అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

5 Oct, 2019 22:03 IST|Sakshi

అబుదాబి : తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలంగాణవాసులు ఆదేశ రాజధాని అబుదాబిలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. అక్కడి తెలంగాణ సంఘం గత నెలరోజులుగా ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఈ అద్భుత కార్యక్రమానికి స్థానిక ఇండియన్‌ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికైంది. అయితే ఎడారి ప్రాంతం కావడం వల్ల పూలు దొరకడం చాలా కష్టం. కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో నిర్వాహకులు ఇండియా నుంచి రకరకాల పూలను, వందల కిలోల్లో తెప్పించి అబుదాబిని పూలవనంగా మార్చారు. 

శనివారం ఉదయం ఇండియా నుంచి తెచ్చిన తీరొక్క పూలతో, పల్లె వాతావరణాన్ని తలపించేలా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం వందలాది మహిళలు, చిన్నారులు నెల రోజులు కష్టపడి రూపొందించిన నృత్య ప్రదర్శనలతో, బతుకమ్మ పాటలతో ప్రాంగణాన్ని మార్మోగించారు. ఇండియా నుంచి వచ్చిన ప్రమఖ కవి గాయకులు కోకిల నాగరాజు, సాయిచంద్‌లతో పాటు టీన్యూస్‌లోని ధూమ్‌ధామ్ ముచ్చట్లు యాంకర్ కుమారి ఉదయ శ్రీలు వివిధ రకాల ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం తెలంగాణ సాంప్రదాయం ప్రతిబింబించేలా డప్పు వాయిద్యం, కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో జంటల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుంచి తెప్పించిన పిండి వంటలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యుఏఈలోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్‌ సెక్రటరీ శ్రీమతి పూజ వెర్నెకర్, ఐఎఫ్ఎస్ అధికారిణి హాజరయ్యారు. వారుకూడా తెలంగాణ మహిళలతో బతుకమ్మ ఆడిపాడారు. తదనంతరం కార్యక్రమ నిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 5 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు, జంటలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదాతలైన బూర్జిల్‌ హాస్పిటల్‌, పే ఇట్, రాయల్ రెజిస్, ఎస్పాకో, ఎన్ఎంసి, యుఏఈ ఎక్సేంజ్‌, ఆసమ్ సలోన్, రోచన గ్రూప్ వారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. చివరగా గౌరీపూజ చేసి బతుకమ్మను కృతిమ కొలనులో నిమజ్జనం చేశారు. అనంతరం ప్రసాదాలు తీసుకుని, విందు భోజనం చేశారు. ఈ కార్యక్రమాన్నిగోపాల్‌, వంశీ, కమలాకర్‌, శ్రీనివాస్‌, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, రాజశ్రీనివాస రావు, అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, వనిత, మంజు, సౌజన్య , లక్ష్మి, సుధ తదితరులు దగ్గరుండి నడిపించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలను విదేశాలలో ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని నిర్వాహకులు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు