పిడికిలెత్తిన ‘యూరో’ జనం

1 Jun, 2014 00:42 IST|Sakshi
పిడికిలెత్తిన ‘యూరో’ జనం

విశ్లేషణ
బలపడుతున్న పచ్చి మితవాదానికి, వామపక్ష అతివాదానికి పునాది ఈయూ ఆర్థిక తాత్వికతలో భాగంగా మారిన పొదుపు చర్యలే. ఈ రెండు ధోరణులూ ఈయూ అస్థిత్వానికి చరమ గీతం పాడేవే. రెండు ధోరణుల్లోనూ దేనినైనా ఎంచుకోవాల్సి వస్తే ఈయూ నేతలు లె పెన్ మితవాద జాతీయవాదం బాటనే ఎంచుకుంటారు.
 
యూరప్ పెను భూకంపానికి గురయిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండె గత సోమవారం దిగ్భ్రాంతితో నోరు తెరిచారు. అది యూరోపియన్ యూనియన్ ఎన్నికల ఫలితాల ఉత్పాతం. హాలెండే నోరు తెరిచింది ఫ్రాన్స్‌లో అధికార సోషలిస్టు పార్టీ 14 శాతం ఓట్ల ఘోర పరాభవంతో మూడో స్థానంలో నిలిచినందుకు కాదు... ‘సరిహద్దులు లేని ఒకే దేశం’ యూరోపియన్ యూనియన్ (ఈయూ) అస్థిత్వానికే ఎసరు తేనున్న పెను ముప్పును చూసి. 751 సభ్యుల యూరోపియన్ పార్లమెంటులో దాదాపు 140 మంది ఈయూను పూర్తిగానో, పాక్షికంగానో వ్యతిరేకించేవారే కానున్నారు.
 
 ఈయూ మూడు మూల స్తంభాల్లో రెండైన ఫ్రాన్స్, బ్రిటన్‌లు ప్రజలు మాత్రం దివాలా తీసిన ఈయూ దుకాణం కట్టిపెట్టేసి ఎవరి దారి వారు చూసుకోవడమే ఉత్తమమని తీర్పు చెప్పడం ఆందోళనకరమే మరి. 28 ఈయూ దేశాల్లో జరిగిన ఎన్నికల్లో గత దఫా కంటే ఓటర్లు ఎక్కువగా పాల్గొన్నా పోలింగ్  42 శాతమే! జాతీయ ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరిగినా ఈయూ ఎన్నికలపై   ఓటర్లు ఇలా నిరాసక్తతను వ్యక్తం చేయడమే సాధారణమే. ఈయూ ఒకే దేశంగా ఎంతగా ‘ఐక్యమైందో’ చెబుతుంది.
 
 25 నుంచి 30 శాతం ఓటర్లు ఆ ‘ఐక్యత’ పట్ల సైతం వ్యతిరేకతను కనబరిచారు. ‘యూరో’ పట్ల, యూరోపియన్ కమిషన్ ఆధిపత్యం పట్ల వ్యతిరేకత గత ఏడాది కంటే కూడా పెరిగినట్టు ఎన్నికలకు ముందే వెల్లడైంది. అయినా ఫలితాలు ఇలా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. ఈయూకు అత్యంత కీలకమైన జర్మనీలో అధికార పార్టీ పరువు దక్కించుకున్నదన్న ఊరటకంటే... తదుపరి ఎన్నికల నాటికి ఈయూ మద్దతుదార్ల సంఖ్య ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరికి పడిపోక తప్పదనే అంచనాలు సృష్టిస్తున్న ఆందోళనే ఈయూ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క రోజుకు రాజులైన ఓటర్ల సందడి సద్దుమణిగాక వడ్డించాల్సిన సబ్ ఠీక్ హై కథనాలను మీడియా ‘నిపుణులు’ ఇప్పటికే సిద్ధం చేశారు.   
 
 రాజకీయ నాయకత్వ వైఫల్యం?
 ఎన్నికల ఫలితాల వల్ల ఈయూ అనుకూల పార్టీలకు, వాటి ఆధిపత్యానికి ఇప్పుడొచ్చిన ముప్పేమీ లేదు. కాబట్టి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), యూరోపియన్ కేంద్ర బ్యాంకు (ఈసీబీ), యూరోపియన్ కమిషన్ (ఈసీ) ‘త్రయం’ ఇకపై కూడా యూరప్‌పై ఏకచ్ఛత్రాధిపత్యం నెరపగలదు. అయితే యూరప్ వ్యాప్తంగా జర్మనీ సహా ప్రతి చోటా  ఈయూ పట్ల, ‘పొదుపు’ (ఆస్టిరిటీ) చర్యల పట్ల పెరుగుతున్న అసంతృప్తిని, వ్యతిరేకతను ఎలా వివరించాలి? ఈయూ నేతలు, వారి మద్దతుదార్లు సైతం ఈ అంసతృప్తిని ‘గుర్తిస్తున్నారు.’ కానీ అదంతా ఆయా దేశాల్లోని రాజకీయ అస్థిరత, నాయకత్వ అసమర్థతల ఫలితమేనని కొట్టిపారేయాలని ప్రయత్నిస్తున్నారు.
 
 ఉదాహరణకు, నేటి అంతర్జాతీయ సంచలనం మెరిన్ లె పెన్ ఇమ్మిగ్రేంట్స్‌కు (వలస వచ్చిన విదేశస్తులు) వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతుంటే ఆమెకు సమాధానం చెప్పలేకపోవడమే ఫ్రాన్స్‌లో సోషలిస్టుల ఓటమికి కారణం. బ్రిటన్‌లో మితవాద పక్షం ఓటమికి కారణం యూకేఐపీకి సమాధానం చెప్పలేకపోవడం!
 
 యూరప్ వ్యాప్తంగా  విదేశస్తులు, ముస్లింల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు, జాతీయవాద, జాతీయోన్మాద ధోరణులకు లె పెన్ విజయమే నిదర్శనం. ఫ్రాన్స్, బ్రిటన్‌లలో వలే ఘన విజయాలను సాధించకున్నా మొత్తంగా ఈ పార్టీలు పెద్ద ఎత్తున ప్రతి చోటా బలపడ్డాయి. గ్రీస్‌లో పొదుపు చర్యలను, ఈయూను వ్యతిరేకించే వామపక్ష సిర్జియా విదేశీయులపట్ల, ముస్లింలపట్ల ఎలాంటి వ్యతిరేకతా లేకుండానే విజయం సాధించింది. అక్కడే నియోనాజీ పార్టీ గోల్డెన్ డాన్ కూడా గణనీయంగా బలం పుంజుకుంది. మొత్తంగా యూరప్‌లో ఇటు మితవాదం, జాతీయోన్మాదం అటు పాప్యులిస్టు పార్టీలుగా పిలిచే ప్రభుత్వ సంక్షేమ వ్యయాలు, ఉపాధి కల్పనకు పట్టం గట్టే పార్టీలు పుంజుకున్నాయి.
 
 ఇంచుమించుగా ప్రతి చోటా ప్రజల అసంతృప్తి సాంప్రదాయేతరమైన కొత్త పార్టీలవేపే మొగ్గు చూపింది. అందుకే సోషల్ డెమోక్రాట్లు, కమ్యూనిస్టుల వంటి సంప్రదాయ వామపక్షాలు ఎక్కువగా దెబ్బతినిపోయాయి. ప్రజల అసంతృప్తి వ్యక్తమైన తీరు భిన్నంగా ఉన్నా అది వేలెత్తి చూపుతున్నది మాత్రం గత ఐదేళ్లుగా ఈయూ త్రయం ప్రజలపై రుద్దుతున్న పొదుపు చర్యలవైపూ, ఆరేళ్ల తదుపరి కూడా వదలని ఆర్థిక సంక్షోభం వైపు. వాటికి ఏమని ‘సమాధానం’ చెప్పాలి? ఈయూ దేశాలన్నిటిలోనూ కలిపి సగటున 12.2 శాతానికి చేరిన నిరుద్యోగానికి ‘సమాధానం’ ఏమిటి? 2011లోనే కోలుకుందన్న అమెరికా వృద్ధి 2014 మొదటి త్రైమాసికలో తిరిగి అథోముఖం పట్టిన చేదువాస్తవం ఎదురుగా ఉండగా ఈయూ కోలుకుంటుందని ఎలా సమాధాన పరచగలరు?
 
 మరణ శాసనమే
 ఈయూ నేతల మౌనమే లె పెన్‌ల బలం. వలస వచ్చిన విదేశస్తులే నిరుద్యోగం తదితర ఆర్థిక కడగండ్లకు కారణమంటూ యూరప్ అంతటా యాంటీ ఇమ్మిగ్రేషన్ పార్టీలు ‘సమాధానం’ చెబుతున్నాయి. గత పదేళ్లలో 20 లక్షల మంది అత్యున్నత స్థాయి వృత్తి నిపుణులు బ్రిటన్, అమెరికాలకు వలసపోయారు. దీంతో తూర్పు యూరప్, ఆసియాలనుంచి వలస శ్రామిక శక్తి వలస రాకపోతే ఫ్రాన్స్ మరింత సంక్షోభంలో పడుతుంది. గత వందేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వలస పోవడం 7 రెట్లు పెరిగి, 700 కోట్లకు చేరింది. ఇలాంటి వాస్తవాలు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఆరేళ్ల ఆర్థిక సంక్షోభం పరిష్కారం కాకున్నా. తిండీబట్టా గూడూ లేకున్నా, వాటిని సంపాదించుకునే ఉపాధి అవకాశాలు లేకున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆసరాను ఎప్పటికో అప్పటికి ఎలాగోలా స్వేచ్ఛా విపణి దేవతలు కరుణిస్తారని చెప్పాలి. అలాంటి కాకమ్మ కబుల్లు వినే రోజులు పోయాయి.
 
 మితవాద లె పెన్‌లు, వామపక్ష ట్సియాపరస్‌లు చెప్పే సమాధానాలు నమ్మే పరిస్థితి వచ్చిందనేదే ఈయూ ఎన్నికల ఫలితాల సారం. లె పెన్‌లకు విరుద్ధంగా గ్రీస్ నేత ట్సియాపరస్ మరో మార్గం చూపుతున్నారు. గ్రీస్‌ను రుణాల ఊబిలోకి దించిన ఈయూ నుంచి, యూరో నుంచి వైదొలగి, విదేశీ రుణాలను ఎగ్గొట్టి సంక్షోభం నుంచి బయటపడే మార్గం. లె పెన్‌ల కంటే యూరో అధినాయక త్రయానికి ట్సియాపరస్‌లంటేనే భయం. గ్రీస్ బోర్డు తిప్పేస్తే మునిగేది ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్  బ్యాంకర్లే. గత ఐదేళ్లలో 30 శాతం వేతనాల కోతను, 27.7 శాతం నిరుద్యోగం క్షోభను అనుభవిస్తోన్న గ్రీస్ ప్రజలకు అంతకుమించిన తరుణోపాయం ఏముంది? వామపక్ష సిరిజా ట్సియాపరస్, పచ్చి మితవాద జాతీయోన్మాద లె పెన్‌లు ఇద్దరి పరిష్కారాలూ ఈయూకు చరమగీతం పాడేవే.
 
 అంతదాకా ఎందుకు యూరో కరెన్సీని ఆమోదించని బ్రిటన్ కన్సర్వేటివ్ పార్టీయే రెండేళ్ల తదుపరి ఈయూ నుంచి బయటపడే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనుకుంటోంది. ప్రతి ఈయూ దేశంతోనూ భారీ విదేశీ వాణిజ్య మిగులు ఉన్న జర్మనీయే ఈయూ ఐక్యతను ఆచరణలో నిరాకరిస్తోంది. అన్ని దేశాలు జర్మనీ నుంచి కొనాల్సిందే తప్ప అది ఎవరి దగ్గరి నుంచి కొనదు. లె పెన్‌లు కోరుతున్నట్టు శ్రామిక శక్తి గమన శీలతను నిరోధించే వలసల వ్యతిరేక చట్టాలు రావడమంటే జాతీయ రాజ్యాల సరిహద్దులు పటిష్టం కావడమే. ఈయూ అస్థిత్వాన్ని రద్దు చేయడమే.
 
 బలపడుతున్న పచ్చి మితవాదానికి, అతివాద వామపక్ష వాదానికి పునాది ఈయూ ఆర్థిక తాత్వికతలో భాగంగా మారిన పొదుపు చర్యలే. ఈ రెండు ధోరణులూ ఈయూ అస్థిత్వానికి చరమ గీతం పాడేవే. రెండు ధోరణుల్లోనూ దేనినైనా ఎంచుకోవాల్సి వస్తే ఈయూ నేతలు లె పెన్‌ల బాటనే ఎంచుకుంటారు. అప్పుడే యూరోపియన్ బ్యాంకర్లు సుఖంగా ఉంటారు. వడ్డీలు, అసళ్లు భద్రంగా ఉంటాయి. యూరప్‌లో రెక్క విప్పుతున్న నియోనాజీ జాతీయోన్మాద ధోరణులను వ్యతిరేకించేవారు గుర్తించనిది ఒక్కటే. యూరప్‌కు ఎదురవుతున్న  నాజీయిజం ముప్పు లె పెన్‌ల నుంచి, గోల్డెన్ డాన్ల నుంచి కాదు... పొదుపు చర్యల నుంచి, ఈయూ అనే అర్థరహితమైన అవ్యవస్థ నుంచి.  
                                                      - పిళ్లా వెంకటేశ్వరరావు

>
మరిన్ని వార్తలు