భరత్‌ను వెంటాడుతున్న గతం

1 Apr, 2019 11:33 IST|Sakshi

ఎంపీగా, పార్టీ నేతగా విశాఖకు, పార్టీ

నేతలకూ మూర్తి ఏమీ చేయలేదని అపఖ్యాతి

భూ ఆక్రమణల పునాదులపై ఎదిగిన గీతం వర్సిటీ

42 ఎకరాల భూములు హస్తగతం

వాటిని పూర్తిగా సొంతం చేసుకునేందుకు విఫలయత్నం

ఇప్పటికీ వివాదాస్పద భూములు గీతం గుప్పిట్లోనే..

తాత వారసత్వంతోపాటు మనవడికి సంక్రమించిన వివాదాలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎంవీవీఎస్‌ మూర్తి.. మొదట్లో గోల్డ్‌స్పాట్‌ మూర్తిగా విశాఖకు పరిచయమైన ఈయన గీతం ప్రైవేటు కళాశాలను పెట్టి.. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తూట్లు పొడిచి..  గీతంను డీమ్డ్‌ వర్శిటీగా విస్తరించి.. చివరికి దేశంలోనే ప్రతిష్టాత్మక ఏయూను దెయ్యాల కొంపగా అభివర్ణించిన పెద్ద మనిషి..  సరే పోయినోళ్లందరూ మంచోళ్లే కాబట్టే.. ఆయన ప్రస్తావన వదిలేద్దామనుకున్నా.. ఆయన చేసిన తప్పులు, అక్రమాలు మాత్రం ఆయన మనుమడు, టీడీపీ ఎంపీ అభ్యర్ధి, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్‌ను వీడటం లేదు.  రెండుసార్లు విశాఖ ఎంపీగా పని చేసిన మూర్తి, ఆ పదేళ్ల కాలంలో కేవలం సొంత గీతం కళాశాలకు, రక్తసంబంధీకులైన బంధుగణానికి తప్పించి విశాఖ నగరానికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చాను..  అని చెప్పుకొనే స్థాయిలో ఒక్క పనికూడా చేయలేదంటే నమ్మశక్యం కాకున్నా.. పచ్చి నిజం. పైగా తెలుగుదేశం పాలనలో గీతం సంస్థ పేరిట చేసిన భూ ఆక్రమణలు, ఆ వివాదాలు ఇప్పటికీ కోర్టుల్లో నలుగుతున్నాయి. జిల్లాలో కలెక్టర్లుగా పనిచేసిన  ఎందరో ఐఏఎస్‌ అధికారులు.. గీతం ఫైళ్లు.. అనగానే అమ్మో...  మేం సంతకం పెట్టలేమంటూ ఇక్కడి నుంచి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ ఐదేళ్ల కాలంలోనే ఇక్కడ పనిచేసిన ఓ ఐఏఎస్‌ అధికారి గీతం ఆక్రమణల క్రమబద్ధీకరణకు సిఫార్సు చేయలేనని తెగేసి చెప్పి.. ఇక్కడి నుంచి కేంద్ర సర్వీసుకు బదిలీ చేయించుకుని వెళ్లిన విషయం ఐఏఎస్‌ వర్గాలకే కాదు.. అధికారవర్గాలందరికీ తెలిసిన సత్యం.

ఇప్పటికీ గీతం ఆక్రమణలోప్రభుత్వ భూములువాటి విలువరూ.500 కోట్లకుపైమాటే
‘ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు కోర్సులున్న శ్రీలంక యూనివర్సిటీ 25 ఎకరాల్లోనే ఉంది. కానీ విశాఖలోని గీతం(గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌) యూనివర్సిటీకి వందల ఎకరాలు కావాలా? అని రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన విద్యాసంస్థల్లో ఒకటైన గీతం యూనివర్సిటీకి నిజంగానే ఘన చరిత్ర ఉంది. తొలుత పాతిక ఎకరాల్లో ఏర్పాటైన ఈ విద్యాసంస్థ క్రమక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటూ 110 ఎకరాల విస్తీర్ణంలో డీమ్డ్‌ వర్సిటీ స్థాయికి చేరింది. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం.. ఆనక  ఎలియనేషన్‌ చేయించుకుని వాటిని సొంతం చేసుకోవడం అప్పట్లో  గీతం మూర్తికే చెల్లింది. నేటికీ ఈ సంస్థ అధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల వ్యవహారంపై కోర్టుల్లో వివాదం నడుస్తోంది. సంస్థ అధీనంలో ఉన్న 35 ఎకరాల భూములను లీగల్‌గా కైవసం చేసుకునేందుకు అప్పటి కలెక్టర్‌ ఆరోఖ్యరాజ్‌  ద్వారా 2012 మే 28న ఎలియనేషన్‌ ప్రతిపాదనలు పంపించారు.

