రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

17 Apr, 2018 13:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు మంగళవారం కలిశారు. పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యుల రాజీనామా, అందుకు దారితీసిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా తాము చేసిన పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షలను వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు అన్ని అంశాలపై వినతిపత్రం సమర్పించారు.

ఏపీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయడం లేదని, కేంద్రం వైఖరితో రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతోందని, జోక్యం చేసుకోవాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిని కలిసిన ఎంపీల బృందం ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి లేఖను అందచేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలో రాష్ట్రపతి కలగచేసుకోవాలని ఆ లేఖలో వైఎస్‌ జగన్‌ కోరారు. ఇక రాష్ట్రపతిని కలిసినవారిలో మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.

హోదా ఏపీ ప్రజల హక్కు
రాష్ట్రపతితో భేటీ అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రపతికి అన్ని విషయాలు వివరించామన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇక ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి అద్భుతమైన రాజధాని నిర్మించి ఇస్తామని  తిరుపతి బహిరంగ సభలో నరేంద్రమోదీ మాట ఇచ్చారన్నారు. ఈ హామీని ప్రధాని విస్మరించి, ఘోర తప్పిందం చేశారన్నారు.

ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, ఎప్పటికైనా సాధించుకుంటామని ఎంపీ మేకపాటి అన్నారు. ఇప్పటికైనా విభజన హామీలు అమలు చేయమని కోరుతున్నామమన్నారు. రాజ్యాంగపరంగా తాను ఏం చేయగలనో అవి చేస్తామని రాష్ట్రపతి కోవింద్‌ హామీ ఇచ్చారని మేకపాటి తెలిపారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ...హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారని మేకపాటి విమర్శించారు. ఆయన వైఖరితో ఏపీకి నష్టం వాటిల్లిందన్నారు. పైపెచ్చు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై నిందలు మోపడం సరికాదన్నారు. అలాగే నిన్న జరిగిన ఏపీ రాష్ట్ర బంద్‌ విజయవంతమైందన్నారు. బంద్‌తో రాష్ట్ర ప్రజల ఆకాంక్ష వెల్లడైందన్నారు.

రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి
రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు ఆయన తెలిపారు. ఇక ప్రజల్లోకి వెళతామని, ప్రజల్లోనే ఉంటామని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఊపిరి ఉన్నంతవరకూ పోరాటం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చిత్తశుద్ధితోనే పదవులకు రాజీనామాలు చేశామని, తమ రాజీనామాలు తప్పనిసరిగా ఆమోదిస్తారని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి కేంద్రంపై మళ్లీ ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రపతికి వైఎస్‌ జగన్‌ రాసిన లేఖ ఇదే..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు