అప్పుడెంత.. ఇప్పుడెంత

24 Jun, 2018 01:12 IST|Sakshi

మద్యం అమ్మకాలు నియంత్రించాలి 

రోజువారీ లెక్కలు సమర్పించాలి

పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే మద్యం అమ్మకాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ మేరకు మద్యం అమ్మకాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. సాధారణంగా పోలింగ్‌ సందర్భంగా 44 గంటల పాటు ఎలాంటి మద్యం అమ్మకాలు జరపకూడదు. ఓట్ల లెక్కింపు రోజున ఇదే నిబంధన అమలు చేస్తారు. అయితే పోలింగ్, ఓట్ల లెక్కింపు రోజుల్లోనే కాకుండా ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్న రోజుల్లోనూ మద్యం అమ్మకాల నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.

మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగే.. గ్రామాల్లో పోలింగ్‌ పరిస్థితులపై ప్రభావం చూపే బెల్ట్‌ షాపులను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. ‘రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్‌ షాపులు లేకుండా నియంత్రించాలి. నాటుసారా తయారీని పూర్తిగా నియంత్రించడంతోపాటు మద్యం, బీరు ఉత్పత్తి ప్రక్రియలను దగ్గరగా పరిశీలించాలి. మద్యం ఉత్పత్తి, నిల్వలు, అమ్మకాల్లో గతేడాదికీ, ప్రస్తుత ఏడాదికీ ఉన్న తేడాలను నిశితంగా గమనించాలి. మద్యం దుకాణాల వారీగా నిల్వలను పరిశీలించి తేడా ఉన్న వాటిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. వీడియో దృశ్యాలను చిత్రీకరించాలని, ఎక్సైజ్‌ శాఖ ఎల్లవేళలా అమ్మకాలను పర్యవేక్షించాలి. వైన్‌షాపులు, బార్లలో రోజువారీ అమ్మకాలపైనా పర్యవేక్షణ ఉండాలి.

ఎక్సైజ్‌ శాఖ అధికారులు తమ పరిధిలోని మద్యం అమ్మకాలపై ప్రతిరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్లకు నివేదికివ్వాలి. మద్యం దుకాణాలను తెరిచే, మూసే సమయాల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి. నల్లబెల్లం నిల్వలు, అమ్మకాల విషయంలోనూ ప్రత్యేక నిఘా పెట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అందే ఫిర్యాదులను స్వీకరించేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి’అని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు