నీటి జగడాలకు నీళ్లొదలాలి!

23 Sep, 2016 01:31 IST|Sakshi
నీటి జగడాలకు నీళ్లొదలాలి!

సమకాలీనం
తాగు-సాగునీటి వినియోగం, విద్యుదుత్పత్తి... తదితరావసరాలకిచ్చే ప్రాధాన్యతల విష యంలో రాజకీయ నిర్ణయాలు తరచూ విమర్శలకు, వివాదాలకు కారణమవుతున్నాయి. ఇవి రాష్ట్రాల మధ్యే కాకుండా, ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్యా వివాదాలకు దారి తీస్తున్నాయి. వీటన్నటి దృష్ట్యా... రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నదీలోయ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలనే సూచన వస్తోంది. కాలానుగుణంగా మారడమే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమవుతుంది.
 
మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే భూగ్రహం మీద మూడింట రెండొం తులుగా ఉన్న నీరే  కారణమవుతుందని లోగడ ఎవరో మేధావి చెప్పిన మాటలు తరచూ ప్రస్తావనకు వస్తుంటాయి. వ్యక్తుల మధ్య, జన సమూహాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య... ఇలా వివిధ స్థాయిల్లో నీటి పోరాటాలే కాకుండా ఇతరేతరంగా నీటి ఉపద్రవాలూ కారణం కావచ్చేమోనని ఇటీవలి పరిణామాల్ని బట్టి భావించాల్సి వ స్తోంది. కాలుష్యం వల్ల భూతాపోన్నతి పెరిగి ధృవాల్లో కరుగుతున్న మంచు నీరై జనావాసాల్ని ముంచేసే ప్రమా దమైనా కావచ్చు! వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో వరదలు ముంచెత్తో, కరువులు కాటేసో రాష్ట్రాలు, దేశాల ఆర్థిక-రాజకీయ అస్థిరతతో కావచ్చు! నీటి ఉపద్రవాలు, ప్రపంచ యుద్ధం సంగతలా ఉంచినా.... మన దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య తరచూ వివా దాలకు నదీజలాలే కారణమవుతున్నాయి.

అంతర్రాష్ట్ర నదీజలాల పంపకం, వాడకం, ప్రాజెక్టుల నిర్మాణాలు, వాటిల్లో నీటిని నిలుపుకోవడం, వదలడం.... వంటివి ఎడతెగని వివాదాల్ని పుట్టిస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల నడుమా ఇదొక కార్చిచ్చులా రగులుతోంది. రెండు జీవ నదుల్లో గోదావరి కన్నా కృష్ణా విషయంలో ఈ వివాదం జటిలంగా ఉంది. రెండు రాష్ట్రాల పరస్పర విరుద్ధ భావనలు-వాదనలతో ముదురుతున్న ఈ వివాదం మున్ముందు మరే విపత్తుకు దారితీస్తుందోనన్న సందేహలు కలుగు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సత్వరం చొరవ తీసుకొని శాశ్వత పరిష్కారాల్ని యోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా దీన్ని రాజ కీయాంశంగా మారనీయకుండా చూడాలి. రాజకీయ పక్షాలు, నాయకులు తమ అవసరాలకు వాడుకొని, జీవనాధారపు నీటితో ముడివడ్డ ప్రజల మనోభావాల్ని రెచ్చగొడితే, సరిదిద్ద వీలుకాని నష్టాల్ని రెండు రాష్ట్రాల ప్రజలు చవిచూడాల్సి వస్తుంది.

నిన్నటికి నిన్న కావేరీ జల వివాదం వల్ల తమిళులు-కన్నడిగుల మధ్య రగిలిన ద్వేషాగ్నుల వేడి బెంగళూరు, చెన్నై నగరాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. ముఖ్యంగా బెంగళూరులో చెలరేగిన హింస నగరం బ్రాండ్ ఇమేజ్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. బలంగా వేళ్లూనుకున్న ఐ.టి. పరిశ్రమ తొలసారి కంగుతిన్నది. జరిగిన ప్రాణహానితో పాటు ఆర్థిక నష్టం ఒక్క బెంగళూరులోనే పాతికవేల కోట్ల రూపాయలని ‘అసోచామ్’ పేర్కొంది. సమాఖ్య రాజ్యమైనా నిర్దిష్ట జాతీయ జలవిధానం లేకపోవడం, ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పుల్లో జాప్యాలు, వాటి అమలులో లోపాలు, పాలకపక్షాల ఓటు రాజకీయాలు.. వెరసి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. రాష్ట్రాలకు, రాజకీయాలకు, పాలకపక్షాల ఇష్టాయి ష్టాలకతీతంగా పనిచేసే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నదీలోయ ప్రాధికార సంస్థల్ని ఏర్పాటు చేయాలన్న వాదన తెరపైకి వస్తోంది.
 
నిన్నొకపోరు-నేడింకొకటి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలకోసం ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో తగాదా పడేది. నీటి కేటాయింపుల నుంచి ప్రాజెక్టుల నిర్వ హణ-నీటి విడుదల వరకు అన్నీ పంచాయితీలే! విభజన తర్వాత ఆ పంచాయితీ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ముదురుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చైర్ పర్సన్‌గా ఢిల్లీలో బుధవారం జరిగిన ఉన్నత మండలి (అపెక్స్ కౌన్సిల్) సమావేశంలో ఇద్దరు సీఎంలు చంద్రశేఖరరావు, చంద్రబాబునాయుడులు తమ మంత్రులు, ఉన్నతాధికారులతో పాల్గొన్నారు. ఇందులో అంగీకారం కుదిరినవి మూడంశాలు కాగా, ఏదీ ముడివడని వివాదాంశాలే ఎక్కువ!  కేటాయించిన నికర జలాల ఆధారంగా కాకుండా మిగులు జలాల్ని ఆధారం చేసుకొని ప్రాజెక్టులు కడుతున్నారని, వాటికి అనుమతుల్లేవని, చట్ట విరు ద్ధమనే వాదనతో రెండు రాష్ట్రాలు, ప్రత్యర్థి రాష్ట్రంపై విమర్శలు చేస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అనుమతులు లేనివని ఏపీ అంటే, అలా అయితే అక్కడి గాలేరు-నగరి, హంద్రీ-నీవా, పట్టిసీమ అటువంటివే అని తెలంగాణ తిప్పికొడుతోంది.

గోదావరి కన్నా కృష్ణానదితోనే ఎక్కువ సమస్య. ఎందుకంటే, ఈ నదిలో నీళ్లు, ఆధారపడదగ్గ పరిస్థితి తక్కువ, నీటి అవసరాలు ఎక్కువ! ఈ నది ఎక్కువగా మైదాన ప్రాంతాల్లో ప్రవహిస్తోంది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఎక్కువ భాగం వెనుకబడిన ప్రాంతమే! వర్షపాతం ఎక్కువగా లేని ప్రాంతాల గుండా ఈ నది ప్రవహిస్తోంది. కానీ, గోదావరి అలా కాకుండా అడవుల గుండా, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల గుండా ప్రవహిస్తున్నది. నీటి లభ్యత కూడా అధికం. ఈ కొట్లాటలు లేకుండా ఉండాలంటే నీటి పంపకాలకు ఓ సహేతుకమైన ప్రాతిపదిక ఉండాలి. ఎవరికి అందుబాటులో ఉండే నీటిని వారు వాడుకొని, ప్రాజెక్టులు కట్టుకొని, మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం కనుక మాకు నీళ్లు ఇవ్వాల్సిందేనని ఆ తర్వాత ట్రిబ్యునల్స్ దగ్గర వాదించడమూ జరుగుతోంది. నిజానికి ప్రజల అవసరాలే ప్రాతిపదిక కావాలి. ఆయా ప్రాంతాల్లో పండే పంటలేంటి? వాటికి ఎంత నీరవసరం? దానికి తోడు... ఆ ప్రాంతాల్లో ఇతర నీటి వనరు లేంటి? భూగర్భజలాల పరిస్థితేంటి? ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటాల పంపకం చేస్తే బాగుంటుందన్నది నిపుణుల అభిప్రాయం.
 
తీర్పులే జాప్యమంటే, అమలు అంతంతే!
 అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యల్ని పరిష్కరించేందుకు ఏర్పాటవుతున్న ట్రిబ్యునల్ తీర్పుల్లో విపరీత జాప్యం జరుగుతోంది. దానికి తోడు, ఎంతో ఆలస్యంగా వెలువడిన తీర్పుల అమలు, పర్యవేక్షణ కూడా సవ్యంగా లేకపో వడం వివాదాలకు, తదనంతర సమస్యలకు కారణమవుతోంది. దాంతో ట్రిబ్యునల్స్ వల్ల ప్రభావం లేకుండా పోతోంది. ఫలితంగా మళ్లీ సుప్రీం తలుపులు తట్టాల్సి వస్తోంది. ఈ వివాదాల లోతైన పరిశీలనకు సుప్రీంకోర్టు సమయం వెచ్చించలేని కారణంగానే, ‘అంతర్రాష్ట్ర జలవివాదాల (పరిష్కార) చట్టం-1956’ ఆధారంగా ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయి. కావేరి తీసు కుంటే, 1990లో ట్రిబ్యునల్ ఏర్పడగా పదిహేడేళ్లకు 2007లో తీర్పు వచ్చింది. 2013లో గజెట్ వెలువడింది. అయినా, కేటాయింపులు-వినియోగం ఓ కొలిక్కి రాలేదు. సుప్రీంకోర్టు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. 1969లో ఏర్పడ్డ కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ 2013లో తీర్పు చెప్పింది. కర్ణాటక-గోవా మధ్య మాండవి నదీ జలాల వివాదాలకు సంబంధించి పది హేనేళ్ల సంప్రదింపులు విఫలమైన మీదట 2010లో ట్రిబ్యునల్ ఏర్పాటయినా ఇప్పటికీ నిర్ణయం వెల్లడించలేదు.

తమిళనాడు-కేరళ మధ్య కూడా వివాదాలున్నాయి. కృష్ణా నీటి పంపకాలు తాజాగా నాలుగు రాష్ట్రాల మధ్య జరగా లని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద ఉంది. కేటాయించిన నీటి నిలువ-వాడకం, మిగులు జలా లపై హక్కులు, వాతావరణ మార్పులు, జనాభా వృద్ధి, నగరీకరణలు వంటి సంక్లిష్టతల్లో తలెత్తే సరికొత్త వివాదాల్ని ఈ ట్రిబ్యునల్స్ సరిగా పరిష్కరించ లేకపోతున్నాయనేది విమర్శ. ట్రిబ్యునళ్ల ప్రస్తుత కూర్పు ప్రకారం సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గాను, ఇద్దరు హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు సభ్యులుగానూ ఉంటున్నారు. సాగునీటి, పర్యావరణ నిపుణుల సహకారం తీసుకోవాల్సి రావడం వల్ల అంతిమ తీర్పులకు కనీసం 10-15 సంవత్సరాలు జాప్యమ వుతోందన్నది పరిశీలన. అలా కాకుండా ఆయా రంగ నిపుణుల్నే ట్రిబ్యునల్ సభ్యులుగా ఉంచాలనేది ఓ ప్రతిపాదన. అంశాలు, వివాదాల వారిగా ఒక్కో నదికి అని కాకుండా అంతర్రాష్ట్ర నదీవివాదాల పరిష్కారానికి ఒక శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది.
 
అనుసంధానంపై అనుమానాలు!
 దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నదుల్ని అనుసంధానపరచడం ద్వారా గరి ష్టంగా లబ్ధి పొందవచ్చన్నది ఒక ఆలోచన. ఉత్తరాదిలో బిహార్, అసోం, ఒడిశాల్లో వరదలు ముంచెత్తుతుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కరవు-కాటకాలు ప్రజల్ని పీడించడం దృష్ట్యా ఈ ఆలోచన చేశారు. బ్రహ్మపుత్ర, గంగ వంటి నదుల్ని దక్షిణాది నదులతో గ్రిడ్ ద్వారా అనుసంధానించి మధ్య, దక్షిణ భారతాన్ని సస్యశ్యామలం చేయాలన్నది ఈ తలంపు. దీనిపై సమగ్ర నివేదిక (డీపీఆర్)కు గాను 2014-15 బడ్జెట్‌లో వందకోట్ల రూపాయలు కేటాయిం చారు. ‘జాతీయ నదుల అనుసంధాన కార్యక్రమం’ద్వారా మొత్తం 37 నదు లకు తాజాగా 30 లింకులు ఏర్పాటు చేసి, 3వేల నీటి నిల్వ డ్యాముల నిర్మాణంతో 3.5 కోట్ల హెక్టార్లని కొత్తగా సాగులోకి తేవాలన్నది లక్ష్యం. సూచాయగా ఇందుకయ్యే వ్యయం రూ. 5.6 లక్షల కోట్లన్నది 2002 నాటి అంచనా కాగా, ఇప్పుడది పది లక్షల కోట్ల రూపాయల వరకుంటుందని భావిస్తున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ప్రకృతి సహజ నైసర్గిక స్థితికి వ్యతిరేకమని, పర్యావరణ, జీవవైవిధ్య పరమైన ప్రతికూల పరిస్థి తులుంటాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనితో స్వచ్ఛమైన నదులూ కలుషితమయ్యే ప్రమాదమూ ఉందంటున్నారు. కృత్రిమ నీటి నిల్వ డ్యాముల వల్ల నిర్వాసితులయ్యేవారికి పునరావాస, పునఃస్థిరీకరణ వంటివి సమస్యగా పరిణమిస్తాయంటున్నారు. ఇంత కన్నా, వికేంద్రీకరణ పద్ధతుల్లోనే వాటర్‌షెడ్, వాననీటి సంరక్షణ, భూగర్భ జలవృద్ధి, శాస్త్రీయ-హేతుబద్ధ పంటల విధానం వంటి సంప్రదాయ పద్ధతులే అనుసరణీయం అనే వాదనా ఉంది. పెద్ద ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్న ఆలోచనాసరళి నుంచి ‘పెద్ద ప్రాజెక్టులు పెను విపత్తుల’నే దిశలో ఇప్పుడు యోచిస్తున్నారు.
 
స్వతంత్ర సంస్థలే శరణ్యం
 తాగు-సాగునీటి వినియోగం, విద్యుదుత్పత్తి... తదితరావసరాలకిచ్చే ప్రాధా న్యతల విషయంలో రాజకీయ నిర్ణయాలు తరచూ విమర్శలకు, వివాదాలకు కారణమవుతున్నాయి. ఇవి రాష్ట్రాల మధ్యే కాకుండా, ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్యా వివాదాలకు దారి తీస్తున్నాయి. వీటన్నటి దృష్ట్యా... రాజ కీయాలకు అతీతంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నదీలోయ ప్రాధికార సంస్థ (రివర్ వ్యాలీ అథారిటీ)లను ఏర్పాటు చేయాలనే సూచన వస్తోంది. 2010లో రాజకీయ కారణాల వల్ల సకాలంలో నిర్ణయం తీసుకోనందునే శ్రీశైలం ప్రాజెక్టు నిలువ నీటితో కర్నూలు, మహబూబ్‌నగర్ మునిగిపోయి అంతటి ఉపద్రవం ఎదుర్కోవాల్సి వచ్చిందనే వాదనుంది. నిర్ణయ జాప్యం వల్లే శ్రీశైలంలోకి వచ్చే ఇన్‌ఫ్లో, ప్రాజెక్టు అన్ని గేట్లు తెరిచి నీటిని వదిలినా సాధ్య మయ్యే ఔట్‌ఫ్లో కన్నా అధికంగా ఉండటమే సదరు ప్రమాదానికి కారణమని రుజువైంది.

ఒక ప్రాధికార సంస్థ ఉండి ఉంటే, ఆ తప్పిదం జరిగి ఉండేది కాదనేది నిపుణుల అభిప్రాయం. నది పుట్టిన చోటు నుంచి సముద్రంలో కలిసే వరకు ఎక్కడ, ఎప్పుడు, ఏ విధమైన అవసరాలుంటే పరిస్థితుల్ని బట్టి సదరు సంస్థ తగిన నిర్ణయం తీసుకోగలుగుతుందని వారంటారు. ఇక, రాష్ట్రాల్లోని రాజకీయ అవసరాలు అడ్డంకి కావు. టెన్నెసీ రివర్ వ్యాలీ అథారిటీ (యుఎస్), లింపో పో ఆర్‌వీఏ (దక్షిణాఫ్రికా), ముర్రే డార్లింగ్ ఆర్‌వీఏ (ఆస్ట్రే లియా)లు విజయవంతంగా పనిచేయడం ఈ రంగంలో ఓ గొప్ప అనుభవం. కాలానుగుణంగా మారడమే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమవుతుంది.
 

దిలీప్ రెడ్డి
 ఈమెయిల్ : dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు