శాస్త్రవేత్తలకే ‘గురు’వయ్య!

26 Jan, 2014 23:45 IST|Sakshi
శాస్త్రవేత్తలకే ‘గురు’వయ్య!

 అచ్చమైన రైతు ఆవిష్కరణ ‘గురవయ్య గొర్రు’ పొలంలో విత్తనం, ఎరువు, కలుపు మందులను ఏకకాలంలో వేయడం దీని ప్రత్యేకత
 
 చెమట తడిసిన నేల సిరులు కురిపిస్తుందనే విశ్వాసంతో అహర్నిశలు శ్రమించడం, పుడమి తల్లిని పులకింపజేసి పంట సిరులు పండించడం ఆయన దినచర్య.  ఏ పట్టాలూ లేవు. శాస్త్ర, సాంకేతిక పదాలు అసలే తెలియవు. తెలిసిందల్లా సేద్యమే. కూలీల కొరతను అధిగమించి, సాగు ఖర్చును తగ్గించేందుకు ఉపయోగపడే అద్భుతమైన గొర్రును కనిపెట్టారు. ఇది ఒకేసారి 5 పనులు చేస్తుంది. పెద్ద చదువులు చదివిన శాస్త్రవేత్తలకూ వల్లకాని పనిని సాధించి దేశవ్యాప్త ఖ్యాతి గడించారు. ఈ రైతు శాస్త్రవేత్త పేరు తొండపి గురవయ్య. ఊరు గుంటూరు జిల్లా పల్నాడులోని రూపెనగుంట్ల.  
 
 ‘ఈ పని రైతు వల్లనే అవుతుంది..’
 సుమారు నాలుగేళ్ల క్రితం.. లాం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ యల్లమందారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన రైతుల సమావేశంలో చర్చ గురవయ్యకు ప్రేరణ కలిగించింది. వరి కోతలయ్యాక దుక్కి దున్నకుండా (జీరోటిల్లేజ్) మొక్కజొన్న విత్తడం, పత్తి తీయడం, మిర్చి కాయలు కోయడం.. ఈ మూడు పనులు చేసే యంత్ర పరికరాలు మన దేశంలోనే అందుబాటులో లేవు. వీటిని తయారుచేయడం ఇంకో పదేళ్లకైనా అనుభవజ్ఞులైన రైతులకే సాధ్యం. ఆ పని చేసిన రైతు కోటీశ్వరుడవుతాడన్నది చర్చ సారాంశం. ఈ మాటలు గురవయ్యలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అప్పటికే ఈ దిశగా ప్రయత్నిస్తున్న ఆయనలో పట్టుదల పెరిగింది. తొలుత బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ సహాయ పడింది. పల్లె సృజన స్వచ్ఛంద సంస్థ తోడ్పాటుతో నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం పొందిన తర్వాత ఆయన లక్ష్యాన్ని ఛేదించారు.
 
 జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్ధ, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం,  ‘నిట్’ (వరంగల్) సన్మానించాయి. జాతీయ స్థాయి ‘శాంసంగ్ ఇన్నొవేషన్ కోషియంట్-2012’ పోటీల్లో రూ. 3 లక్షల బహుమతిని గెల్చుకుంది. తాజాగా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అవార్డుకు గురవయ్య ఎంపికయ్యారు.
 - షేక్ సైదా, న్యూస్‌లైన్, నకరికల్లు (గుంటూరు జిల్లా)
 
 ‘గురవయ్య గొర్రు’ పని చేసేదిలా..
 గురవయ్య గొర్రును ట్రాక్టర్‌కు అమర్చి వినియోగించాలి. చాలు వేసి, విత్తనాన్ని, ఎరువును నిర్ణీత దూరంలో, 1.5 సెం.మీ. లోతులో వేసి, వాటిపై మట్టిని కప్పేస్తుంది. అంతేకాదు కలుపు మందును కూడా పిచికారీ చేస్తుంది. వరి కోసిన వెంటనే తడి పొలంలోనే దుక్కి చేయకుండా తక్కువ ఖర్చుతోనే ఈ పనులు చేసుకోవచ్చు. దీని తయారీకి రూ. 90 వేలు ఖర్చవుతుందని గురవయ్య వివరించారు. ఈ ఏడాది పేటెంట్ రానుంది. ఆ తర్వాత ఇది రైతులకు అందుబాటులోకి వస్తుంది.  
 
 శాస్త్రవేత్తలు పొలాల్లోకి రావాలి..
 రైతులు, కూలీల పిల్లలు వ్యవసాయ పనులు చేయడం లేదు. కూలీల కొరతతో పొలం పనులు సాగడం లేదు.. యంత్ర పరికరాలను వినియోగించి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పనులు చేస్తేనే వ్యవసాయం లాభసాటి అవుతుంది. అందుకే పట్టుదలగా గొర్రును రూపొందించా.  శాస్త్రవేత్తలు పొలాల్లోకి వచ్చి రైతుల అనుభవాలను గుర్తించాలి. సలహాలు, సూచనలివ్వాలి. అప్పుడే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది.                        
 - తొండపి గురవయ్య (99890 87931) రూపెనగుంట్ల, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా- 522615
 
 రైతుల అభిప్రాయాలే గీటురాయి..
 గొర్రును రూపొందించే ప్రతి దశలోనూ సహచర రైతులను ఏడుసార్లు సమావేశపరచి, వారి సూచనలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు. అందువల్లే నిపుణులు తయారు చేయలేకపోయిన లోపరహితమైన గొర్రును కేవలం 3 నెలల్లో రూపొందించడం సాధ్యమైంది.
 - విశ్రాంత బ్రిగేడియర్ పోగుల గణేశం
 చైర్మన్, పల్లెసృజన (98660 01678)

మరిన్ని వార్తలు