ఆప్‌తో హస్తం పొత్తు?

17 Mar, 2019 03:51 IST|Sakshi

కాంగ్రెస్‌పై అంతర్గత సర్వే ప్రభావం

త్వరలో రాహుల్‌ సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న వర్గాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌)తో పొత్తుపై ఇప్పటి వరకు సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్‌.. అంతర్గత సర్వే ఫలితాల తీరుతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ సీనియర్‌ నేతలు మెత్తబడినట్లు సమాచారం. ఆప్‌తో జట్టుకట్టే విషయమై ఎటూ తేల్చుకోలేని కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల శక్తి యాప్‌ ద్వారా కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఇందులో రాజధాని ఢిల్లీలో బీజేపీకి 35% ఓట్లు, ఆప్‌కు 28%, కాంగ్రెస్‌కు 22% ఓట్లు పడతాయని వెల్లడైంది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ఢిల్లీ నేతలు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు ఢిల్లీ పార్టీ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌కు అందజేశారు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు పెట్టుకుంటే మొత్తం 7 ఎంపీ సీట్లనూ కైవసం చేసుకునే చాన్సుందని వివరించారు.

పొత్తు విషయంలో షీలా తన వ్యతిరేక వైఖరిని మార్చుకోనప్పటికీ, కాస్త వెనక్కి తగ్గారని పార్టీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్‌ ఢిల్లీ విభాగం నేతలు కూడా ఆప్‌తో పొత్తుపై సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో సీనియర్‌ నేతలు అహ్మద్‌ పటేల్, గులాంనబీ ఆజాద్‌ రంగంలోకి దిగి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో సంప్రదింపులు ప్రారంభించారు. ఢిల్లీతోపాటు హరియాణాలోనూ ఆప్‌తో పొత్తు కుదిరేందుకు అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతిమంగా, రాహుల్‌ సానుకూల నిర్ణయం మరికొద్ది రోజుల్లోనే తీసుకుంటారని భావిస్తున్నారు. అనంతరం సీట్ల పంపిణీకి సంబంధించి రెండు పార్టీల నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు మే 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు