అడకత్తెరలో ఆయుర్వేదం

6 Apr, 2015 00:45 IST|Sakshi

డా. వీఎల్‌ఎన్ శాస్త్రి
 
 అనేకమైన మొండిరోగాల ఆటకట్టించాలం టే ఆయుర్వేదం అవసరం. ఏ వ్యాధినీ దరికి రానీయకుండా వ్యాధి క్షమత్వక శక్తిని పెంపొందించుకొంటూ, ఓజస్సును సంతరిం చుకుంటూ, అఖండమైన ఆరోగ్యంతో నిండు నూరేళ్లు హాయిగా జీవించాలంటే ఆయుర్వే దం తప్ప వేరే మార్గం లేదంటే అతిశయోక్తి కానేకాదు. ‘వాతావరణ (పంచమహాభూతాల) కాలుష్యం, తిండిపదార్థాల కల్తీ, మానసిక ప్రశాంతతను మట్టుపెడు తున్న ఒత్తిడి, గతి తప్పిన జీవనశైలి నేటి ప్రధాన సామాజిక సమస్యలు. ఇవన్నీ మానవుని ‘ప్రజ్ఞాపరాధం’ ఫలి తమేనని చెబుతూ వాటికి సరైన సమాధానాల్ని పొందుపరిచింది ఆయుర్వేదం. ఇంతటి మహత్తర సనా తన శాస్త్రాన్ని సమగ్రంగా అధ్య యనం చెయ్యాలంటే, 5 1/2 సంవత్సరాల బీఏఎంఎస్ కోర్సు, 3 ఏళ్ల ఎండీ కోర్సు అవసరమని నిర్ణయించింది. ‘భారతీయ వైద్య కేంద్ర మండలి (సీసీఐఎం). ఈ కోర్సులను నడిపే కళాశాల, ఆసుపత్రి ఒకదానికొకటి దగ్గరగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటేనే, సరైన ప్రమాణాలతో కూడిన ఆయుర్వేద వైద్యులు ఉత్పన్నమవుతారు. అట్టి ఆసుపత్రులు లేని కళాశాలలు ‘వేద పాఠశాలల’తో సమానమవు తాయే తప్ప ప్రజాసేవకు పనికొచ్చే ‘ఆయుర్వేద కళాశాలలు’ కానేరవు.


 గత పదిహేనేళ్లుగా ‘రాష్ట్ర ప్రభుత్వపు ఆయుష్’ విభాగం ఎంతో సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ‘దినదినగండం దీర్ఘాయుష్షు’గా కాలం గడుపుతోంది. ఇంకా వెనుకకు వెళితే హైదరాబాద్‌లో గల డా॥బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు, బోధనా ఆసుపత్రికి సొంత భవనాలు లేక, స్వయం ప్రతిపత్తిలేక, విల విలలాడిన విషాదగాథలున్నాయి. ఈ కళాశాల ఇంతవరకు కనీసం 30-40 అద్దె భవనాలు మార్చిందన్నది నగ్న సత్యం. ఎట్టకేలకు దివం గత సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి  హయాంలో కొంత ఉపశమనం లభించింది. ఎర్రగడ్డలో ఛాతీ ఆస్పత్రి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సుమారు పది ఎకరాల స్థలం ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రి నిర్మా ణానికి కేటాయించారు. మాకు జాగా దక్కింది కాని కట్టడాలకు నిధుల కొరత అలానే ఉంది. అప్పుడు కేంద్ర సహాయాన్ని కోరుతూ కాళ్లరిగేలా తిరిగాం. అరకొరగా ఉన్నప్పటికీ రాష్ట్ర, కేంద్ర నిధులను కలుపుకుంటూ ఇప్పుడు కన్పిస్తున్న భవనాలను నిర్మించుకున్నాం. అదీ ఒక్కసారి గాదు దఫదఫాల్లో. అయినప్పటికీ కావాల్సిన సంఖ్యలో వైద్యులు, అధ్యా పకులు లేరంటూ, అడ్మిషన్లకు అనుమతి నిరాకరిస్తూ, ప్రతి సంవత్సరం తాఖీదులు జారీ చేస్తూనే ఉంది కేంద్ర మండలి. నేటికీ ఈ సమస్య ఒక కొలిక్కి రాలేదు.


 ఇటీవల 20 సంవత్సరాల్లో ఆయుర్వేద కాలేజీకి, ఆస్పత్రికి ఒక సొంత భవనం, అదీ ఒకే ప్రాంగణంలో ఉండబట్టి, కొంత వరకు ప్రజా దరణకు నోచుకుంటోంది. ప్రభుత్వం దృష్టిలో ఆలోచిస్తే, ‘ఏముంది? ఇక్కడి నుంచి, ఇంకోచోటుకి మారుస్తున్నాం. వేరే భవంతులిస్తాం, మీకా హక్కుంది కదా’ అంటారు. వాదనకు ఇది బాగున్నా, క్రియాశీల కంగా ఆయుర్వేదం దెబ్బతింటుంది. కళాశాలని నడపటం కష్టమవు తుంది. అలవాటుపడ్డ ఆసుపత్రి సేవల్ని ప్రజలకందిస్తూ గాడిలో పడ టం ఇబ్బందవుతుంది. కారణం ఇది వృత్తి విద్యాకళాశాల, అందులోనూ ఆస్పత్రితో సంబంధం ఉన్న విద్య.
 
 గత 50 ఏళ్లలో ఎంతో మంది ఆయుర్వేద ప్రభుత్వ వైద్యాధికారు లు, ఆయుర్వేద అభిమానులు, ప్రజాప్రతినిధులు, ఆయుర్వేద సేవా సంఘాలు సమష్టిగా చేసిన పెద్ద కృషికి దక్కిన చిన్న ఫలితమే ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి, కళాశాల. వికసించే పథంలో ఉన్న మొగ్గల్ని కత్తిరిం చవద్దు. ఆయుర్వేద కుసుమాలను వికసింపనీయండి. అలాగే పక్కనే ఉన్న యునానీ సౌధాన్ని కూడా పరిరక్షించండి. దానిమీదకు కూడా దృష్టి పోనీయకండి. ఎర్రగడ్డలో గల నాటితరం ముఖ్యమంత్రి పేరు మీద వర్థిల్లుతున్న డా॥బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను, దానికి అనుసంధానమైన బోధనా ఆస్పత్రిని అక్కడే ఉంచాలి. మరిన్ని నిధులు మంజూరు చేసి వాటిని మరింత అభివృద్ధి చేయాలని ప్రార్థిస్తున్నాం. కేంద్రమండలి నిర్దేశించిన ప్రమాణాలను సమకూరుస్తూ, ప్రతి సంవత్సరం అడ్మిషన్ల సమయంలో ఆవహిస్తున్న భీతిని శాశ్వతంగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.
 వ్యాసకర్త విశ్రాంత అదనపు సంచాలకులు, సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్ (ఆయుర్వేద), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్
 మొబైల్  : 9963634484

మరిన్ని వార్తలు