ప్రతిఘటించాల్సిన తీర్పు

8 Sep, 2017 00:39 IST|Sakshi
ప్రతిఘటించాల్సిన తీర్పు

విశ్లేషణ

ఈ తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయ వ్యక్తీకరణ స్వాతంత్య్రంలో సమాచార స్వాతంత్య్రం కూడా ఉందని గుర్తించింది. తద్వారా ప్రభుత్వ పత్రాల దాపరికపు పరిధిని సర్వోన్నత న్యాయస్థానం కుదించింది.

ప్రజల స్వాతంత్య్రాల్ని రక్షించినా, నియమపాలనను నిర్ధారించినా, పారదర్శకతను గురించి పద్ధతులను నిర్దేశిం చినా మన సర్వోన్నత న్యాయ స్థానం వల్లనే సాధ్యం. న్యాయ మూర్తుల నియామక వివరా లన్నీ ప్రజల ముందుండాలని ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం (1982) 2 ఎస్‌సీఆర్‌ 365 తీర్పు చెప్పింది. న్యాయశాఖ మంత్రి, ఢిల్లీ ప్రధాన న్యాయ మూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తికి మధ్య న్యాయ మూర్తుల నియామకం, బదిలీ వంటి అంశాలపై సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రివిలేజ్‌ చాటున దాచడం న్యాయం కాదని చట్టం ప్రకారం ఆ అంశాలను వెల్లడిం చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆనాటి తీర్పు ఈనాటి పారదర్శక శాసనాలకు, సమాచార హక్కు చట్టానికి మూలాధారం. కేంద్రం ఇద్దరు న్యాయమూర్తుల నియామకపు సిఫార్సులను తిరస్కరించింది.

దీనికి సంబంధించిన ప్రతులన్నిటినీ ఇవ్వాలని కోరుతూ ఒక పిటిషన్‌ దాఖలైంది. మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాను ఏ కోర్టూ విచారించడానికి వీల్లేదని భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 74(2) చెబుతున్నది. ప్రచురితం కాని రాజ్య వ్యవహారాల అధికారిక పత్రాలను ఆయా శాఖల అధిప తుల అనుమతి లేకుండా సాక్ష్యంగా తీసుకోవడానికి వీల్లేదని భారత సాక్ష్య చట్టం సెక్షన్‌ 123 నిర్దేశించింది. కనుక ఆ న్యాయమూర్తుల నియామక లేఖాయణాన్ని వెల్లడించనవసరం లేదన్న ప్రభుత్వ వాదాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి భగవతి తిరస్కరించారు.

పార దర్శక భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి జవాబుదారీ తనం అవసరం. ప్రభుత్వ పాలనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.  ఆర్టికల్‌ 19(1)(ఎ) కింద అభిప్రాయప్రకటనా స్వాతంత్య్రంలో అంతర్లీనంగా ఉన్న తెలుసుకునే హక్కు నుంచి పారదర్శకపాలనా సూత్రం నేరుగా రూపొందింది. కేవలం ప్రజాప్రయో జనం కోసమే, నిక్కచ్చిగా అవసరమైనప్పుడే దాపరికం సమంజసమవుతుందని సుప్రీంకోర్టు వివరించింది.

జడ్జీల నియామకంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రెండే రెండు కారణాలపైన సవాలు చేయవచ్చు: (1) కేంద్రప్రభుత్వంతోనూ ఇతర అధికారులతోనూ జరపవ లసినంతగా సంప్రదింపులు జరపలేదనీ, (2) నిర్ణయం అసమంజసమైన కారణాల ఆధారంగా తీసుకోవడం. ఈ ప్రశ్నలపై న్యాయనిర్ణయం కోసం మంత్రికి ప్రధాన న్యాయమూర్తులకు మధ్య సాగిన ఉత్తరాలను పరి శీలించాల్సిందే. ఫలానా పత్రాన్ని వెల్లడించడం వల్ల ప్రజాప్రయోజనానికి నష్టమా కాదా అని పరిశీలించాలి.

ఈ తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయ వ్యక్తీకరణ స్వాతంత్య్రంలో సమాచార స్వాతంత్య్రం కూడా ఉందని గుర్తించింది. తద్వారా ప్రభుత్వ పత్రాల దాపరికపు పరి ధిని సర్వోన్నత న్యాయస్థానం కుదించింది. కెనరా బ్యాంక్‌ వర్సెస్‌ సీఎస్‌ శ్యాం కేసులో సుప్రీంకోర్టు ఆగస్టు 31, 2017 నాటి తీర్పు సుప్రీంకోర్టు ఇదివరకటి అనేక మంచి తీర్పులకు, ముఖ్యంగా ఎస్‌పీ గుప్తా తీర్పునకు పూర్తిగా విరుద్ధం.

కెనరా బ్యాంకు గుమాస్తాలను నియమించిన తేదీ, చోటు, వారిని బదిలీ చేసిన వివరాలు, బదిలీలకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు ఇవ్వాలని శ్యాం కోరారు. పీఐఓ తిరస్కరించారు. మొదటి అప్పీలు అధి కారి సమర్థించారు. సీఐసీ రెండో అప్పీలులో ఇది వ్యక్తి గత సమాచారం కాదని, ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. కేరళ హైకోర్టు సీఐసీ ఉత్తర్వును సమర్థించింది. డివిజన్‌ బెంచ్‌ కూడా సమర్థించింది. కెనరాబ్యాంక్‌ సుప్రీం కోర్టుకు రిట్‌ అప్పీలు చేసింది. న్యాయమూర్తులు అభయ్‌ మనోహర్‌ సప్రే, ఆర్‌కే అగ్రవాల్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ 2017 ఆగస్టు 31న ఇచ్చిన తీర్పు ఎస్‌పీ గుప్తా తీర్పునకు పూర్తిగా విరుద్ధం. అక్కడ న్యాయ మూర్తుల ఎంపిక నియామకానికి సంబంధించి అగ్ర స్థాయిలో సాగిన ఉత్తరప్రత్యుత్తరాలే రహస్యం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, ఇక్కడ ఈ కేసులో గుమాస్తాల నియామక తేదీ, వారిని నియమించిన చోటు, బదిలీ చేసిన చోటు, బదిలీ చేసిన అధికారి పేరు, నియమావళి రహస్యాలని, అవి ఆ గుమాస్తాల వ్యక్తిగత సమాచారం అని తీర్పునిచ్చింది.

గిరీశ్‌ రామచంద్ర దేశ్‌పాండే, ఆర్‌కే జైన్‌ కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఇద్దరు న్యాయమూర్తులు వివరించారు. గిరీశ్‌ కేసులో ప్రభుత్వ ఉద్యోగులపైన అధికారులు తీసుకున్న క్రమశిక్షణా చర్యలు, వారి ఆదా యపు పన్ను రిటర్న్‌లు అడగొద్దని తీర్పు ఇచ్చారు. ఇదీ అన్యాయమే. జైన్‌ కేసులో ఏసీఆర్‌ రిపోర్టులలో వచ్చిన వ్యతిరేక వాక్యాలపై ఏ చర్య తీసుకున్నారని అడిగారు. అదీ వద్దన్నారు. కెనరా బ్యాంకు కేసులో ఆ వివరాలు అడగలేదు. అయినా తిరస్కరించారు. సెక్షన్‌ 4(1)(బి) ఆర్టీఐ చట్టం కింద నియామకాలు బదిలీలు పోస్టింగ్‌ల సమాచారం తమంత తామే ఇవ్వాలని పార్లమెంటు నిర్దేశిస్తున్నది. ఈ తీర్పులో అన్యాయాన్ని వివరిస్తూ సుప్రీంకోర్టును పునఃపరిశీలించాలని పౌరులు కోరాలి.


  

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

 

మరిన్ని వార్తలు