మున్సిపల్‌ అభ్యర్థులు @ 19,673!

15 Jan, 2020 02:52 IST|Sakshi

నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో మిగిలింది వారే

కానీ అభ్యర్థుల సంఖ్యను ఇంకా అధికారికంగా వెల్లడించని ఎస్‌ఈసీ

అధికార టీఆర్‌ఎస్‌కు తప్పని రెబెల్స్‌ బెడద.. పలుచోట్ల బరిలో మిగిలిన వైనం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, 9 కార్పొరేషన్ల పరిధిలోని 325 డివిజన్లకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మంగళవారం రాత్రికల్లా రాజకీయ పార్టీలవారీగా బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ప్రకటించాల్సి ఉండగా జిల్లాల నుంచి పూర్తి సమాచారం, వివరాలు అందపోవడంతో ఆ వివరాలను అధికారికంగా ప్రకటించలేకపోతున్నట్లు వెల్లడించింది. మొత్తం వార్డులు, డివిజన్లు కలిపి 3,052 స్థానాలకు 25,768 నామినేషన్లు రాగా వాటిలో 432 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని, 25,336 నామినేషన్లు చెల్లుబాటయ్యాయని ఎస్‌ఈసీ వర్గాల సమాచారం.

అయితే చెల్లుబాటయ్యే నామినేషన్లలో అభ్యర్థులు ఒకటికి మించి నామినేషన్లు వేయడం, అధికంగా సమర్పించిన నామినేషన్ల ఉపసంహరణ, ఇతరత్రా కలుపుకుంటే వాటి సంఖ్య గణనీయంగా తగ్గవచ్చునని తెలుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలతోపాటు గుర్తింపు పొందిన పార్టీలు, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలుపుకుని మొత్తం 19,673 మంది బరిలో మిగులుతారని ఎస్‌ఈసీ వర్గాల సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. ఎస్‌ఈసీ అధికారికంగా వెల్లడించే సమాచారానికి అనుగుణంగానే వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది. రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులకు అధికారికంగా బీ–ఫారాలు అందజేసే గడువు కూడా మంగళవారంతో ముగిసింది.

కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అధికార పార్టీకి రెబెల్స్‌ బెడద తప్పకపోవడంతో పలుచోట్ల టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ పోటీలో మిగిలారు. మరోవైపు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి అత్యధికంగా 8,956 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తరువాత స్థానాల్లో కాంగ్రెస్‌ (5,356 మంది), బీజేపీ (4,176 మంది) నిలిచినట్లు జిల్లాల నుంచి అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. ఈ నెల 22న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా 25న ఫలితాలు ప్రకటిస్తారు. 16న (గురువారం) కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 60 డివిజన్లకు నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌కు 24న ఎన్నికలు నిర్వహించి 27న ఫలితాలు వెల్లడిస్తారు.

3,112 వార్డులకు 8,111 పోలింగ్‌ స్టేషన్లు... 
ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల (కరీంనగర్‌ సహా) పరిధిలోని 3,112 వార్డులకు జరగనున్న ఎన్నికల కోసం 8,111 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్య ఖరారైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) తెలిపింది. 120 మున్సిపాలిటీల్లో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 240, ఆదిలాబాద్‌లో 183, నల్లగొండలో 180, సూర్యాపేటలో 146, మిర్యాలగూడలో 144, డోర్నకల్, వర్ధన్నపేట, ధర్మపురిలలో 15 చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక 10 కార్పొరేషన్ల విషయానికొస్తే నిజామాబాద్‌లో అత్యధికంగా 411, అత్యల్పంగా బండ్లగూడ జాగీర్‌లో 85 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. కరీంనగర్‌లో 348, రామగుండంలో 242 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు