రేపు మూడో జడ్జీ ముందుకు ఎమ్మెల్యేల అనర్హత!

3 Jul, 2018 19:50 IST|Sakshi

18మంది దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేల భవితవ్యం తేల్చనున్న మూడో జడ్జీ 

సాక్షి, చెన్నై : తమిళనాడులో దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు బుధవారం మరోసారి విచారణకు రానుంది. ఈ కేసులో ఇద్దరు జడ్జీలు పరస్పరం వేర్వేరు తీర్పులు వెలువరించడంతో మూడో జడ్జి ముందుకు కేసు బదిలీ అయిన సంగతి తెలిసిందే. మూడో జడ్జి సత్యనారాయణ బుధవారం ఈ కేసును విచారించనున్నారు. దినకరన్‌ గూటికి ఫిరాయించిన 18మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు చెల్లుతుందా? లేదా అనే దానిపై న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణ వెలువరించే తీర్పు కీలకం కానుంది. ఆయన తీర్పు ఆధారంగా తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారనున్నాయి.

గతంలో ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులను వెలువరించిన్న సంగతి తెలిసిందే. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో స్పష్టమైన తీర్పు వెలువరించకపోవడంతో ఈ కేసులో అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో ఈ కేసు విచారణను మూడో జడ్జికి బదలాయించారు. ఇక గతంలో తీర్పు ఇచ్చిన జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ.. దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని పేర్కొనగా.. స్పీకర్‌ నిర్ణయం చెల్లబోదని జస్టిస్‌ సెల్వం వేరుగా తీర్పునిచ్చారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది.

18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పళనిస్వామి ప్రభుత్వ మనుగడకు విషమ పరీక్షగా మారిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వచ్చినా పళనిస్వామి ప్రభుత్వానికి సంకటం తప్పదన వాదన వినిపించింది. గత సెప్టెంబర్‌లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్‌ రద్దుచేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే విప్‌కు వ్యతిరేకంగా శశికళ అక్క కొడుకైన దినకనర్‌కు మద్దతు తెలుపడంతో స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేశారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్‌  ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే, స్పీకర్‌ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు