అధ్యాపకుల కొరతే అసలు సమస్య

5 Sep, 2013 00:34 IST|Sakshi
అధ్యాపకుల కొరతే అసలు సమస్య

దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అన్ని స్థాయిల్లోనూ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. యూజీసీ నిబంధనల ప్రకారం దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలను సమర్థంగా నిర్వహిం చేందుకు లక్షలాది మంది అధ్యాపకులు అవసరం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ పాఠశాలల్లో అవసరమైన వారి కంటే 3 లక్షల మంది ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. బీహార్‌లో 2.60 లక్షల మంది తక్కువగా ఉన్నారు. మిగి లిన రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు దేశ విధా న నిర్ణేతలు ఇప్పటికైనా నడుం బిగించాలి. ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తిని ఎక్కువ మంది కోరుకునే వారు. ప్రతిభావంతులైన యువకులకు ఇప్పుడది ఏమాత్రం ఆకర్షణ లేని వృత్తిగా మారింది. ఫలితంగా లక్షలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా మిగులుతున్నాయి.
 
 ఇంజనీర్లు, డాక్టర్లు తక్కువమంది ఉన్నా భారత్ నెట్టుకు రాగలదు. అయితే, ఉపాధ్యాయుల సంఖ్య ఇంత తక్కువగా ఉంటే మాత్రం నెట్టుకు రావడం చాలా కష్టం. ఇంజనీరింగ్, మీడియా, మేనేజ్‌మెంట్ వంటి వృత్తులు భారీ ఆదాయాన్ని ఇస్తుండటంతో నేటి యువత వాటి కోసం పోటీ పడుతోంది. సీవీ రామన్, హోమీ జహంగీర్ బాబా, డాక్టర్ రాజేంద్రప్రసాద్ వంటి నిష్ణాతులను తయా రు చేసిన ఉపాధ్యాయుల వంటి వారు మనకిప్పుడెవరైనా ఉన్నారా?... ఆ ఉపాధ్యాయులకు పెద్దపెద్ద డిగ్రీలు లేకపోవచ్చు. అయితే, బోధన పట్ల వారికి అపరిమితమైన తపన ఉం డేది. విద్యార్థులకు వారు బోధించేటప్పుడు వారి తపన ప్రతిఫలించేది. ప్రస్తుతం విద్యాసంస్థల సంఖ్యలో గణనీయంగా పెరుగుదల కనిపిస్తున్నా, విద్యారంగంలో నాణ్యత తగ్గుతోంది.
 
 సమర్థులైన ఉపాధ్యాయులు దేశంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 85 శాతం మంది ఉపాధ్యాయులకు వారి పనేమిటో తెలియదు. ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో నాణ్యమైన బోధన లభించడం లేదు. ఉపాధ్యాయులు సంపూర్ణమైన అవగాహన, తాము బోధించే అంశాలపై లోతైన పరి జ్ఞానాన్ని పెంచుకోవాలి. బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఉపాధ్యాయులకు స్వీయ అధ్యయనం చాలా ముఖ్యం. అధ్యాపకుల బోధన నిరాసక్తంగా ఉన్నప్పుడే విద్యార్థులు తరగతులను ఎగ్గొడతారు. విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించి, ప్రభావవంతమైన రీతిలో బోధించినట్లయితే, వారు తరగతులను విడిచిపెట్టరు. ఈ పరిస్థితిని చక్కదిద్ది బోధనలో నాణ్యతను మెరుగుపరచేందుకు దేశవ్యాప్తంగా ‘ఉపాధ్యాయులకు బోధన’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలి. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ, యూజీసీ చొరవ తీసుకోవాలి. ప్రస్తుతం ఉపాధ్యాయుల పరిస్థితి టీవీ సీరియళ్లు, సినిమాల్లో ఎగతాళి చేసే స్థాయికి దిగజారింది. ఉపాధ్యాయ దినోత్సవం ఒక తప్పనిసరి తంతు స్థాయికి దిగజారింది.
 
 ఇది చాలా దురదృష్టకరం. మరి కొందరు ఉపాధ్యాయులు కోచింగ్ పరుగు పందెంలో ఉన్నత ప్రమాణాలకు, విలువలకు నీళ్లొదిలేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది. ఉపాధ్యాయులకు దక్కాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఉపాధ్యాయుల పట్ల గౌరవం క్షీణించడంలో విద్యార్థుల తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. ఒకవేళ ఉపాధ్యాయుడు ఎవరైనా విద్యార్థిని మందలిస్తే, తల్లిదండ్రులు తేలికగా తీసుకోవాలి. సరైన మార్గం పట్టేలా తమ పిల్లలకు స్ఫూర్తినివ్వాలి. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు, వ్యాపార రంగాల్లో మనకు రోల్ మోడల్స్ ఉన్నట్లే, బోధనా రంగంలోనూ రోల్ మోడల్స్ ఉండాలి.
 
 ఆనంద్ కుమార్
 సూపర్-30 వ్యవస్థాపకుడు
 (దశాబ్దానికి పైగా ఏటా ముప్పయి
 మంది పేద విద్యార్థులకు బీహార్‌లో
 ఐఐటీ శిక్షణ ఇస్తున్నారు)
 

మరిన్ని వార్తలు