బాబు, లోకేశ్‌.. సీఎం దగ్గరకు వెళ్దాం రండి: ఆర్కే

6 Feb, 2020 11:08 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అనడం సరికాదని హితవు పలికారు. సమస్యలు చెప్పుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజధాని రైతులు కలిశారని.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వం అని.. అడగకుండానే సీఎం జగన్‌ కౌలు పరిహారాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచారని పేర్కొన్నారు.  రైతు కూలీల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచారన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా.. పూలింగ్‌ పేరిట చంద్రబాబు బలవంతపు భూసేకరణ చేశారని.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం 8648 ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టు పట్టించారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు.(రాజధానితో చంద్రబాబు వ్యాపారం)

మీరు కూడా రండి.. సీఎం దగ్గరకు వెళ్దాం..
‘‘నేషనల్‌ హైవే దగ్గర జయభేరి వాళ్లు అపార్టుమెంట్లు కట్టారు. అక్కడికి సమీపంలోనే ఈస్ట్‌ ఫేస్‌తో రైతులకు సంబంధించిన భవనాలు కడుతుంటే.. వాటి కారణంగా జయభేరి అపార్టుమెంట్లు అమ్ముడుపోవనే కారణంతో వాటిని రిజర్వు జోన్‌లో పెట్టారు. దానిని ఎత్తివేయాలని సీఎం జగన్‌ను కోరాం. రైతుల సమస్యల గురించి చెప్పడానికి వెళ్తే నన్ను రైతు ద్రోహి అంటారా. రైతులను, రైతు కూలీలను పెయిడ్‌ ఆర్టిస్టులు అంటారా’’ అని ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.(భావి తరాల బాగుకే వికేంద్రీకరణ)

అదే విధంగా... ‘‘అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు.. తన ఇంటి దగ్గర బల్బుల కోసమని... ఉండవల్లి పంచాయతీ నుంచి రూ. 50 లక్షలు డ్రా చేయించారు. పేదల ఇళ్లకు కనీస విద్యుత్‌ సౌకర్యాలు కల్పించలేదు. రెఫరెండం పెట్టాలని ఇప్పుడు అడుగుతున్నారు. అసలు ఏయే అంశాలపై రెఫరెండం పెట్టాలో బాబుకు తెలియడం లేదు. రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. మీరు రైతు మిత్రలు అయితే... చంద్రబాబు, లోకేశ్‌ ఉండవల్లి ఎమ్మెల్యే వద్దకు, మంగళగిరి ఎమ్మెల్యే అయిన నా వద్దకు రండి.. మనందరం కలిసి సంబంధిత మంత్రితో మాట్లాడదాం. ఈ పరిస్థితికి మీరే కారణం అయినా.. రైతుల కోసం నేను కూడా మీతో పాటు ముఖ్యమంత్రిని కలుస్తా. సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం రాజకీయాలు చేస్తూ గ్రామస్థాయి నేతలా చంద్రబాబు మాట్లాడుతున్నారు’’ అని చంద్రబాబు తీరును ఆర్కే ఎండగట్టారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా