‘హోదా’ హామీని అమలు చేయండి

24 Feb, 2016 02:07 IST|Sakshi
‘హోదా’ హామీని అమలు చేయండి

♦ రాష్ట్రపతి ప్రణబ్‌కు జగన్ విజ్ఞప్తి
♦ విభజన హామీలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి
♦ కృష్ణా, గోదావరి నీటి బోర్డులు ఏర్పాటు చేయాలి
♦ కాపు ఆందోళనలో కేసులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి
 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలయ్యేలా చూడాలని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం సాయంత్రం ఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై నాలుగు పేజీల వినతిపత్రం అందజేశారు. జగన్ వెంట పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పి.వి.మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం వైఎస్ జగన్.. రాష్ట్రపతి భవన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీకి రావడానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా అంశమేనని తెలిపారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే...

 ప్రత్యేక హోదా సాధించాల్సిందే...
 ‘‘రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఈరోజు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తున్నా మాటా ్లడే దిక్కు లేదు, అడిగే నాథుడు లేడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వచ్చినా ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. మా పార్టీ గుర్తు చేయకపోతే అసలు ప్రత్యేకహోదా అంశం ఒకటి ఉందా? అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశం గురించి మేము ప్రతిసందర్భం లోనూ ఢిల్లీకి వచ్చి గుర్తుచేస్తున్నాం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిని అపాయింట్‌మెంట్ అడిగాం. జాట్ల సమస్య నేపథ్యంలో ఇప్పుడు అపాయింట్‌మెంట్ ఇవ్వలేకపోతున్నామని ప్రధానమంత్రి కార్యాల యం తెలిపింది. రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాం. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ గుర్తుచేశాం. వీటిని కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశాం’’ అని చెప్పారు.

 కేసీఆర్‌తో బాబు కుమ్మక్కు
 తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చంద్రబాబు కుమ్మక్కు కావడంవల్లనే కృష్ణా, గోదావరి వాటర్ బోర్డులపై మాట్లాడటంలేదని జగన్ ధ్వజమెత్తారు. ‘‘బోర్డులను ఏర్పాటు చేయకపోవడం వల్ల పాలమూరు నుంచి రంగారెడ్డికి 90 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైతే కిందనున్న శ్రీశైలం, సాగర్‌కు నీళ్లు రావు.  సీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా డెల్టా మొత్తానికి నీళ్లు అందని పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా టెండర్లు పిలవడం దారుణమని, దాన్ని ఆపించి కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతికి విన్నవించాం’’ అని వివరించారు.

 గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలి
 రాష్ట్రంలో గిరిజన సలహామండలిని ఏర్పాటు చేయని విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లినట్లు జగన్ తెలిపారు. ‘‘రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలి. ఈ మండలిలో సభ్యులుగా మూడొంతుల మంది రాష్ట్రానికి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు ఉండాలి. ఏపీలో ఏడు ఎస్టీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో ఆరు సీట్లు వైఎస్సార్‌సీపీ గెలిచింది. దాంతో మెజారిటీ సభ్యులు వైఎస్సార్‌సీపీ సభ్యులే ఉంటారని భావించి.. గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయడం లేదు. చంద్రబాబు ఈ మండలిని ఏర్పాటు చేయకుండా రాష్ట్రంలోని గిరిజనుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. గిరిజనులకు సంబంధించిన కీలక నిర్ణయాలను వారికి తెలియకుండానే తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం’’ అని చెప్పారు. రైల్వే జోన్ నుంచి ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలను గుర్తుచేశామన్నారు.

 బాబును జైల్లో పెట్టాలి: కాపు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా జరిగిన విధ్వంసకాండపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ర్టపతిని కోరినట్లు జగన్ తెలిపారు. ‘‘టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ  ఉద్యమించారు. తునిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్ పక్కనే సభకు పర్మిషన్ ఇవ్వడం చంద్రబాబు చేసిన మొదటి తప్పు. పోలీసులు ఎవరూ లేకుండా చూడడం రెండో తప్పు. లక్ష మంది రైల్వే ట్రాక్‌పై ఎక్కితే మాస్ హిస్టీరియా క్రియేట్ అవుతుందని తెలిసినా కూడా బారికేడ్లు పెట్టలేదు. చంద్రబాబు చేతగానితనం వల్ల మాస్ హిస్టీరియా క్రియేట్ అయి గొడవలు జరిగితే దాన్ని కుట్రగా నామకరణం చేసి ప్రతిపక్ష నేతలపై దొంగకేసులు పెట్టారు. దీనిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరాం. కనీసంగా సీబీఐతోనైనా విచారణ జరిపించాలని అడిగాం’’ అని చెప్పారు. ఈరకంగా దొంగకేసులు పెట్టిన బాబును జైల్లో పెట్టాలని దుయ్యబట్టారు.

 రాష్ట్రంలో అనేక అవినీతి కుంభకోణాలు
 రాష్ట్రంలో పోలవరం నుంచి పట్టిసీమ దాక, పట్టిసీమ నుంచి జీవో 22 దాక, కొన్ని పరిశ్రమలను ఎంపిక చేసుకుని కమిషన్లు తీసుకుని ప్రోత్సాహకాలు ఇవ్వడం, కొన్ని డిస్టిలరీలకు మాత్రమే కమిషన్లు తీసుకుని విస్తరణకు అనుమతులు ఇవ్వడం వంటి అనేక అవినీతి కుంభకోణాలు చోటుచేసుకున్నాయని జగన్ చెప్పారు. ‘‘మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి గుజరాత్, తెలంగాణలో కేవలం రూ.4.4 కోట్లు ఉంటే... విజయవాడ వీటీపీఎస్, కృష్ణపట్నం ధర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో 6.32 కోట్లు, రూ. 5.84 కోట్లు ఉంది. దారుణంగా ఇంతింత రేట్లు పెంచి 2,600 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారు. చంద్రబాబు  చేస్తున్న స్కాముల గురించి ఎంక్వైరీ చేయించాలని అడుగుతూ వినతిపత్రాలు ఇస్తూ ఉన్నాం. వీటిపై ప్రధానమంత్రికి, హోంమంత్రికి కూడా ఫిర్యాదుచేస్తాం’’ అని తెలిపారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తుంటే... చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా తమపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత దారుణమైన రాజకీయాలు చూస్తే బాధేస్తుందని చెప్పారు. తాము చెప్పిన అంశాలపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని, కేంద్రంతో  మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారని తెలిపారు. రాష్ట్రపతి సానుకూల స్పందనకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు