గిరిజనులకు ‘ఉరి’ హారం

20 Jul, 2016 02:03 IST|Sakshi
గిరిజనులకు ‘ఉరి’ హారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గిరిజనులను బ్రతకనివ్వరా, వారిని బజారుపాలు చేస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. అనుభవిస్తున్న భూములకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా హరితహారం పేరుతో లాక్కుంటే ఎలా? మానవులు తమకు ఊహ తెలిసినప్పటి నుంచి భూమిని దుక్కి చేసి పంటలు పండించే ప్రక్రియకు పూను కున్నారు. ప్రకృతి పచ్చదనా నికి నిదర్శనం. పర్యావరణ సమతుల్యం లోపిస్తే జీవరాశుల ఉనికికే ప్రమాదం. అందులో సగటు మనుషులు తగిన ఆహారం లేకుండా జీవించజాలరు. రుతువులు సరిగా పనిచేయకుంటే అధిక వర్షాలు, కరువులు సంభవిస్తుంటాయి. అందుకని కనీసం 40 శాతం భూమిలో అడవి, నదులు, గుట్టలు ఉండటం సమంజసం.
 
 భూముల వర్గీకరణను ఎవరు ఏ ప్రాతిపదికన చేశారనేది ప్రధాన ప్రశ్న. రాచరిక వ్యవస్థలో భూము లపై హక్కుకు సంబంధించి రికార్డులు రూపొందించి, సర్వే నంబర్లు, రెవెన్యూ భూములుగా నమోదు చేశారు. రెవెన్యూ భూములలో ప్రభుత్వశిఖం, కారజు కాతా, దేవాదాయ, వక్ఫ్, ఇనాం తదితర సబ్ క్లాజు లుగా ప్రభుత్వాలు గుర్తించాయి. ఆ తర్వాత అసైన్ మెంట్, భూసంస్కరణ, అటవీ భూముల హక్కుల చట్టాలను ప్రభుత్వాలు తెచ్చాయి. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడు స్తున్నా ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ హద్దుల సమస్య వివాదాస్పదంగానే మిగిలిపోయింది. రెవెన్యూవారు లబ్ధిదారులకు పట్టా సర్టిఫి కెట్లు ఇస్తారు. అటవీశాఖ వారు అడ్డుతగులుతారు. మధ్యలో నిరు పేద రైతు నలిగిపోతున్నాడు. ముఖ్యమంత్రుల దృష్టికి తెచ్చినా వారు ప్రత్యేక కృషి చేయలేదు. ఇప్పటికీ ఈ అంశం జటిలంగా, కొరకరాని కొయ్యగా మారింది.
 
 గత 30 సంవత్సరాల నుంచి అనేక గిరిజనులతో పాటు ఎస్సీ, బీసీలు కూడా ప్రభుత్వ భూములను చదునుచేసుకొని పోడు వ్యవసాయం ద్వారా జీవనో పాధి గావించుకుంటున్నారు. ఇలా సుమారు 10 లక్షల ఎకరాల పోడు భూములలో సాగు చేయబడుతున్నది. యూపీఏ-1కు వామపక్షాలు బయటి నుండి మద్దతిచ్చిన సందర్భంలో 2006లో అటవీ భూముల హక్కుల చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 10 సంవత్సరాల నుంచి కాస్తులో ఉండి, అనుభవిస్తున్న వారికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉత్తర్వులు వెలువ డ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలివ్వడానికి సర్వేలు జరిగినా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం, సంక్లిష్ట రాజకీయ నేపథ్యంలో అవి పెండింగ్‌లో ఉండిపో యాయి. 2014 జూన్ 2న కొత్త తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటవీ భూముల చట్టప్రకారం గిరిజనులకు  సర్టిఫికెట్లు ఇస్తా రని భావించారు.
 
 కానీ దానికి భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం ‘‘హరిత హారం’’ పేరుతో పేదల భూములు లాక్కో వడానికి అటవీశాఖ, పోలీసు శాఖలను ఉసికొల్పింది, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు పూనుకున్నది. ఖమ్మం, వరంగల్, మహబూ బ్‌నగర్, నల్లగొండ, అదిలాబాద్ తదితర జిల్లాలలోని గిరిజనుల భూము లను బలవంతంగా లాక్కొంటూ మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టింది. తాత, తండ్రుల నుండి సాగు చేసుకున్న భూములను ఎలా లాక్కుంటారని, అన్యా యమని ఎదురు తిరిగిన పేదలపై పీడీ యాక్టు తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్ల పాలు చేసింది.
 
 గతంలో ఇలా జరిగినపుడు వామపక్షాలు ఐక్యం గాను విడివిడిగాను ఉద్యమబాట పట్టాయి. అసెం బ్లీలో చర్చ జరిగింది. కాస్తు చేసుకొని బ్రతుకుతున్న పేదల జోలికి అధికారులు వెళ్ళరని ముఖ్యమంత్రిగారే స్వయంగా నిండు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయినప్పటికీ గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడులు చేస్తున్నారు.
 
 అసెంబ్లీలో వాగ్దానం చేసి సంవత్సరం గడిచి నప్పటికీ గిరిజనులపై కేసులను ప్రభుత్వం ఉపసం హరించుకోలేదు. ఈసారి హరితహారం సందర్భంగా మళ్ళీ పోడు వ్యవసాయం చేసుకోకుండా అధికారులు అడ్డుపడుతూ దున్ననివ్వడం లేదు. ఖమ్మం జిల్లాలో కేవలం 86 వేల ఎకరాలలోని లబ్ధి దారులకు పట్టాలు ఇచ్చారు కానీ వాటిలో చాలా వాటిని దున్నుకోనివ్వడం లేదు. భూములకు వెళ్లిన రైతులను అరెస్టులు చేశారు.  దీనిపైన ఉన్నతాధికారులతో సమగ్రమైన విచారణ జరి పించాలని ిసీపీఐ కోరుతున్నది.
 
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గిరిజనులను బ్రతకనివ్వరా, వారిని బజారుపాలు చేస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. దళితులకు, గిరిజను లకు భూమిలేని కుటుంబానికి మూడెకరాల భూమి కొని ఇస్తామని వాగ్దానం చేశారు. అమలులో మాత్రం నత్తతో పోటీ పడుతున్నారు.
 గిరిజనులు బానిసలుగానే ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నదా! అందుకే మూడెకరాల వాగ్దానాన్ని అమలు చేయడం లేదా? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సబ్బండవర్ణాలు భాగస్వాములైన విషయం పాలకు లకు గుర్తు లేదా! ఈ రాష్ట్రంలో పలుకుబడి కలిగిన అనేక మంది భూ దొంగలు, కబ్జాకోరులున్నారు. వారి జోలికి వెళ్లరు? వారినుంచి భూములను స్వాధీనం చేసుకోరు.
 
ప్రభుత్వానికి పోలీసులకు పేదలంటే చులకన భావముండటం మానవత్వం అనిపించు కోదు. పైగా అనుభవిస్తున్న భూములకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా హరితహారం పేరుతో దానిని కూడా లాక్కుంటు న్నారు. అందుకేప్రభుత్వం ఇప్పటికైనా సమీక్షించు కోవాలి. ఆలోచనలో మార్పు చేసుకోవాలి. లేకపోతే ప్రభుత్వం అణచివేతకు నిరసన ఉద్యమాలు కొనసా గక తప్పదు. తక్షణమే 2006 అటవీ భూముల హక్కుల చట్టాన్ని అనుసరించి అర్హులైన పేదలందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలి. రెవెన్యూ, అటవీ భూముల సరి హద్దు నిర్ధారణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.
 వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
 - చాడ వెంకట్‌రెడ్డి
 మొబైల్ : 94909 52301

మరిన్ని వార్తలు