కార్యనిర్వాహక అధికారి బీడీ సింగ్ తెలిపారు.

మరిన్ని వార్తలు