ఛలో బెంగళూరు

12 Oct, 2017 06:03 IST|Sakshi

నేడు జైలుకు శశికళ పయనం

ముగిసిన ఐదురోజుల పెరోల్‌ గడువు

నిరాశగా తిరుగుముఖం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐదు రోజుల పాటు హాయిగా బంధువులతో గడిపిన అన్నాడీఎంకే నేత శశికళకు గురువారం బెంగళూరు జైలుకు పయనం అవుతున్నారు. బెంగళూరు జైలు అధికారులు మంజూరు చేసిన ఐదురోజుల పెరోల్‌ గడువు బుధవారంతో ముగియడంతో నిరాశ, నిస్పృహల నడుమ తిరుగుముఖం పడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ బెంగళూరు జైల్లో ఏడునెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు.

ఆమె భర్త నటరాజన్‌ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం చెన్నై గ్లోబల్‌ ఆస్పత్రిలోæ చికిత్స పొందుతుండగా, ఆయనకు ఇటీవలే అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. భర్తను పరామర్శించేందుకు 15 రోజుల పెరోల్‌కు ఆమె దరఖాస్తు చేసుకోగా ఈనెల 6వ తేదీన ఐదురోజుల పెరోల్‌ మంజూరైంది.  దీంతో అదేరోజు కారులో ఆమె చెన్నైకి చేరుకున్నారు. తన బంధువు, తోటి ఖైదీ ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంటిలో ఉంటూ భర్త ఉన్న ఆస్పత్రికి వెళ్లి వస్తున్నారు. చివరి రోజైన బుధవారం సైతం ఐదోసారి భర్తను చూసి వచ్చారు.

నేతలపై నిరాశ
జైలు గోడల మధ్యకు వెళ్లిన 233 రోజుల తరువాత పెరోల్‌ పుణ్యమాని బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన శశికళకు నిరాశే మిగిలింది. ఆప్తులు, బంధువుల నుంచి మంచి ఆదరణ లభించినా తాను పెంచి పోషించిన అన్నాడీఎంకే నేతల నుంచి కనీస పలకరింపు కొరవడిందనే బాధ ఆమె మెదడును తొలిచివేసింది. పెరోల్‌లో బస చేసిన ఇల్లు, భర్త ఉన్న ఆస్పత్రి మినహా మరెక్కడికీ వెళ్లరాదని, రాజకీయ జోక్యం అసలు పనికిరాదని వంటి కఠిన నిబంధనలు శశికళను కట్టిపడేశాయి. దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది బహిష్కృత ఎమ్మెల్యేలు సైతం ఆమెను కలవలేకపోయారు. అధికారంలో ఉన్న నేతలు పూర్తిగా ముఖం చాటేశారు. మంత్రులెవరూ శశికళను కలవలేదని మంత్రి జయకుమార్‌ బుధవారం ప్రకటించారు. గురువారం ఉదయం బెంగళూరుకు పయనం అవుతున్నారు. పెరోల్‌ నిబంధనల ప్రకారం గురువారం సాయంత్రం 5 గంట ల్లోగా శశికళ జైలుకు చేరాల్సి ఉంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా