ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవం : మోహన్‌బాబు

1 Apr, 2019 11:36 IST|Sakshi

సాక్షి, మంగళగిరి : వైస్రాయ్‌ హోటల్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను చూశానని సినీనటుడు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు మంచు మోహన్‌బాబు స్పష్టం చేశారు. ‘నేను చేసిన తప్పెంటో చెప్పండి బ్రదర్‌.. తప్పు సరిద్దిదుకుంటాను’ అని వేడుకున్న అన్నగారిపై చంద్రబాబు చెప్పులు వేయించారని మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డితో కలిసి మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకు పోయిందని ధ్వజమెత్తారు. 

ఇది అన్నయ్య టీడీపీ కాదు.. 
‘ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్య(ఎన్టీఆర్‌)ది కాదు.. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ. అన్నయ్యేదే అయితే నేను పార్టీ వీడేవాడినే కాదు. ఆ మహానేత పార్టీనే ఆక్రమించి ఆయన సభ్యత్వాన్నే తీసేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. హరికృష్ణ, తారక్‌, సుహాసినిలను వాడుకుని వదిలేశారు. ఎవరైనా బాగుంటే చాలు.. వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలరు. ఆ సమయంలో అన్నయ్య చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీలు విడుదల చేశారు. చంద్రబాబు పాపిష్టి, నికృష్టుడు, మోసకారని ఆ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌ మహోన్నత వ్యక్తి..
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మహోన్నత వ్యక్తి. ఆయన మాట చెబితే అది వేదమే. ఆయన పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. కొన్నివేల మంది ప్రజలకు ఇళ్లు కట్టించారు. కాంగ్రెస్‌ వంటి మహాసముద్రంలో ఓ మహానాయకుడిగా ఎదిగి.. పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకొని అద్భుత పథకాలు రూపొందించారు. ఎంతోమంది పేద పిల్లలు ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత చదువులు చదివేలా చేశారు. ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించారు. తాను పార్టీకి బానిసను కాదని, ప్రజలకు బానిసని సోనియాను వ్యతిరేకించారు. ఆ తర్వాతే వైఎస్సార్‌ మరణం చెందారు. దాని వెనుక అనేక అనుమానులున్నాయి. వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఆయను ఆదరించి ముఖ్యమంత్రిని చేసుకుందా. మూడు పంటలు పండే చోట రాజధాని పేరుతో భూములు లాక్కున్నారు. తన బినామీలతో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ముందుగానే కొనుగోలు చేయించారు.

రైతులను దారుణంగా మోసం చేశారు. అప్పులు పాలు చేశారు. చంద్రబాబుపై ఉన్న 11 కేసులు ప్రజలకు తెలియకుండా దాచారు. నీ దగ్గరున్న ఎంపీలు అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయారు.  నీవెలా సత్య హరిశ్చంద్రుడివి అవుతావు చంద్రబాబు? వేల కోట్లు ఆస్తులు నీకెక్కడి నుంచి వచ్చాయి? బాబుకు ఓటేస్తే ఆయన అనుకూల మీడియా, భూకబ్జాదారులు బాగుపడుతారు. వాళ్లు మళ్లి ప్రజల రక్తం తాగుతారు. పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్న డబ్బులు నీవా చంద్రబాబు? నాలుగేళ్లుగా పసుపు కుంకుమ గుర్తుకు రాలేదా? 135 సీట్లతో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంగళగిరిలో మీ అందుబాటులో ఉండే రామకృష్ణారెడ్డిని, గుంటూరు ఎంపీగా మోదుగు వేణుగోపాల్‌రెడ్డిలను గెలిపించండి. చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల ఏం లాభం లేదు.’ అని మోహన్‌బాబు ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు