రాహుల్‌ గాంధీపై పరువునష్టం దావా : చౌహన్‌

30 Oct, 2018 17:18 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే అధికార బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారాల జోరు పెంచాయి. ఈ క్రమంలో ఇరు పార్టీలు పరస్పరం విమర్శల దాడికి దిగాయి. సోమవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌పై పలు అవినీతి ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ పనామా పత్రాల కుంభకోణాన్ని ఉటంకిస్తూ ‘ఈ కుంభకోణంలో మామాజీ(శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహన్‌ నిక్‌ నేమ్‌), మామాజీ కుమారుడి పేరు ఉంది. అక్కడ చౌకీదార్‌(మోదీ).. ఇక్కడ మామాజీ ఇద్దరు దోచుకుంటున్నారం’టూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే రాహుల్‌ ఆరోపణలపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వ్యాపం నుంచి పనామా కుంభకోణం వరకు నాపై, నా కుటుంబంపై రాహుల్‌ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ విషయంపై నేను కోర్టుకు వెళతా. రాహుల్‌పై పరువునష్టం దావా వేస్తాన’ని చౌహన్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. రాహుల్‌ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

దాంతో చౌహన్‌పై చేసిన అవినీత ఆరోపణల గురించి రాహుల్‌ దిగొచ్చారు. కానీ మరోసారి బీజేపీపై విమర్శల వర్షం గుప్పించారు. ‘బీజేపీలో అవినీతి చాలా ఎక్కవ కదా అందుకే నేను పొరబడ్డాను. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కుటుంబంపై పనామా కుంభకోణం ఆరోపణలు లేవు. ఆయనపై కేవలం ఈ-టెండరింగ్‌, వ్యాపం కుంభకోణం లాంటి ఆరోపణలు మ్రాతమే ఉన్నాయంటూ’ అని రాహుల్‌ చురకలంటించారు.

మరిన్ని వార్తలు