శ్రీరామ అంటేనే నేరం!

4 Feb, 2016 00:51 IST|Sakshi
శ్రీరామ అంటేనే నేరం!

జీవన కాలమ్
 
శతాబ్దాల విశ్వాసాలను, నేటి హేతువాద స్ఫూర్తిగల మేధావులు ప్రశ్నించడం ప్రారంభిస్తే- ఈ జాతికి గొప్ప భవిష్యత్తు ఉన్నదని నాకు గర్వపడాలని ఉంది... అవకాశం దొరికితే సింగు గారి పాదాలకు నమస్కరించి తరించాలని నా కోరిక.
 
 అతి విచిత్రమైన, అతి సహేతుకమైన కేసు ఈ మధ్య బిహారులో సీతామర్హీ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేటు వారి కోర్టులో నమోదయింది. ఠాకూర్ చందన్ కుమార్ సింగ్ అనే లాయరుగారు ఈ కేసుని నమోదు చేశారు. మెజోర్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న దూమ్రికాలా వాసి ఈ సింగు గారు.
 
 కేసు శ్రీరామచంద్రుని మీద. అవును, రామా యణంలో హీరో భారతీయుల ఆరాధ్యదైవం శ్రీరాముడి మీదే. అయోధ్యలో ఒక రజకుడు సీత శీలాన్ని శంకించాడన్న వార్త విని భార్య శీలాన్ని శంకించి మహా పతివ్రత అయి, భర్త అడుగుజాడలలో నడిచిన ఉత్తమ ఇల్లాలిని క్రూరుడైన రాముడు. ఒంటరిగా బతకమని అడవులకు పంపడం నేరమని శిక్షాస్మృతి 367/34, మరికొన్ని సెక్షన్ల కింద సీతకి న్యాయం జరగాలని ఈ కేసు. కష్టాల్లో సుఖాల్లో సీత భర్తకి అండగా నిలిచింది. భక్తితో సపర్యలు చేసింది. అలాంటి స్త్రీని ఒంటరిగా బతకమని అడవులకు ఎలా పంపాడు? - ఇదీ సింగు గారి దరఖాస్తు సారాంశం.
 
దీనికి ప్రతికూలంగా వాదించాల్సిన గవర్నమెంటు న్యాయవాదికి ఒక విషయం అర్థం కాలేదు. సరేనయ్యా, రాముడు శిక్షార్హుడే. చేసిన పని తప్పే. కాని ఎప్పుడో పురాతన కాలంలో జరిగిన కేసు రుజువయినా ఇప్పుడు ఎవరిని శిక్షిస్తావయ్యా అని. న్యాయమూర్తిగారికి మరొక విష యం అర్థం కాలేదు. ‘‘ఈ చర్యకి సాక్షులు ఎవరయ్యా?’’ అని. రాముడు సీతని ఏ తేదీనాడు అడవులకు పంపాడు? - ఇవీ జడ్జిగారికి అంతు పట్టని సందేహాలు.
 
 ఈ కేసులో మరో ముద్దాయి పేరుని జతచేశారు. ఈ నేరస్థుడికి సహాయకుడిగా నిలబడి(abettor) శ్రీరాముడి క్రూరత్వాన్ని అమలు జరిపిన సోదరుడు లక్ష్మణుడు.
 ఈ కేసులో సాక్షులుగా ఇలాంటి దిక్కుమాలిన కథలు రాసిన వాల్మీకినీ, వ్యాసుడినీ, రామకథను గానం చేసిన లవకుశులనీ, దీక్షితార్‌నీ, శ్యామాశాస్త్రినీ, రామదా నునీ, అన్నమాచార్యనీ, తులసీదాసునీ, నారాయణ తీర్థులనీ సాక్షులుగా పిలిపించాలని నా సూచన.
 
 ఏమయినా సింగు గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. ఏతావాతా ఈ కేసులో ఆయన విజయాన్ని సాధించగలిగితే ఇంకా బోలెడన్న కేసులున్నాయని మనవి. హరిశ్చంద్రునికి దిక్కుమాలిన వాగ్దానాలు చేసి నడివీధిలో పెళ్లాన్నీ, కొడుకునీ అమ్మే హక్కు ఎవరిచ్చారు? పరశురాముడు కొన్ని వేల మంది క్షత్రియులను చంపితే, ఇలాంటి సీరియల్ కిల్లర్‌ని అవతార పురుషుడని ఏ మొహం పెట్టుకుని అంటున్నాం? అలనాడు కేవలం మూడు అడుగులు అడిగిన కుర్రాడు-వామనుడు-మూడు లోకాలను ఆక్రమించుకోవడం breach of trust కాదా? ద్రౌపది అయిదుగురు భర్తలతో కాపురం చేయడం బహుభర్తృత్వ నేరం కాదా? శ్రీకృష్ణుడు పదహారు వేలమంది గోపికలతో శృంగారాన్ని నడపడం బహు భార్యత్వం అనిపించుకోదా? ప్రేమించబోయిన ఒక అమ్మాయి (శూర్పణఖ)ని దుర్మార్గంగా ముక్కూ చెవులూ కోయడం ‘నిర్భయ’ కేసు కంటే దారుణమయిన నేరం కాదా? శ్రీకృష్ణుడు చిన్నతనం నుంచీ అడ్డమయిన వాళ్లనీ చంపుతూంటే ఆయన మీద జువెనైల్ కేసులు ఎందుకు పెట్టలేదు? ఈ నేరాల్లో నందవ్రజంలో ప్రజలు, ఆనాటి న్యాయస్థానం, నందుడు, యశోధలకు వాటా ఉన్నదాలేదా? శివుడుగారు నెత్తిమీద ఒక పెళ్లాన్ని, పక్కనో పెళ్లాన్ని పెట్టుకోవడం bigamy కాదా? తన కొడుకు ప్రహ్లాదుడికి సరైన చదువు చెప్పించుకోలేక వాళ్ల నాన్న హిరణ్యకశిపుడు అల్లల్లాడుతుంటే మధ్యలో దూరి ఆయన్ని చంపడం culpable homicide కాదా?
 సింగు గారివంటి జిజ్ఞాసువులకు తవ్విన కొద్దీ రామాయణ విషవృక్షాలే కాదు, భారత విషవృక్షాలు  బయటపడతాయి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది.
ఆయనతో నేనూ ఏకీభవిస్తున్నాను. ఈ దేశంలో రాముడి ఆలయం లేని పల్లె లేదు. రాముడి పేరు పెట్టుకోని కుటుంబం లేదు. ఆఖరికి నాస్తికత్వాన్ని ప్రతిపాదించిన రామస్వామి నాయకర్, గోపరాజు రామచంద్రరావుగారి పేర్లలో కూడా రాముడున్నాడు. వారందరికీ కోర్టు నోటీసులు పంపాలి.
ఈ సంస్కృతిలో దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, జాతిలో వెరసి-సంస్కృతి(civilization)లో 32 దేశాలలో నిలదొక్కుకున్న రామాయణం ఎన్ని కోట్లమంది మనస్సులను కలుషితం చేసిందో చెప్పనలవి కాదు. ఏమయినా శతాబ్దాల విశ్వాసాలను, నేటి హేతువాద స్ఫూర్తిగల మేధావులు ప్రశ్నించడం ప్రారంభిస్తే- ఈ జాతికి గొప్ప భవిష్యత్తు ఉన్నదని నాకు గర్వపడాలని ఉంది. సింగుగారు నాకు అందనంత దూరంలో ఉండిపోయారుకాని, అవకాశం దొరికితే వారి పాదాలకు నమస్కారం చేసి తరించాలని నా కోరిక.
 -గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు