విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను పోటు! | Sakshi
Sakshi News home page

విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను పోటు!

Published Mon, Apr 6 2015 12:41 AM

విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను పోటు! - Sakshi

 100 ఎఫ్‌ఐఐలకు నోటీసులు..
 చెల్లించాల్సిన పన్నులు
 10 బిలియన్ డాలర్లకుపైనే!
 
 న్యూఢిల్లీ/ముంబై: విదేశీ ఫండ్ సంస్థలు, ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)పై భారత్ పన్నుల కొరడా ఝుళిపిస్తోంది. దేశీ మార్కెట్లలో కార్యకలాపాలపై గత కొన్నేళ్లుగా పన్నులు చెల్లించకుండా ప్రయోజనం పొందిన 100కు పైగా ఇలాంటి సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. చెల్లించాల్సిన పన్నుల మొత్తం 5-6 బిలియన్ డాలర్లుగా అంచనా. విదేశీ ఫండ్స్‌కు ఇంత భారీ మొత్తంలో పన్ను డిమాండ్ నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, అసెస్‌మెంట్లు, నోటీసులు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఈ పన్నుల మొత్తం 10 బిలియన్ డాలర్లకు(దాదాపు రూ. 62,000 కోట్లు) పైనే ఉండొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ నోటీసులతో కంగుతిన్న విదేశీ ఇన్వెస్టర్లు నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ విధాన నిర్ణేతలతో ఇప్పటికే లాబీయింగ్‌ను మొదలుపెట్టారు.
 
  స్థిరమైన పన్నుల వ్యవస్థకు కట్టుబడి ఉంటామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా తాజా చర్యలు ఉంటున్నాయని గగ్గోలు పెడుతున్నారు.మ్యాట్ సంకటం...: 20% కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) చెల్లించాలంటూ ఈ ఏడాది మార్చి 31 నాటికి 100 ఎఫ్‌ఐఐలకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. వీటికి కొనసాగింపుగా అసెస్‌మెంట్ ఆర్డర్లను జారీ చేసే ప్రక్రియలో ఉంది. కాగా, ఎఫ్‌ఐఐలపై(వీరినే ఇప్పుడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు-ఎఫ్‌పీఐలుగా వ్యవహరిస్తున్నారు) మ్యాట్ విధింపుకు కుదరదని.. ఎందుకంటే తాము భారత్‌లో ఎలాంటి వ్యాపార ఆదాయాలను ఆర్జించడం లేదనేది ఆయా ఇన్వెస్టర్ల వాదన.
 
 ఐటీ చట్టం ప్రకారం తమ ఆదాయాన్ని మూలధన లాభాలు(క్యాపిటల్ గెయిన్స్) గానే పరిగణించాల్సి ఉంటుందని కూడా ఎఫ్‌ఐఐలు పేర్కొంటున్నారు. ఈ  విషయంలో కలుగజేసుకోవాలంటూ ప్రధాని మోదీని కూడా విజ్ఞప్తి చేసే ప్రణాళికల్లో ఉన్నారు. దేశంలో సుమారు 8,000 రిజిస్టర్డ్ ఎఫ్‌పీఐలు ఉన్నట్లు అంచనా. దేశీ స్టాక్, బాండ్ మార్కెట్లో ఇప్పటివరకూ వారి నికర పెట్టుబడులు రూ.11 లక్షల కోట్ల పైనే ఉన్నాయి. ఒక్క 2014-15లోనే రూ.2.7 లక్షల కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. 1993లో భారత్‌లోకి ఎఫ్‌ఐఐలను అనుమతించిన తర్వాత ఎఫ్‌ఐఐలను మ్యాట్ చెల్లించమని కోరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 

Advertisement
Advertisement