అయితే ఈ ప్రతిపాదనను రెండేళ్ల పాటు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెండింగులో పెట్టింది. అప్పట్లో సీసీఎల్‌ఎ కార్యదర్శిగా ఉన్న ఐవైఆర్‌ కృష్ణారావు ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో ఉన్న ఈ భూములను వివిధ అవసరాల నిమిత్తం ఆరు ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న ఐవైఆర్‌ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దళిత విద్యార్థుల కళాశాల, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్స్‌ నిర్మాణం, బలహీనవర్గాల గృహనిర్మాణం, అధికారులకు క్వార్టర్లు, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రం.. ఇలా వివిధ ప్రభుత్వ అవసరాలకు ఈ భూములు కేటాయించారు. అయినా గీతం మూర్తి వాటిని వదల్లేదు. అప్పటికే తమ అధీనంలో ఉన్న మరో 7.52 ఎకరాలను కూడా కలిపి మొత్తం భూములను తమ సంస్థకు కేటాయించాలని, ఈ మేరకు సిఫార్సు చేయాలని 2016లో జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌పై ఒత్తిడి తెచ్చారు. యువరాజ్‌ బదిలీ అయిన తర్వాత గత కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు రావడమే తరువాయి.. వివిధ శాఖలకు కేటాయిస్తూ గత సీఎస్‌ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి మరీ ఆ భూములను గీతం కట్టబెట్టేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఇక్కడ గజం రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పలుకుతుంది. ఈ లెక్కన ఎలియనేషన్‌ ప్రతిపాదనలు పంపిన 42.52 ఎకరాల భూముల విలువ అక్షరాల రూ.514 కోట్ల పైమాటే. కేబినెట్‌ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నప్పటికీ ఈ భూములు ఇప్పటికీ గీతం ఆధీనంలోనే ఉండటం గమనార్హం.

రాజకీయంగానూ..
 రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీలో గీతం మూర్తి వల్ల లాభపడిన, ప్రయోజనం పొందిన నేతలు కాదు కదా.. కనీసం కార్యకర్తలు కూడా లేరు. కేవలం అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, ఆ తర్వాత బంధువు, ఉత్తరాంధ్రలో టీడీపీ మాదే అని భావించే ఓ సామాజిక ‘వర్గ’ పెద్దగా ఓ వెలుగు వెలిగిన గీతం మూర్తి చేసిన సంస్థాగత తప్పులు ఇప్పుడు ఆయన మనుమడిని వెంటాడుతున్నాయనే చెప్పాలి. పార్టీ నాయకులకు కూడా మినహాయింపులేకుండా వారి పిల్లల సీట్లకు ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన ఘనత ఆయనదే. ఆయన వల్ల నష్టపోయిన నేతలు ఇప్పుడు తెరవెనుక పావులు కదుపుతున్నారు. అవన్నీ భరత్‌కు మైనస్‌గా మారుతున్నాయి.

కొసమెరుపు
ఈ తప్పులు, వ్యవహారాలు, దందాలేవీ భరత్‌కు తెలియకపోవచ్చు. వాటితో తనకు సంబంధం లేదని ఆయన చెప్పుకోవచ్చు కూడా.. కానీ తాత వ్యాపార సామ్రాజ్యాన్ని, రాజకీయాన్ని వారసత్వం పొందిన మనవడు భరత్‌.. తాతా చేసిన తప్పులనుంచి మాత్రం ఎలా తప్పించుకోగలుగుతారు. ఆస్తులతోపాటు అపఖ్యాతిలోనూ వాటా తీసుకోవాల్సిందే.. ఏమంటారు?

మరిన్ని వార్తలు