సద్విమర్శను స్వీకరిస్తేనే సుపరిపాలన సాధ్యం

3 May, 2015 00:50 IST|Sakshi
కె.రామచంద్రమూర్తి

సార్వత్రిక ఎన్నికలు జరిగి సంవత్సరం పూర్తి కావస్తున్నది. కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇప్పటికీ కుదుటపడలేదు. ఢిల్లీలో నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరి శైలిలో వారు ప్రభుత్వాలు నడుపుతున్నారు. మోదీ సర్కార్ పనితీరుపైన భారతీయ జనతా పార్టీ మేధావి, మాజీ మంత్రి అరుణ్‌శౌరీ ‘హెడ్‌లైన్స్ టుడే’ చానల్‌లో కరణ్‌థాపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన విమర్శలు నిర్మాణాత్మకమైనవి. కటువుగా కనిపించవచ్చును కానీ శౌరీ చెప్పిన అంశాలు అక్షరసత్యాలు. కాంగ్రెస్ నాయకుడూ, మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఎన్‌డీటీవీ వెబ్ సైట్‌లో మోదీని ఉతికి ఆరవేస్తూ రాసిన పది వ్యాసాలూ ఒక పెట్టు, అరుణ్‌శౌరీ ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ ఒక పెట్టు.
 
 
 మూడు ప్రభుత్వాలలో కనిపించే సామ్యం పారదర్శకత లేకపోవడం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కావడం. చేసిన వాగ్దానాల అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం. లేనిపోని పేచీలు పెట్టుకొని ప్రతిపక్షాలతో కయ్యానికి కాలు దువ్వి, చట్టసభలలో చర్చ జరగకుండా ప్రతిష్టంభనకు దారి తీయడం లేదా ప్రతిపక్షాన్ని సభనుంచి బహిష్కరించడం. సర్వసాధారణంగా ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వాలు రెండు, మూడు మాసాలలో ఒడిదుడుకులను అధిగమించి సజావుగా పని చేయడం ఆరంభిస్తాయి. చట్టసభకు ఎన్నికైనవారిలో సమర్థులను మంత్రివర్గంలోకి తీసుకుంటే అది ప్రధాని లేదా ముఖ్యమంత్రి ఆత్మవిశ్వాసానికీ, విశాల దృక్పథానికీ నిదర్శనం. సమర్థమైన పాలన అందించేందుకు సాధనం. కేంద్రమంత్రిమండలిలో అనుభవజ్ఞులకూ, సమర్థులుగా పేరున్నవారికీ స్థానం కల్పించినప్పటికీ వారిని పూర్తి స్థాయిలో పనిచేయనీయడం లేదన్నది శౌరీ విమర్శ. రాజ్‌నాథ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. నితీన్ గడ్కరీ పరిపాలనా సామర్థ్యం ఉన్న నాయకుడు. వాజపేయి హయాంలో స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణానికి గడ్కరీ దార్శనికతే కారణం. సుష్మాస్వరాజ్ మంచి వక్త, ప్రతిపక్షంతో సైతం సత్సంబంధాలు నెరపే పార్లమెంటేరియన్ కావడంతో పాటు పరిపాలనలో దిట్ట. ఒకానొక దశలో బీజేపీ ప్రధాని అభ్యర్థులుగా పరిగణించిన ఇద్దరు ముగ్గురిలో ఒకరు. ఇటువంటి సమర్థుల సేవలను సద్వినియోగం చేసుకోకుండా వారిని అదుపులో పెట్టడం, వారిపైన ఆంక్షలు విధించడం, నిఘా పెట్టడం మోదీ అభద్రతాభావానికి నిదర్శనం. దేశ సమస్యలను ఆకళింపు చేసుకొని పరిష్కరించవలసిన ప్రధాని అదే పనిగా విదేశాలలో పర్యటించడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు కొంత మేరకు మెరుగు కావచ్చునేమో కానీ విదేశాంగమంత్రిని పూర్వపక్షం చేయడం అభిలషణీయం కాదు.
 
 సుష్మాస్వరాజ్‌ను నామమాత్రపు విదేశాంగమంత్రిగా పక్కన పెట్టి సర్వం తానే అయినట్టు మోదీ విశ్వరూపం ప్రదర్శించడంలో ఔచిత్యం లేదన్నది శౌరీ చేసిన మరో విమర్శ. ప్రపంచ వేదికపైన చైనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో భారత్ కీలకపాత్ర పోషించడం అవసరమే. కానీ ఆర్థికంగా ఎదగనంత కాలం కేవలం దౌత్యవిధానాలతో అంతర్జాతీయ రంగంలో ప్రాముఖ్యం లభించదు. జవహర్‌లాల్ నెహ్రూకు మించిన దౌత్యవేత్త ఎవరున్నారు? ఆయన పంచశీలకు మించిన శాంతిసాధనం  ఏమున్నది? అయినా సరే, ఆర్థికంగా ఎదగని కారణంగా నెహ్రూ విదేశాంగ విధానానికి కానీ ఇండియాకు కానీ తగినంత ప్రాధాన్యం దక్కలేదు.
 
 అన్నీ తె లిసిన అధినేతలు
 
 ఆర్థికరంగంలో మోదీ సర్కార్ మందకొడిగానే సాగుతున్నది. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. కొత్త పెట్టుబడులు రావడంలేదు. పన్నుల విధానంలో నిలకడ లేదు. విదేశీ పెట్టుబడిదారులకు నమ్మకం కుదరలేదు. 2013లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూ సేకరణ బిల్లును సమర్థించిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట సవరణ గురించి ఆలోచించడం, దానికోసం ఆర్డినెన్స్ జారీ చేయడం అనవసరమని అరుణ్‌శౌరి వాదన. చట్టసవరణ బిల్లును ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న మోదీ ప్రతిపక్షాన్ని మరింత దూరం చేసుకొని చట్టసభలలో బిల్లులు ఆమోదం పొందలేని పరిస్థితిని కొనితెచ్చుకుంటున్నారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే కూడా ప్రతిపక్ష సహకారం అవసరం. భూసేకరణ చట్టం సవరణ బిల్లులో రాజీపడితే జీఎస్‌టీ బిల్లును ప్రతిపక్షాలు అంగీకరించవచ్చు. ఆ దిశగా అడుగులు వేయకుండా విదేశీగడ్డపైన ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం అవివేకం. కార్యసాధకులు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించాలి.  గాంధీనగర్ నుంచి ఢిల్లీ స్థాయికి మానసికంగా కూడా ఎదగాలి.
 తెలంగాణ మంత్రివర్గంలో ఒక్క మహిళ సైతం లేకపోవడం లోపంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కనిపించకపోవడం విచిత్రం. తొలుత మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు పురుషులకు మాత్రమే అన్నట్టు ఒక్క మహిళకూ అవకాశం ఇవ్వలేదు. అనంతరం విస్తరించినప్పుడు కూడా మహిళ ఊసే లేదు.
 
 దళితులకూ, రాజకీయ ప్రాబల్యం కలిగిన ఇతర సామాజికవర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వాలన్న స్పృహ కలిగిన కేసీఆర్ జనాభాలో సగం ఉన్న మహిళలకు మాత్రం ఒక్క మంత్రిత్వశాఖ సైతం ఇవ్వకుండానే సంవత్సరం పూర్తి చేస్తున్నారు. మంత్రులలో ఎవ్వరూ స్వతంత్రంగా వ్యవహరించే సాహసం చేయరనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అంతా ముఖ్యమంత్రి కనుసన్నలలో జరగవలసిందే. ‘ఆయనకు అన్నీ తెలుసు. ఆయన బుర్రలో అన్ని నక్షాలూ ఉంటాయి. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే’ అంటూ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.  మంత్రివర్గ నిర్మాణంలో చంద్రబాబునాయుడి సూత్రం తెలిసిందే. అన్ని బలమైన కులాలకూ ప్రాతినిధ్యం ఇస్తారు. మహిళలకు కూడా చోటు కల్పిస్తారు. కానీ విషయపరిజ్ఞానం ఉన్నవారిని దూరం పెట్టి విధేయులుగా ఉంటూ ఏది చెప్పినా తలలూపేవారికి మంత్రిపదవులు ఇస్తారు. ఐఏఎస్ అధికారుల ద్వారా ప్రభుత్వాన్ని ఆయనే నడిపిస్తారు. ముగ్గురు నలుగురు వ్యక్తులపైనే ఎక్కువగా ఆధారపడతారు.
 
 వారసులొస్తున్నారు
 
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ తమ వారసులను భవిష్యత్తులో బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధం చేస్తున్నారు.  పనిగట్టుకొని ఆ  పని చేస్తున్నట్టు కనిపించకుండానే ఆచరణలో తమ తర్వాత ఎవరు ముఖ్యులో పార్టీ సభ్యులకూ,  అధికారయంత్రాంగానికీ, మీడియాకీ, సాధారణ ప్రజలకూ తెలిసేవిధంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ చేసిన సాహసం చంద్రబాబు నాయుడు చేయలేకపోయారు. మేనల్లుడు హరీశ్‌రావుతో పాటు కొడుకు తారకరామారావు (కేటీఆర్)ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా కుమారుడికి ముఖ్యమైన రెండు శాఖలు ఇచ్చారు. సమాచార సాంకేతిక శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖను కూడా కేటీఆర్‌కు అప్పగించడం ద్వారా ఒక వైపు పారిశ్రామికవేత్తలతో, వణిక్ ప్రముఖులతో భుజాలు రాసుకుంటూనే మరోవైపు గ్రామీణ స్థాయి పార్టీ కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకునే అవకాశం కల్పించారు. ఉత్తరోత్తరా ఈ అనుభవం కేటీఆర్ రాజకీయంగా ఎదగడానికి దోహదం చేస్తుంది.
 
 
 లోకేశ్‌ను శాసనసభ ఎన్నికల రంగంలో దించకుండా ప్రచారానికే పరిమితం చేసిన చంద్రబాబు నాయుడు  ఉపముఖ్యమంత్రులుగా కేఈ కృష్టమూర్తినీ, నిమ్మకాయల చినరాజప్పనూ నియమించినప్పటికీ పార్టీలో, ప్రభుత్వంలో తన తర్వాత తన కుమారుడే ముఖ్యుడనే విషయం అందరికీ అర్థమయ్యేవిధంగా చేశారు. అవరోధంగా పరిణమిస్తాడనే అనుమానంతోనే జూనియర్ ఎన్టీఆర్‌ను నిర్దాక్షిణ్యంగా వెనక్కు నెట్టివేశారు. కేటీఆర్‌కు హరీశ్ పెద్ద అవరోధం. తన కంటే ముందు రాజకీయాలలో ప్రవేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థుడైన, చురుకైన, విశ్వసనీయత కలిగిన రాజకీయ నాయకుడుగా హరీశ్‌కు మంచి పేరు ఉండటం కేటీఆర్ భవిష్యత్తును ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. లోకేశ్‌కు అటువంటి సమస్య లేదు.
 
 
 చంద్రబాబునాయుడు సింగపూర్, జపాన్, చైనా పర్యటనలకు వెళ్ళినా, ఢిల్లీ వెళ్లినా ఉపముఖ్యమంత్రులతో సహా మంత్రులం దరూ లోకేశ్‌ను కలుసుకొని ఆదేశాలు అందుకుంటున్నారు. మొదట్లో కాస్త ఇబ్బంది పడిన సీనియర్లు క్రమంగా అలవాటు పడ్డారు. ఎంత సీనియర్ మంత్రి అయినా, కొమ్ములు తిరిగిన పార్టీ నాయకుడైనా ముందు అనుమతి (అపాయింట్‌మెంట్) తీసుకొని లోకేశ్‌బాబుని కలుసుకోవలసిందే కానీ ఎప్పుడుపడితే అప్పుడు అతని గదిలోకి వెళ్లే అవకాశం లేదు. రేపు మహానాడులో వారసుడిగా లోకేశ్ మరింత స్పష్టంగా ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.


 కేసీఆర్ ప్రత్యేకించి ఏ వర్గాన్నీ దూరం చేసుకోలేదు. కానీ మోదీ, చంద్ర బాబు నాయుడు అధికారంలోకి వస్తూనే అన్నదాతలతో పేచీ పెట్టుకున్నారు. సాక్షీమహరాజ్ వంటి సహచరులుండగా మోదీకి వేరే శత్రువులు అక్కరలేదు. డబ్బుని కొలిచే నయాసంపన్నులను చుట్టూ పెట్టుకున్న చంద్రబాబునాయుడికి  ప్రజలు దూరం కావడానికి వారే కారకులవుతారు.  
 

నరేంద్రమోదీకి హితవు చెప్పడం ద్వారా భవిష్యత్తులో తనకు ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఏ పదవీ  రాకుండా అరుణ్‌శౌరీ చేజేతులా చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో  అటువంటి త్యాగం చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అధినేత ఏమి చేసినా, ఏమి చెప్పినా అద్భుతం, పరమాద్భుతం అంటూ ఆకాశానికెత్తి తమ పబ్బం గడుపుకుంటున్నారు. వాస్తవాలు చెప్పే హితైషులు లేకపోవడం పాలకులకు వరం కాదు. శాపం.


 

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు