పోలవరం కల నెరవేరేనా?

22 Jul, 2016 03:45 IST|Sakshi
పోలవరం కల నెరవేరేనా?

విశ్లేషణ
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నీటి, విద్యుత్‌ కొరతను తీర్చే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నది ఎవరు? ఈ ప్రాజెక్టును కాంట్రాక్టుకు తీసుకున్న టీడీపీ ఎంపీకి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ నిర్వాకమే ఈ స్తబ్దతకు కారణం.


రాష్ట్ర విభజనలో జాతీయ హోదా పొందిన పోలవరం ప్రాజెక్ట్‌ కేంద్ర, రాష్ట్ర రాజ కీయాల మధ్య నత్తనడకతో కొనసాగుతోంది. ఈ ప్రాజె క్ట్‌ని 2018 నాటికి పూర్తి చేస్తా మని చంద్రబాబు ప్రభుత్వం చెపుతున్నా వాస్తవ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. నిజానికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నిధుల సమస్య లేకుండా 24 గంటలూ పనులు జరిగితేనే ఎనిమిదేళ్లు పడుతుందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ కేవలం మట్టిపనులు తప్ప ప్రాజెక్టు పనులేమీ చేపట్టని ప్రభుత్వం మరో రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం నిజంగా హాస్యాస్పదమే.

2005లో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినా ఇప్పటివరకూ కొలిక్కి రాలేదు. జాతీయ హోదా పొందిన ఈ ప్రాజెక్టుకు నూరుశాతం నిధులు సమ కూర్చే బాధ్యత మాదే అని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ విడుదల చేసిన నిధుల విని యోగానికి సంబంధించిన లెక్కలు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేయట్లేదని తమపై నిందలు మోపుతోందని ఆరోపిస్తుంది. పోల వరం నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికీ సమగ్ర ప్రణాళిక రూపొందించక పోవడం చూస్తుంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తుందని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ హుకుం సింగ్‌ ఇటీవలి భేటీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తçప్పుబట్టారు.

అయితే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్ట్‌ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ నిర్లక్ష్యమే అది ముందుకు సాగక పోవడానికి అసలైన కారణమని స్పష్టమవుతుంది. ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ పనులు చేయకపోయినప్పటికీ ఆ సంస్థనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చడం వెనుక ఆ సంస్థ అధికార పార్టీకి చెందిన ఎంపీది కావడమే కారణం. ప్రస్తుత కాంట్రాక్టర్‌ ఏజెన్సీ పనులు చేయడంలేదని, వెంటనే తప్పించాలని స్వయంగా పోలవరం అథారిటీ లేఖ రాసినా.. దాన్ని తోసిరాజని ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించకుండా సబ్‌ కాంట్రాక్టర్‌ను తెచ్చుకునే వెసులుబాటుని ఆ సంస్థకే కల్పించింది. మరో వైపు ఆ కాంట్రాక్టర్‌ పనుల విలువ వ్యయాన్ని రూ. 4,054 కోట్ల నుంచి రూ. 6,961.70 కోట్లకు, ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రూ. 16,010.45 కోట్ల నుంచి రూ. 31 వేల కోట్లకు అమాంతం పెంచేశారు

పోలవరం ప్రాజెక్టులో ఇప్పటిదాకా కేవలం పది శాతం పనులు మాత్రమే జరిగాయి. టెండర్‌ దక్కించు కున్న ట్రాన్స్‌ట్రాయ్‌ 60 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటికే 40 నెలలు గడిచిపోయినా పనులు మాత్రం 10 శాతమే పూర్తయ్యాయి. ఇంకా 90 శాతం పనిని రెండేళ్లలో పూర్తి చేయాలి. ప్రతికూల వాతావరణం పరిస్థితులను పరిగణనలోకి తీసుకొంటే నెలకు 6 శాతం పనులు చేస్తేనే గడువులోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్క శాతం మేరకే పనులు జరుగుతున్నాయి. ఇంకా స్పిల్‌వే, స్పిల్‌ చానెల్, అప్రోచ్‌ చానెల్, పవర్‌ హౌస్‌ నిర్మాణం పూర్తి కావాలి. ఇది జరగాలంటే ముందుగా ఆగస్టు నెలాఖరుకి మట్టి తవ్వకాలు పూర్తి కావాలి. అప్పుడే స్పిల్‌వే దగ్గర కాంక్రీట్‌ పనులు మొదలవుతాయి. అలా జరగాలంటే రోజుకి 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వి తరలిం చాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం రోజుకు 1 లక్షా 10 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని మాత్రమే తరలిస్తున్నారు. స్పిల్‌వే దగ్గరే ఇప్పటికి 42 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాల పని మిగిలివుంది.
ఒక పక్క వర్షాకాలం ప్రారంభమైంది. ఈ కాలంలో మట్టి తవ్వకాలకు ఇబ్బందులు ఏర్పడతాయి. అలాంటప్పుడు మట్టి తవ్వకం పనులే సగంపైగా మిగిలి వున్నాయంటే ప్రాజెక్ట్‌ ఇంకెంత ఆలస్యం అవు తుందన్నది కళ్లెదుటే కనబడుతుంది. వీటికి కాంక్రీట్‌ పనులు అదనం. ఇప్పట్లాగే పనులు సాగితే కేవలం కాంక్రీట్‌ పనులు పూర్తవడానికే ఐదేళ్లు పైగా పడు తుందని నిపుణులు చెపుతుండడం గమనార్హం.

పోలవరం కుడి కాల్వ నిర్మాణంపై చాలా వివా దాలు గత పదిహేనేళ్లుగా కోర్టులో వున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి ఏంచేస్తారనే ప్రశ్నకు సమాధానం కరువవుతుంది. అసలు కాల్వలే లేకుండా ఒక సంవ త్సరం లోపల ప్రాజెక్టు పూర్తిచేసి నీటిని ఏ కాల్వలోకి లిఫ్ట్‌ చేస్తారు, ఎలా ఎక్కడకు తీసుకు వెళతారు అన్నది రైతాంగానికి అంతుపట్టడం లేదు. కాంట్రాక్టులో లొసు గులు ఉన్నాయని, ప్రకాశం బ్యారేజీ వద్ద నీటినిల్వకు అవకాశం లేదని ప్రతిపక్షం చేస్తున్న వాదనకు మించి క్లిష్టమైన అంశాలెన్నో దీనిలో ఇమిడి వున్నాయి. 2018 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని పదేపదే చెపుతున్న బాబుగారు ఇప్పుడు హడావుడిగా పట్టిసీమ ఎందుకు కట్టవలసి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంది. ఎందుకంటే నిజంగానే మరో నాలు గేళ్లలో పోలవరం పూర్తిచేస్తే పట్టిసీమ అవసరం ఉండనే ఉండదు. అటువంటప్పుడు పట్టిసీమకైS ఖర్చు పెట్టిన ఇంచుమించు రూ.1,300 కోట్లు గోదాట్లో పోసినట్లే. ఈ పట్టిసీమపై పెట్టిన శ్రద్ధ, ఖర్చునే పోలవరంపై పెట్టి ఉంటే పనులు కొంతమేరకైనా ముందుకు సాగేవి. అలా చేయకపోవడం వెనుక బాబుగారి స్వంత ప్రయో జనాలు ఉన్నాయనేది చెప్పకనే చెపుతున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అవినీతి, అల సత్వం పోలవరానికి ప్రతిబంధకాలుగా మారుతు న్నాయి. ఇన్ని అవరోధాల మధ్య ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ ఎప్పటికి పూర్త వుతుందో అని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెర వాలి. రాష్ట్ర ప్రయోజనాలను స్వప్రయోజనాలకు బలి చేయకుండా పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ట్రాన్స్‌ ట్రాయ్‌ని వెంటనే తొలగించి అనుభవం ఉన్న వేరే కాంట్రాక్టర్‌కు ప్రాజెక్ట్‌ పనులు అప్పగించాలి. అలా చేయకుండా ఎన్నికల హామీని విస్మరించి రాష్ట్ర భవి ష్యత్తుతో రాజకీయం చేసే పక్షంలో ప్రజల ఆందోళన ఆవేశంగా మారే అవకాశం లేకపోలేదు.

 

 

 

 

(వ్యాసకర్త: కూసంపూడి శ్రీనివాస్, అధికార ప్రతినిధి, లోక్‌సత్తా పార్టీ. మొబైల్‌ : 9000165971).

 

మరిన్ని వార్తలు