యాప్ డెవలపర్లకు ఫేస్‌బుక్ తోడ్పాటు | Sakshi
Sakshi News home page

యాప్ డెవలపర్లకు ఫేస్‌బుక్ తోడ్పాటు

Published Fri, Sep 23 2016 6:50 AM

యాప్ డెవలపర్లకు ఫేస్‌బుక్ తోడ్పాటు - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ యాప్ డెవలపర్లకు తోడ్పాటు అందించే దిశగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎఫ్‌బీస్టార్ట్ ప్లాట్‌ఫాంకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటిదాకా 137 దేశాలకు చెందిన 9,000 మంది పైచిలుకు డెవలపర్లు ఉపయోగించుకున్నట్లు ఫేస్‌బుక్ ఇండియా ప్రోడక్ట్ పార్ట్‌నర్‌షిప్స్ విభాగం అధిపతి సత్యజిత్ సింగ్ తెలిపారు. ఎఫ్‌బీస్టార్ట్ కింద కొత్తగా జోడించిన వాటితో కలిపి మొత్తం 25 సర్వీసులను అందిస్తున్నామన్నారు. వీటి విలువ సుమారు 80,000 డాలర్ల దాకా ఉంటుందని చెప్పారు.

ఎఫ్‌బీస్టార్ట్ ప్లాట్‌ఫాంను డెవలపర్లకు చేరువ చేసే దిశగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సింగ్ ఈ విషయాలు చెప్పారు. చండీగఢ్, ముంబై తదితర 8 నగరాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినూత్నమైన ఐడియాలను డెవలపర్లు మెరుగైన యాప్ కింద మల్చుకుని, తర్వాత దశల్లో స్టార్టప్‌లను కూడా ఏర్పాటు చేసుకుని ఎదిగేందుకు ఎఫ్‌బీస్టార్ట్‌లోని సర్వీసులు ఉపయోగపడగలవని సింగ్ వివరించారు. హెల్త్ స్టార్టప్ మైచైల్డ్, క్యాష్‌బాక్ సంస్థ లాఫలాఫా మొదలైనవి వీటిని ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement