ఆ అవిచ్ఛిన్నతే మన విలక్షణత

8 Aug, 2015 00:29 IST|Sakshi
ఆ అవిచ్ఛిన్నతే మన విలక్షణత

ఎన్‌ఎస్‌సీఎన్‌తో శాంతి  ప్రక్రియకు 1995లో పీవీ నరసింహారావు శ్రీకారం చుట్టగా, ఇప్పుడు మోదీ దాన్ని పరిపూర్తి చేశారు. దీనిని ఈ దృష్టి కోణం నుంచి చూడండి. ఈ ప్రక్రియకు ఇరవై ఏళ్లు పట్టింది. ఆరుగురు ప్రధానుల ప్రభుత్వాలు మారాయి. అయినా భారత పరిపాలనా వ్యవస్థతో చర్చలు జరపడం విధానపరమైన కొనసాగింపుగానే ఉంటుం దని సగర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలలో ప్రభుత్వాలు రావచ్చు, పోవచ్చు. కానీ రాజ్య వ్యవస్థ కొనసాగింపు మాత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండాల్సిందే.
 
 
 కుశాగ్రబుద్ధులైన నాయకులకు తమకున్న సమయం పరిమితమని, అధికా రం పరివర్తనాత్మకమైనదని తెలిసి ఉంటుంది. అలాంటివారిలోకెల్లా ఎక్కువ తెలివిమంతులకు మరో గుణం కూడా ఉంటుంది. తమ పదవీ కాలంలోగా పూర్తి చేయలేమని తెలిసి కూడా కొన్ని పనులను ప్రారంభించడానికి వారు భయపడరు.

 మెరుపు వేగపు కాలంలోనూ....
 అసహనంతో కూడిన నేటి మెరుపు వేగపు కాలంలో ఇదో సంక్లిష్ట సూత్రీకరణే అవుతుంది. పెద్ద ప్రజాస్వామ్య దేశాల నేతలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ప్రజలతోనూ, తోటి దేశాధినేతలతోనూ సంభాషిస్తున్న కాల మిది. ఆ సంభాషణ, ఫ్రాన్స్‌లోని రీయూనియన్ దీవిలో దొరికిన విధ్వంస శకలం, 515 రోజులుగా కనిపించకుండా పోయిన ఎమ్‌హెచ్ 370 విమానా నిదేననే ధ్రువీకరిస్తూ మలేసియా ప్రధాని రాసి పంపిన 400 పదాల సందే శమే కావచ్చు. లేదా నాసా అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములతో ఒబామా ట్వీటర్‌లో ప్రేమపూర్వకంగా పరిహాసాలాడి అమెరికా ప్రజలను ఉల్లాస పరచడమే కావచ్చు.

లేదంటే నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 6.30 నిమిషాలకు ఒక ముఖ్య నిర్ణయాన్ని ప్రకటిస్తాననే ఉత్కంఠభరితమైన 100 అక్షరాల వ్యాఖ్యతో మొత్తంగా భారతావనిని వేచి చూసేట్టు చేయడమే కావచ్చు. ఏదేమైనాగానీ ఈ మెరుపు వేగపు యుగంలో కూడా పరిపాలన ఓపికగా నిర్వహించాల్సిన వ్యవహారమే.  మీరొకవేళ దీన్ని మరింత భావుకతా రహితంగా, సాదాసీదాగా చెప్పా లంటే మార్పు జరిగే వేగం అనొచ్చు. లేదంటే  బీబీసీ యాంకర్ నిక్ గోవింగ్ అన్నట్టు ‘రియల్ టైమ్’ (జరుగుతున్న దాని సమాచారాన్ని అది జరుగుతుండగానే చేరవేస్తుండటం) నిరంకుశత్వమనే మరింత బలీ యమైన వ్యక్తీకరణను అరువు తెచ్చుకోవచ్చు.

ఏదేమైనా అసాధారణంగా పరిణతి చెందిన రాజకీయాలకు, కుశాగ్రబుద్ధులైన నాయకులకు సంస్థాగతమైన నిరంతరాయతను కొనసాగించడానికి ఇప్పుడా రియల్ టైమ్ సమాచార సంబంధాలు అవసరం అవుతున్నాయి. లేదా తమ కాలంలో ఫలప్రదం కావడాన్ని చూడలేని ప్రాజె క్టులను ప్రారంభించగలిగే ఆత్మ విశ్వాసాన్ని కలిగించడానికి లేదా మరెవరైనా ప్రారంభించి, పూర్తి చేయకుండా ఆ బాధ్యతను తమ వారసులకు వదిలి పోతే... వారు తమ ప్రత్యర్థులే అయినా వాటిని పూర్తి చేయడానికి తోడ్పడు తున్నాయి. మోదీ ‘‘ముఖ్య ప్రకటన’’ తుయింగాలెంగ్ మ్యువా, ఇసాక్ చిసి స్వుల నేతృత్వంలోని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్)తో ఒప్పందం స్వరూప స్వభావాల చట్రానికి సంబంధించి మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సంబంధించినది.

కాబట్టి ఈ  నిరంత రాయతను గురించి చర్చించడానికి ఈ వారం సరిగ్గా సరైనది. చైనా శిక్షణ పొందిన ఈశాన్య ఆదివాసి తిరుగుబాటుదారుల గ్రూపులలో  చెప్పు కోదగిన స్థాయిదైన ఎన్‌ఎస్‌సీ ఎన్‌తో శాంతి  ప్రక్రియ 1995లో మొదలైంది. మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన పీవీ నరసింహారావు దానికి శ్రీకారం చుట్టారు. గౌడ-గుజ్రాల్ హయాంలో కూడా అది కొనసాగింది. అటల్ బిహారీ వాజ్‌పేయి దానికి నూతనోత్తేజాన్ని కలుగజేయగా, మన్మోహన్‌సింగ్ దశాబ్దికిపైగా ఆ ప్రక్రియ ను దృఢంగా కొనసాగించారు. ఇప్పుడు మోదీ దాన్ని పరిపూర్తి చేశారు. దానిని ఈ దృష్టి కోణం నుంచి చూడండి. ఈ ప్రక్రియకు ఇరవై ఏళ్లు పట్టింది. ఈ కాలంలో ఆరుగురు ప్రధానుల ప్రభుత్వాలు మారాయి. అయినా భారత పరిపాలనా వ్యవస్థతో చర్చలు జరపడం విధానపరమైన కొనసాగింపుగానే ఉంటుందని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలలో ప్రభుత్వాలు రావచ్చు, పోవచ్చు. కానీ రాజ్య వ్యవస్థ కొనసాగింపు మాత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగు తుండాల్సిందే.

 అనవసర నిష్టూరం
 వివిధ అంశాలపై మోదీ ప్రభుత్వం... తమ సొంత ఆలోచనల, తాము చొరవ తో చేపట్టిన కార్యక్రమాల ఖ్యాతి తమదేనని కాజేస్తోందంటూ కాంగ్రెస్ హేళన చేస్తోంది. అలా కాంగ్రెస్ హేళన చేస్తున్న వాటిలో నేటి నాగా ఒప్పందం తోపాటూ, బంగ్లాదేశ్‌తో కుదిరిన భౌగోళిక సరిహద్దు ఒప్పందం, అణు ఒప్పందం అమల్లోకి వచ్చే విధంగా అణు పరిహార బాధ్యత నిబంధనలను సడలించడం, నిజాయితీతో ఆధార్ అమలును చేపట్టడం, ఆధార్ సహాయం తో లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీని ఎల్‌పీజీ సబ్సిడీతో ప్రారంభిం చడం, ఆటోమేటిక్‌గా దేశంలోకి రిటైల్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేయడం, ఇన్సూరె న్స్ రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐ తదితరమైనవి ఉన్నాయి. ఇవన్నీ వాస్తవంగా యూపీఏ హయాంలో పుట్టుకొచ్చిన  ఆలోచనలే, నిజమే.
 కానీ ఆ వాస్తవానికి కొన్ని పరిమితులూ వర్తిస్తాయి. మొదటిది, యూపీ ఏ నిండా పదేళ్లూ అధికారంలో ఉంది. కొత్త ఆలోచనలను చలామణిలోకి తేవడానికి తగ్గ మద్దతు, సమయమూ కూడా దానికి ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే, వాటిని ఆచరణలోకి తెచ్చే సమయం కూడా దానికి ఉంది. కానీ జాతీయ సలహా మండలి (ఎన్‌ఏసీ) ఒత్తిళ్లు దాని దృష్టిని మరల్చాయి. ఉదాహరణకు ఆధార్, ప్రత్యక్ష లబ్ధి బదలాయింపు, రిటైలు ఎఫ్‌డీఐ తదితర అంశాలను ఎన్‌సీఏ అనుమానాస్పందంగా చూసింది. దీనికి తోడు, కుంభ కోణాల రుతువు ప్రారంభమై, 2011లో అన్నా హజారే ప్రత్యక్షం కావడంతో యూపీఏ తన  రాజకీయ పెట్టుబడిని కోల్పోతూ వచ్చిన వేగానికి వారు దారి తప్పి పోయారు. మోదీ తమ ఆలోచనలను దొంగిలించారని ఆరోపించడానికి బదులుగా, వాటిని ఆయన మరింత శక్తివంతంగా ముందుకు తీసుకుపోతు న్నందుకు వారు సంతోషించాలి. తక్కువగా పరిణతి చెందిన ప్రజాస్వామ్యం లో మునుపటి ప్రభుత్వానికి వారసులుగా వచ్చిన వారిలో తమకు ముందటి వారు ప్రారంభించిన ప్రతి దాన్నీ చెత్తబుట్టలో పారేయాలనే ఉబలాటం ఉంటుంది. ఈ విషయంలో తద్విరుద్ధంగా జరుగుతోంది. అయితే ఇది కొత్తది గానీ లేదా అసాధారణమైనది గానీ కాదు. జాతీయ స్థాయి నేతలు చాలా మందే ఇలాంటి ఫలిత ప్రాధాన్యవాదాన్ని ప్రదర్శించేవారు. సరిగ్గా ఇప్పుడు అధికారంలో ఉన్నవారి లాగే, వారిలో కొందరు ఆ ఖ్యాతి కోసం అత్యు త్సాహంతో పాకులాడీ ఉంటారు.

 మంచి యోచన ఎవరిదైనా మంచిదేగా?
 యూపీఏకున్న మేధోపరమైన ఆధిక్యతను తమ ప్రయోజనానికి వాడుకోవ డమనే మోదీ యోచన మంచిదే. అయితే ఆయన అంతకే పరిమితంగాక, విప్లవాత్మక ఆలోచనలకు ప్రజామద్దతును సమీకరించడమనే మరో శక్తిని కూడా ముందుకు తెచ్చారు. నగదు రూప ఎల్‌పీజీ సబ్సిడీని పేదలకు అనుకూలమైన సంస్కరణగా ఆయన చలామణి చేశారు. పేద ప్రజలకు   ఇచ్చే ఎల్పీజీ సబ్సిడీ... దొంగిలించడానికి సైతం అతి తక్కువ విలువైనదనే అభిప్రాయం ఏర్పడేలా ‘‘గివ్ ఇట్ అప్’’ (సబ్సిడీ వదులుకునే) కార్య క్రమాన్ని తానే స్వయంగా ప్రచారం చేశారు. ఒబామాతో ఉమ్మడి పత్రికా సమావేశంలో నిలచి ఆయన... భారత-అమెరికా మైత్రికి అణు ఒప్పందం అత్యంత కీలకమై నదని చెప్పారు. బంగ్లాదేశ్‌తో భౌగోళిక సరిహద్దు ఒప్పం దం విషయంలో ఆయన తన వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టారు. ఇక ఇప్పుడాయన నాగా ఒప్పందాన్ని ప్రధాని అధికారిక నివాసంలోని పెద్ద ఘటనగా మార్చారు. మోదీ తమ ఆలోచనలపై స్వారీ చేస్తున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తోంది. కానీ ఆలోచించి చూడండి, మరే చిన్నపాటి దేశంలోనో ఆయితే ఆయన వాటిని చెత్తబుట్టకు చేర్చేవారే. యూపీఏనే గనుక మరింత ఆత్మవిశ్వాసంగల ప్రభుత్వమో లేదా మరింత మెరుగైన రాజకీయ నిర్వాహ కులో అయి ఉంటే ఇలా వంటకాల జాబితానంతటినీ అర్ధంతరంగా వంటగది బల్లపై వదిలేసేవారే కారు.  

 ఈ విమర్శల గోలను పక్కనబెడితే, అతి ముఖ్య సంఘటనలతో నిండిన ఈ వారంలో మన చర్చనీయాంశం ‘అంతా మంచే’ అనే వాదనే. దేశాల తలరాతలను మలచడంలో మార్పు ఎంత ముఖ్యమైనదో, సంస్థా గతమైన కొనసాగింపు కూడా అంతే ముఖ్యమైనది. మన రాజకీయ వ్యవస్థ ఎంతగా రెండుగా చీలిపోయి ఉన్నప్పటికీ, పార్లమెంటు పనిచేయ కుండా పోయినా, రాజకీయ వాతావరణంలో విద్వేషం వ్యాపించి ఉన్నా మనమింకా మంచి ఆలోచనలను కేవలం అవి మరెవరివో అనే కారణం తో మూలన పారేయడం లేదు. ఈ వారంలో జరిగిన ఘటనలు దానినే రుజువుచేస్తున్నాయి.

 దేశానికి మన నేతల కానుక  
 మన నాయకులు దేశానికి విధానపరమైన కొనసాగింపు అనే కానుకను ప్రసాదించారు. కొన్ని సందర్భాల్లో వారు సంకుచితమైనవే అయినా కీల కమైన తమ ప్రయోజనాలను త్యాగం చేశారు. అలా స్వార్థ రాజకీయ ప్రయోజనాలను పరిత్యజించినందుకు గానూ వెనక్కు మళ్లారనే ఆరోపణ లను వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ అంశంపై మీరు ఓ గ్రంథమే రాయొచ్చు. పీవీ నరసింహారావు అణు పరీక్షలను జరపడానికి అవస రమైన సన్నాహాలన్నిటినీ చడీ చప్పుడు కాకుండా ఎలా పూర్తి చేశారనేది నాకు ఇష్టమైన ఉదాహరణ. అణు పరీక్షలను కూడా నిర్వహించి ఉంటే అది ఆయనకు 1996 ఎన్నికల్లో లబ్ధిని చేకూర్చేదే. కానీ అంతటి సాహ సోపేతమైన చర్యను చేపట్టి కూడా నెట్టుకురాగల రాజకీయ పెట్టుబడి తనకు గానీ, తగిన ఆర్థిక, రాజకీయ శక్తిసామర్థ్యాలు దేశానికి గానీ ఆనాడు లేవని ఆయనే అంగీకరించారు. తదుపరి వెలువడిన పలు కథనా లు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అత్యంత గౌరవీయులైన అణు శాస్త్రవేత్త అనిల్ కాకోద్కర్ ఇటీవల నాకో ఇంటర్వ్యూలో వెల్లడి చేసిన విషయాలు కూడా వాటిలో ఒకటి. వాజ్‌పేయి అధికారం చేపట్టినప్పుడు పీపీ నరసింహారావే స్వయంగా ఆయనతో మొత్తం ‘‘సామగ్రి’’నంతా సమకూర్చి ఉంచానని చెప్పిన విషయం కూడా సుప్రసిద్ధమైన వాస్తవమే. 1988 నాటికి వాజ్‌పేయి దేశానికి అవసరమైన ఆర్థిక, దౌత్యపరమైన శక్తి సమకూరిందనే నిర్ధారణకు వచ్చారు. ఆ పనిని పూర్తి చేశారు. ప్రస్తుతం మోదీ అమలులోకి తెస్తున్న చాలా ఆలోచనల్లాగే, వాజ్‌పేయి కూడా పూర్వ ప్రభుత్వం తలపెట్టిన అణు పరీక్షలను పరిపూర్తి చేశారు. అలా మోదీ అమలు చేస్తున్న వాటిలో నాగా ఒప్పందం కూడా ఒకటి. కాబట్టే ఇది ఇంతగా మనం సంతోషపడాల్సిన అద్భుతమైన వారమైంది.

 తాజా కలం: సోవియట్ నిర్వహించిన అంతరిక్ష కార్యక్రమంలో (1984) పాల్గొన్న ఏకైక భారతీయుడు స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ మాత్రమే. అతనితో టెలిఫోన్ సంభాషణలో ఇందిరాగాంధీ... అంతరిక్ష నౌకలో పరిభ్రమిస్తూ చూస్తుంటే భారతదేశం ఎలా కనిపిస్తోందని ప్రశ్నించారు. అందుకు సిద్ధంగా ఉన్నట్టుగా శర్మ ‘సారే జహాసే అచ్ఛా’ (ప్రపంచంలోకెల్లా ఉత్తమమైనది) అంటూ భారతీయులంతా ఎరిగిన కవి ఇక్బాల్ చరణాన్ని బదులుగా చెప్పారు. అలా ఇందిర ఆ క్షణాన్ని అజరా మరమైందిగా మార్చారు.
 కాలం మారింది. తదనుగుణంగానే సమాచార సాదానాలు కూడా మారాయి. కాబట్టే రెండు ట్వీటర్ హ్యాండిల్స్‌ను ఉపయోగించే అమెరికా అధ్యక్షుడు ఒబామా నాసా అంతరిక్ష కేంద్రం తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ అక్కడి వ్యోమగాములతో పరిహాసోక్తులు సాగించారు. ‘‘హేయ్ స్టేషన్ సీడీఆర్‌కెల్లీ, మీరు పంపిన ఫొటోలను చూస్తున్నాను. ఎప్పుడైనా నువ్వు కిటికీలోంచి బయటకు చూసి మతిపోగొట్టుకున్నావా?’’ అని అడిగారు. కెల్లీ అనే ఆ వ్యోమగామి ‘‘అధ్యక్షా! నేను దేని గురించీ మతిపోగొట్టుకోను... ట్వీటర్‌లో మీరు సంధించే ప్రశ్న గురించి తప్ప’’ అంటూ మన రాకే ష్ శర్మ కంటే ఒకింత ఎక్కువ లాంఛనంగా అతడు సమాధానం చెప్పాడు.

అయితేనేం, లక్షలాది మంది ప్రశంసలను అందుకున్నాడు.  రియల్ టైమ్ సాంకేతికత, నిరంకుశత్వం అనేవి బుద్ధికుశలురైన, ఆధునిక నాయకుల చేతుల్లో ఎంతటి బలమైన సమాచార సాధనాలు కాగలు గుతాయో ఇది తెలుపుతుంది. అయితే ఇరాన్‌తో ఒప్పందంపై ప్రజాభి ప్రాయాన్ని, కాంగ్రెస్ మద్దతును కూడగట్టడానికి కూడా ఒబామా తన ట్వీటర్ హ్యాండిల్స్‌ను నిరంతరాయంగా కూడా వాడుతున్నారనుకోండి.

 

 

(శేఖర్ గుప్తా.. twitter@shekargupta)

మరిన్ని వార్తలు