ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి?

6 Dec, 2015 02:16 IST|Sakshi
ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి?

త్రికాలమ్
 
రాజ్యాంగాన్నీ, రాజ్యాంగ నిర్మాతలనూ, ముఖ్యంగా అంబేడ్కర్‌నూ ఇటీవల ఘనంగా స్తుతించినవారు సైతం రాజ్యాంగ స్ఫూర్తిని త్రికరణశుద్ధిగా అమలు చేయక పోవడం విషాదం. మాటకూ, చేతకూ పొంతన  ఉండాలన్న పట్టింపు బొత్తిగా లేదు. ప్రేమలో, సమరంలో ఏదైనా చెల్లుతుందని నానుడి. ఎన్నికల పోరాటంలోనూ గెలుపే పరమావధిగా పావులు కదపవచ్చుననీ, రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ తిలోదకాలు ఇవ్వవచ్చుననీ అన్ని రాజకీయ పార్టీల అగ్రనాయకులూ భావిస్తున్నారు. ఈ విషయంలో మినహాయింపులు లేవు. మోతాదులో వ్యత్యాసం ఉంటే ఉండవచ్చు.

ఇదివరకు ‘ఆయారాం, గయారాం’ రాజకీయాలు హరియాణాలో, ఇతర ఉత్తరాది రాష్ట్రాలలో ప్రబలంగా ఉండేవి. నరేంద్రమోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగానూ, అమిత్ షాని పార్టీ అధ్యక్షుడిగానూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నియమించిన అనంతరం విజయమే ప్రధానంగా ఎన్నికల వ్యూహాలు రచించి తెగించి అమలు చేశారు. బీజేపీ అభ్యర్థులు లేని అనేక నియోజక వర్గాలలో యూపీఏ-2లో మంత్రులుగా పని చేసినవారినీ, 2009లో కాంగ్రెస్ టిక్కెట్టుపైన గెలిచినవారినీ పిలిచి బీజేపీ టిక్కెట్లు ఇచ్చి పోటీలో నిలబెట్టారు. ఎన్నికలలో అనూహ్యమైన విజయం సాధించిన తర్వాత శివసేన నాయకుడు సురేశ్ ప్రభును పార్టీలో చేర్చుకొని మంత్రిమండలిలో చోటు కల్పించారు.

తెలుగు రాష్ట్రాలలో ముమ్మరం
తెలుగు రాష్ట్రాలలో ఈ తెగులు ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాయపాటి సాంబశివరావు వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన చంద్రబాబునాయుడు ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పినా పర్వాలేదంటారు. అవ సరం లేకపోయినా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న నాయకులను ఏమనాలి? నంద్యాల లోక్‌సభ సభ్యుడు ఎస్‌పీవై రెడ్డి ప్రమాణం స్వీకరించక మునుపే వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైదొలిగి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అరకు లోక్‌సభ సభ్యురాలు కొత్తపల్లి గీత తనకు టిక్కెట్టు ఇచ్చి గెలిపించిన వైఎస్‌ఆర్‌సీపీకి దూరదూరంగా ఉంటూ టీడీపీతో అంటకాగుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఫలితం లేదు. స్పీకర్ ఈ అంశాన్ని పార్లమెంటు హక్కుల కమిటీ పరిశీలనకు పంపించారు. అక్కడే అపరిష్కృతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు ఎంఎల్‌సీలను చంద్రబాబునాయుడు టీడీపీలో చేర్చుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటే ఒక ఆకు ఎక్కువే చదివినట్టున్నారు. టీడీపీ టిక్కెట్టుపైన ఎన్నికలలో గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడమే కాకుండా మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘన. తీగల కృష్ణారెడ్డి (రంగారెడ్డి జిల్లా మహేశ్వరం), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం), చల్లా ధర్మారెడ్డి (వరంగల్లు జిల్లా పరకాల), రెడ్యానాయక్ (వరంగల్లు జిల్లా డోర్నకల్) టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వైఎస్‌ఆర్‌సీపీ టిక్కెట్టుపైన ఖమ్మం జిల్లాలో గెలిచిన ముగ్గురిలో ఇద్దరు శాసనసభ్యులను కలిపేసుకున్నారు. అందరికంటే ముందు గీత దాటినవారు కాంగ్రెస్ ఎంఎల్‌సీలు నేతి విద్యాసాగర్, యాదవరెడ్డి, రాజేశ్వరరావు. వారు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించినప్పుడు శాసన మండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు ధర్మపురి శ్రీనివాస్. ఆయన రెండు విడతల పీసీసీ అధ్యక్షుడు. కాంగ్రెస్ ప్రభుత్వాలలో పలుమార్లు మంత్రిగా పని చేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకునే అవకాశం ఉన్న నాయకుడు.  పార్టీ ఫిరాయించినవారిపైన చర్య తీసుకోవాలనీ, వారి సభ్యత్వాలు రద్దు చేయాలనీ మండలి అధ్యక్షుడు స్వామి గౌడ్‌కు  శ్రీనివాస్ విజ్ఞాపన పత్రం సమర్పించారు.  సినిమా పరిభాషలో ‘సీన్ కట్’ చేస్తే అదే ధర్మపురి శ్రీనివాస్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకొని, కేసీఆర్ చేత మెడలో కండువా వేయించుకొని, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారు హోదాలో ప్రజాసేవ చేస్తున్నారు.

నిజమే. ఇది ఇప్పుడే కొత్తగా ఒక్క తెలంగాణలోనే జరుగుతున్న తంతు కాదు. కానీ, కొత్త  రాష్ట్రంలో తొలి ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి సృజనాత్మకమైన జనహిత కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకుంటున్న విధంగానే రాజ్యాంగాన్ని సంపూర్ణంగా శిరసావహించి, తు.చ. తప్పకుండా పాటించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని తెలంగాణ ప్రజలు ఆశించడంలో తప్పు లేదు.  వరంగల్లు లోక్‌సభ ఉపఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాతనైనా తలసాని చేత రాజీనామా చేయించి సనత్‌నగర్‌లో ఉప ఎన్నిక జరిపించవచ్చు. మర్రి శశిధరరెడ్డి కోరిక తీర్చవచ్చు. తలసాని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించేందుకు  శశిధరరెడ్డి తట్టని తలుపు లేదు. తొక్కని గడప లేదు.

ఆయన వాదన సమంజసమైనదే అయినప్పటికీ అధికార రాజకీయాల దాష్టీకం ఫలితంగా అది అరణ్యరోదనగానే మిగిలింది. సుపరిపాలన వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చట్టసభ వ్యవహారాలలో జోక్యం చేసుకునే వీలు లేని కారణంగా హితబోధ చేస్తున్నదే  కానీ శ్రీనివాస యాదవ్ సభ్యత్వంపైన నిర్ణయం తీసుకోవాలని శాసనసభాపతిని ఆదేశించే పరిస్థితి లేదు. శాసనసభాపతి రాజ్యాంగ నిబంధనలను పాటించనప్పుడు ఏమి చేయాలో పాలుపోక అసహాయతను వ్యక్తం చేస్తున్న హైకోర్టును చూస్తున్నాం. ఎస్‌ఆర్ బొమ్మయ్ కేసులో  గవర్నర్ నివేదికలపైన ఆధారపడి, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిన రాష్ట్రపతి నిర్ణయాన్నే సుప్రీంకోర్టు తిరగదోడింది. ఆ కేసులో వెలువరించిన 300 పేజీల తీర్పు 356వ అధికరణ దుర్వినియోగాన్నే కాకుండా ఫిరాయింపుల నిరోధక చట్టంపైన కూడా సవిస్తరంగా చర్చించింది.

పార్టీలే ప్రధానం
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలదే ప్రధాన పాత్ర. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద నమోదైన ప్రతి రాజకీయ పార్టీకీ నిర్దిష్టమైన హక్కులు ఉన్నాయి. 1985లో రాజీవ్‌గాంధీ హయాంలో 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్టీ ఆదేశాన్ని (విప్‌ను) ధిక్కరించిన సభ్యుడిని పార్టీ నుంచి బహిష్కరించవచ్చు. పార్టీలో మూడింట ఒక వంతు సభ్యులు పార్టీని వీడి వేరే పార్టీలో చేరినట్లయితే అది ఫిరాయింపు కిందికి రాదు. చీలిక వర్గం వేరే పార్టీలో విలీనమైనట్టు పరిగణిస్తారు. ఎన్నికల సంస్కరణలను సూచించిన దినేశ్ గోస్వామి కమిటీ, ఎన్నికల చట్టాలను సంస్కరించాలంటూ సిఫార్సు చేసిన లా కమిషన్, రాజ్యాంగం అమలు తీరును సమీక్షించిన జాతీయ సంఘం (నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్-ఎన్‌సీఆర్‌డబ్ల్యూసీ) వంటి సంస్థలు ఈ నిబంధన వల్ల రాజకీయ పార్టీలలో తిరుగుబాట్లు ఎక్కువై అస్థిరత చోటు చేసుకుంటుందనే ఆందోళన వెలిబుచ్చాయి.

2003లో అటల్ బిహారీ వాజపేయి హయాంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ భయాన్ని కొంత వరకూ తొలగించారు. మూడింట రెండు వంతుల సభ్యులు పార్టీ వీడితేనే అది మరో పార్టీలో విలీనంగా పరిగణించాలనీ, అంతకంటే తక్కువ మంది సభ్యులు నిష్ర్కమిస్తే అది ఫిరాయింపు అవుతుందనీ కొత్త చట్టం స్పష్టం చేసింది. రెండు సవరణలలోనూ ఫిరాయింపు నిరోధక చట్టం కింద తీసుకునే చర్యలు చట్టసభల పరిధిలోకి మాత్రమే వస్తాయనీ, ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం ఎంత మాత్రం ఉండకూడదనీ స్పష్టంగా ఉన్నది. సభాపతి నిర్ణయమే అంతిమం.  లోక్‌సభాపతి లేదా రాజ్యసభ అధ్యక్షుడు, శాసనసభాపతి లేదా  శాసనమండలి అధ్యక్షుడు సాధారణంగా అధికార పార్టీకి చెందినవారై ఉంటారు. వారిపైన ప్రధాని లేదా ముఖ్యమంత్రి ప్రభావం ఎంతోకొంత పరోక్షంగానైనా ఉంటుంది. అందుకే అధికార పార్టీ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకొని సభాపతులు వ్యవహరిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి.

చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే ఫిరాయింపులకు ఆస్కారం ఉండదు. కానీ రాజ్యాంగం ప్రసాదించిన పదవులలో ఉన్న వ్యక్తులే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిస్తే అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మాత్రం ఏమి చేయగలదు?  రాజ్యాంగం ప్రభావం దాన్ని అమలు చేసేవారి అంకిత భావంపైన ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్ అందుకే చెప్పారు.  రాజ్యాం గాన్ని పాటించవలసినవారిలో చిత్తశుద్ధి లోపించిందనే వాస్తవం కశ్మీర్ నుంచి కొచ్చి వరకూ సర్వత్రా కళ్లకు కట్టుతున్నది. 52, 91 రాజ్యాంగ సవరణలకు కట్టుబడి చట్టసభల వ్యవహారాలలో జోక్యం చేసుకోలేని హైకోర్టు ‘సదరు సభ్యుడి పదవీకాలం పూర్తయ్యే వరకూ సభాపతి నిర్ణయం తీసుకోరా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నది. పార్టీలో ఒక చిన్న వర్గం చీలిపోవడాన్ని మరో పార్టీలో విలీనంగా పరిగణించరాదంటూ 91వ సవరణ తెచ్చినట్టే పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుడి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి సభాపతి ఎంత సమయం తీసుకోవచ్చునో నిర్దేశిస్తూ మరో సవరణ చేయవలసిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ఫిరాయింపులను నిరోధించడం సాధ్యం కాదు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పైనే దృష్టి  
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు ముగిసే వరకూ టీఆర్‌ఎస్ నేతలు హితవాక్యాలను స్వీకరించే స్థితిలో లేరు. ఎట్లాగైనా సరే కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొందాలన్న లక్ష్యంతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. వరాలు ప్రకటిస్తున్నారు. 2014 డిసెంబరు 4వ తేదీతోనే జీహెచ్‌ఎంసీకి ఎన్నికైనవారి పదవీకాలం ముగిసింది. అప్పుడే జరగవలసిన ఎన్నికలు ఏదో కారణంపై వాయిదా పడుతూ వచ్చాయి.  జనాభా ప్రాతిపదికగా పునర్విభజన, క్రమబద్ధీకరణ చేసి మొత్తం 200 డివిజన్లు ఏర్పాటు చేస్తామన్నారు.  తీరా కోర్టు డిసెంబర్ 15 కల్లా ఎన్నికల షెడ్యూలు ప్రకటించాలని నిర్ణయించేసరికి పాత 150 డివిజన్లే ఉంటాయని చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దాదాపు సంవత్సరంపాటు వాయిదా వేయడంలోని ఆంతర్యం రాజకీయంగా బలం పుంజుకోవడానికి వెసులుబాటు కల్పించుకోవడమే. ఈ అవసరాన్ని కొందరు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యులు స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనమండళ్లలో అధికార పార్టీలు ఆధిక్యం సంపాదించిన పద్ధతిలోనే రాజ్యసభలో రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యా బలాన్ని ఎన్‌డీఏ  సంతరించుకోగలిగితే గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, రియల్ ఎస్టేట్ బిల్లులకు ఆమోదం పొందలేక నరేంద్రమోదీ, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు సతమతం కావలసిన అవసరం ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీతో రాజీ ప్రయత్నాలు చేయవలసిన అగత్యమూ ఉండేది కాదు. ఎన్‌డీఏ నాయకత్వం అటువంటి దుస్సాహసం చేయదు. కానీ, ఎగువ సభలో ఫిరాయింపులు జరిగే ధోరణే కనుక కనిపిస్తే ఇంగ్లీషు చానళ్ళూ, ఇంగ్లీషు పత్రికలూ, సోషల్  మీడియా ఊరుకోవు. దక్షిణాది రాష్ట్రాలలో ఏమి జరిగినా పట్టించుకోవు.
- కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు