ఆ ఎన్నికల్లోనూ చెల్లని ఓట్లేనా?

7 Jul, 2017 00:20 IST|Sakshi
ఆ ఎన్నికల్లోనూ చెల్లని ఓట్లేనా?

విశ్లేషణ
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే పద్ధతి తెలియకపోతే ఒకరికి ఓటువేద్దామనుకుంటే అది మరొకరికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. 2012 లో 15 మంది ఎంపీలు, 54 మంది ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లకుండా పోయాయంటే ఏమనుకోవాలి?

మనం ఎన్నుకున్న శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారు.  రాజకీయాతీతమైన వ్యక్తి ఆ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని రక్షించాలి. రాజ కీయ పక్షాల ద్వారానే ఎంపిక ఎన్నిక జరగక  తప్పదు. ప్రధానమంత్రితో పోల్చితే నిజమైన అధికారాలు లేకపోయినా, దేశ ప్రథమపౌరుడిగా వ్యవహరించవలసిన వ్యక్తి కనుక ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా అంతరాత్మ చెప్పిన రీతిలో ఓటు వేయాలని ఎన్నికల సూత్రాలు వివరిస్తున్నాయి. మన పార్టీ అభ్యర్థికే ఓటు వేయకపోతే సభ్యత్వం రద్దవుతుందనే విప్లకు వీల్లేదు. ఫిరాయింపు నిషేధ చట్టం నియమాలు రాష్ట్రపతి ఎన్నికలో వర్తించవు. అభ్యర్థులను నిలబెట్టడం పార్టీలపని. ఇంకా ఎవరైనా స్వతంత్రంగా పోటీ చేయదలచుకుంటే పార్లమెంటు సభ్యుల మద్దతుతో పోటీ చేయవచ్చు. పోటీలో మిగిలిన వారిలో ఒకరిని స్వయంగా ఏ బెదిరింపులకూ లోనుకాకుండా ఓటు వేయాలన్నదే లక్ష్యం.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓటు వేశారో బయటకు చెప్పడానికీ తెలియడానికీ వీల్లేదు కనుక ఎమ్మెల్యేల ఎంపీల ఓటు స్వేచ్ఛకు చట్ట పరంగా పరిమితులు లేవు. ఏ ఎన్నికలైనా రహస్యంగానే జరగాలి. ఎవరు ఎవరికి ఓటు వేశారో బహిర్గతం చేయడం వల్ల ఓటర్ల భద్రతకు రాజకీయంగా ప్రమాదం ఏర్పడకుండా ఉండేందుకే ఓటు రహస్యంగా కాపాడతారు. అంతరాత్మ ప్రబోధాన్ని విని ప్రజాప్రతినిధులు ఓటు వేయాలని రాజ్యాంగం ఉద్దేశం.

అయితే స్వేచ్ఛగా వేసే ఆ ఓట్లు ఏవిధంగా వేయాలో తెలియకపోతే ఓటు వృ««థా అవుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మామూలుగా ఒక ఓటుకు ఒక విలువ ఉండదు. ఒక్కో ఎమ్మెల్యేకు ఎంపీకి రాష్ట్రాల జనాభాను బట్టి ఓటు విలువ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఎమ్మెల్యేల సంఖ్యతో ఆ రాష్ట్ర జనాభాను విభజిస్తే వచ్చే ఫలితాన్ని వేయితో గుణిస్తే వచ్చేది ఎమ్మెల్యే ఓటు విలువ. ఆవిధంగా జనాభాకు దామాషా పద్ధతిలో విలువను నిర్ధారిస్తారు.

జనాభా ఏటేటా పెరుగుతున్నా 1971 జనాభాలెక్కలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు. ఉదాహరణకు:  తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలున్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం జనాభా 1.57 కోట్లు. 1.57 కోట్లను 119తో విభజించి 1000తో గుణిస్తే ఒక్కో ఓటుకు 132 విలువ వస్తుంది. మొత్తం తెలంగాణ ఓట్ల విలువ 119ని 132తో గుణిస్తే 15,708 అని తేలుతుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో జనాభా తక్కువ. 4,67,511 జనాభాను 60 స్థానాలతో విభజించి వేయితో గుణిస్తే వచ్చే విలువ 8, 8ని 60తో గుణిస్తే మొత్తం ఓట్ల విలువ 480. దేశం మొత్తం మీద 4,120 మంది ఎమ్మెల్యేల విలువ 5,49,495. ఈ మొత్తం దేశ ఎమ్మెల్యేల విలువను 776 తో (543 లోక్‌సభ సభ్యులు ప్లస్‌ 233 రాజ్యసభ సభ్యుల సంఖ్య)తో గుణిస్తే 5,49,408 వస్తుంది. మొత్తం 10,98, 908 ఓట్లలో అధిక ఓట్ల విలువలో వచ్చిన వారు గెలుస్తారు.

ఓకే ఓటు వేసినా అది అభ్యర్థులకు బదిలీ అయ్యే వీలుంది. అంటే ఒక అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి రెండో ప్రాధాన్యత ఓటు మరొకరికి ఇచ్చి ఉంటే, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలవడానికి తగిన పూర్తి మెజారిటీ ఎవరికీ రాకపోతే, రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కిస్తారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి అవసరాన్ని బట్టి మూడో ప్రాధాన్యత నాలుగో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించవలసి రావచ్చు. వాటితో కలుపుకుని ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్టు పరిగణిస్తారు.

మొదట ప్రాధాన్యత ఓట్లలో సగం కన్న ఒకటి ఎక్కువ ఓట్లు వస్తే గెలుపు సిద్ధిస్తుంది. బ్యాలెట్‌ పత్రంలో అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో ప్రాధాన్యతా అంకెను వేయాలి. ఉదాహరణకు రామ్‌నాథ్‌ కోవింద్‌కు తొలి ప్రాధాన్యత ఓటు వేయదలచుకుంటే ఆయన పేరు ఎదురుగడిలో 1 అంకెను రాయాలి. మీరా కుమార్‌కు రెండో ఓటు వేయదలచుకుంటే ఆమె పేరు ఎదురుగా 2 అని రాయాలి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపు సాధ్యం కాకపోతే, రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో ఓటుకున్న విలువను గుణించి అభ్యర్థికి వచ్చిన మొత్తం ఓట్ల విలువ నిర్ధారిస్తారు. ఒక్కోసారి, మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి ఇచ్చిన తరువాత అదే ఓటులో రెండో ప్రాధాన్యత ఉంటే దాన్ని రెండో వ్యక్తికి బదిలీ చేస్తారు. దీన్నే బదిలీ చేయగల ఒకే ఓటు పద్ధతి అంటారు.

అయితే ఓటు వేసే పద్ధతి తెలుసుకుని తమ ఎంపికను అనుసరించి ఓటు వేస్తే ఎవరిని గెలిపించదలుచుకున్నారో వారినే గెలిపించే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతి తెలియకపోతే ఒకరికి ఓటువేద్దామనుకుంటే అది మరొకరికి బదిలీ అయ్యే అవకాశం ఉంది లేదా చెల్లకుండా కూడా పోవచ్చు.  ఇటీవల పట్టభద్రులు టీచర్ల నియోజకవర్గంలో శాసనమండలి సభ్యత్వానికి జరిగిన ఎన్నికల్లో చదువుకున్న వారికీ ఓటు వేయడం రాలేదు. అభ్యర్థి క్రమసంఖ్య 18 అయితే కొందరు పంతుళ్లు అభ్యర్థి ఎదురుగా ఉన్న గడిలో 18 రాయడం వల్ల పనికిరాకుండా పోయింది. అంటే 17 రౌండ్లలో కూడా ఎవరూ ఎన్నిక కాకపోతే 18వ లెక్కింపు చేయాలన్నమాట. 2012లో 15 మంది ఎంపీలు, 54 మంది ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లకుండా పోయాయంటే మనం గర్విం చాలా?

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
మాడభూషి శ్రీధర్‌
professorsridhar@gmail.com

మరిన్ని వార్తలు