వివేకానంద, బోస్‌లపై వేటా?

29 Jan, 2016 01:54 IST|Sakshi
వివేకానంద, బోస్‌లపై వేటా?

విశ్లేషణ
కికెట్ గురించి చెప్పడానికి, బట్టల తయారీ విజ్ఞానానికి 37 పేజీలు కేటాయించి, జాతీయ యువజనులకు స్ఫూర్తి అయిన వివేకానందుని గురించి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో కేవలం 26 పదాలు ఇవ్వడం అన్యాయం.
 
నేతాజీ సుభాష్ చంద్ర బోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి జాతీయ విప్లవ నాయకుల జీవిత కథలు కేంద్రీయ విద్యాలయాల పాఠ్యపుస్తకాలలో ఎందుకు తగ్గించారు? కొన్నింటిని ఎందుకు తొలగించారు? మరికొందరు మహానుభా వుల జీవిత గాధలను ఎందుకు చేర్చడం లేదు? అని రాజస్థాన్‌కు చెందిన సూర్యప్రతాప్ సింగ్ రాజావత్ ఫిర్యాదు. దానికి సరైన ప్రతిస్పందనను తెలియజేయా ల్సిన బాధ్యత జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ)పైన ఉంది. ఆ విధంగా అడిగే హక్కును సమాచార హక్కు ప్రతి పౌరుడికీ  ఇచ్చింది.

ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పాఠ్యపుస్తకంలో స్వామి వివేకానంద జీవిత చరిత్రను 1,250 పదాల నుంచి 87 పదాలకు తగ్గించడం, 8వ తరగతి నుంచి పూర్తిగా తొలగించడం నిజమే అయితే.. క్రికెట్‌కు, బట్టల తయారీకి 37 పేజీలు కేటాయించి స్వాతంత్య్ర విప్లవ నాయకులకు తగిన స్థలం కేటాయించకపో వడం నిజమే అయితే.. 36 మంది జాతీయ నాయ కులకు పాఠ్యపుస్తకాలలో స్థానం లేకపోవడం నిజమే అయితే... అందుకు కారణాలు తెలియజేయాలి. దేశాన్ని నడిపిన కథానాయకుల జీవిత చరిత్రలను నిష్పాక్షికంగా, సైద్ధాంతిక ధోరణులకు తావులేకుండా పాఠాలుగా రూపొందించడానికి, సూర్యప్రతాప్ సింగ్ భయాందోళనలకు తావులేదని చెప్పడానికి ఏ చర్యలు తీసుకున్నారో సహ చట్టం కింద ఎన్‌సీఈఆర్‌టీ వివరించడం తప్పనిసరి.

శ్రీ అరబిందో ఘోష్, అశ్ఫాక్ ఉల్లాఖాన్, బీకే దత్, బాదల్ గుప్త, భాఘాజతిన్ ముఖర్జీ, బారిందర్ ఘోష్, బాతుకేశ్వర్ దత్, బినయ్‌క్రిష్ణ బసు, భగత్ సింగ్, చంద్రశేఖర్, దినేశ్ గుప్త, డాక్టర్ సైపుద్దీన్ కిచ్ లెవ్, జతింద్రనాథ్ దాస్, కల్పనా దత్, కర్తార్ సింగ్, ఖుదీరామ్ బోస్, ఎంఎన్ రాయ్, బికాజీ కామా, మదన్ లాల్ ధింఘ్రా, శ్యాంజీ కృష్ణవర్మ, ఒబేదుల్లా సింధి, ప్రఫుల్లా చాకీ, ప్రీతిలతా వఢ్డేదర్, రాజా మహేంద్ర ప్రతాప్, రాంప్రసాద్ బిస్మిల్, రాణీ ైగైడిన్ లుయు, రాస్ బిహారీ బోస్, సచీంద్రనాథ్ సన్యాల్, సావర్కార్, సోహాన్‌సింగ్ భక్నా, సుఖదేవ్, సూర్య సేన్, స్వామీ వివేకానంద, ఉధ్దమ్‌సింగ్ వంటి మహా నాయకుల జీవితాలను ఎందుకు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలలో చేర్చలేదని రాజస్థాన్ శ్రీ అరబిందో సొైసైటీ కన్వీనర్ సూర్యప్రతాప్ విమర్శించారు.

2007 ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఎని మిదో తరగతి పుస్తకంలో 500 పదాలు, 12వ తరగ తిలో 1250 పదాల పాఠాలు ఉండేవని, ఆ తరువాత 12వ తరగతి పాఠం 87 పదాల వ్యాసానికి తగ్గించా రని  ఎనిమిదో తరగతి నుంచి పూర్తిగా నేతాజీ పాఠాన్ని ఎత్తివేసారని తెలియజేయాలని, నేతాజీ, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్ వంటి విప్లవకారులతో సహా మొత్తం 36 మంది జాతీయ నాయకులకు అన్యాయం జరిగిందని వారి జీవనగాధలను సంక్షిప్తంగా కూడా చేర్చలేదని కూడా విమర్శించారు. క్రికెట్ గురించి చెప్పడానికి, బట్టల తయారీ విజ్ఞానానికి 37 పేజీలు కేటాయించి, జాతీయ యువ జనులకు స్ఫూర్తి అయిన వివేకానందుని గురించి కేవలం 26 పదాలు ఇవ్వడం అన్యాయం అనీ, అరబిందో ఘోష్‌కు సంబంధించి ఒక వాక్యం కూడా లేదని అన్నారు. భగత్ సింగ్ బికె దత్ గురించి ప్రస్తావించినా మిగిలిన వారికి ఆ భాగ్యం కూడా దక్కలేదని అన్నారు మన భారత చరిత్రకు చెందిన ఒక మౌలిక స్వరూపాన్ని ఇవ్వవలసిన బాధ్యత ఎన్‌సీఈ ఆర్‌టీకి ఉందని వాదించారు.  

2005 విధానం ప్రకారం, కష్టం గాకుండా నేర్చు కోవాలనే సూత్రం ఆధారంగా సామాజిక శాస్త్రాల సిలబస్‌ను సిలబస్ రివిజన్ కమిటీ మార్చిందని, పాఠ్యపుస్తక రచనా సంఘాలలో ఆయా అంశాలలో నిపుణులు ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులు విద్యా ర్థులు చిన్న చిన్న బృందాలలో కూర్చుని చర్చించుకు నేంత సులువుగా పాఠాలు రూపొందిస్తున్నారని ఎన్ సీఈఆర్‌టీ జవాబు ఇచ్చింది.  విద్యార్థులకు సులువైన రీతిలో అందుబాటులోకి ఈ విషయాలను తేవాలనే ఉద్దేశంతో కమిటీలు పాఠాలను నిర్ణయిస్తున్నాయని ఎన్‌సీఈఆర్‌టీ పక్షాన ప్రొఫెసర్ నీరజా రశ్మి వివరిం చారు.

అయినా అభ్యర్థి అడిగినది సమాచార హక్కు చట్టం కింద సమాచారం కిందకురాదని, అది వారి అభిప్రాయం మాత్రమే అని, దానికి ఇవ్వగలిగిన సమాచారమేదీ లేదని సమాధానం చెప్పారు.  అయినా ఈ సూచనలను సంబంధిత కమిటీల ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు. సూర్య ప్రతాప్ గారి పత్రాన్ని ఫిర్యాదుల కమిటీకి కూడా పంపామని, వారి జవాబు వెబ్‌సైట్‌లో ఉందని ఆ విష యం కూడా చెప్పామని వివరించారు. వారి ఫిర్యా దును సానుకూలంగా పరిష్కరించామని అన్నారు.

సూర్యప్రతాప్ సమాచార అభ్యర్థనలో ఫిర్యాదు ఉందని, దాన్ని ఫిర్యాదుగా భావించి పరిష్కారం ఏమిటో స్పష్టంగా చెప్పకుండా మీరడిగింది సమాచా రమే కాదనడం న్యాయం కాదని కమిషన్ పేర్కొంది. కనీసం ఈ అంశంపైన పరిశీలన జరిగిందా, ఏదైనా చర్య తీసుకున్నారా లేదా తెలియజేయాలని సీఐసీ ఆదేశించింది.  పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఎన్‌సీ ఈఆర్‌టీ తన విధానాన్ని స్వయంగా ప్రకటించ వలసిన బాధ్యత సెక్షన్ 4(1)(సి) కింద ఉందని, తమ నిర్ణయాల ద్వారా బాధితులైన వారికి కారణాలు తెలిపే బాధ్యత సెక్షన్ 4(1)(డి) కింద నిర్దేశించారు.                                                                                                                                                                                                                                (Suryapratap Singh Rajawat Vs. NCERT, New Delhi, ఇఐఇ/ఇఇ/అ/2014/000207 అ కేసులో 22.1.2016 నాటి తీర్పు ఆధారంగా)

 మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్,
 professorsridhar@gmail.com

మరిన్ని వార్తలు