అవి నరం లేని నాలుకలు

17 Aug, 2019 04:59 IST|Sakshi
సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు అనిల్, కొడాలి నాని

టీడీపీ నేతలపై మంత్రులు అనిల్‌కుమార్, కొడాలి నాని ధ్వజం

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/మంగళగిరి :  ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా సహా టీడీపీ నేతలవి నరం లేని నాలుకలని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరిస్తే చంద్రబాబు భద్రతకు ముప్పు అంటూ గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు.

వరద ఉధృతికి ఒకవేళ చంద్రబాబు ఇల్లు మునిగిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ నేతలు విమర్శలు చేసేవారన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రులు అనిల్‌కుమార్, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.  కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరద పరిస్థితిని తెలుసుకోవడానికి డ్రోన్‌ కెమెరా వినియోగిస్తే టీడీపీ నేతలకు వచ్చిన బాధ ఏమిటని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టు శ్రీశైలంతో సహా మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిన తర్వాతే కిందకు నీళ్లు వదలడం మొదలుపెట్టి ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి 12 లక్షల క్యూసెక్కులను కిందకు వదలాల్సి  ఉంటుందని, అదెంత ప్రమాదకరమో తెలియదా అని నిలదీశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ఇంట్లో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారా? వరద ప్రవాహాన్ని అంచనా వేసేందుకు డ్రోన్లతో చిత్రీకరిస్తే ఆయనకు ఎందుకు అంత ఉలికిపాటు అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారడంతో రైతులు, ప్రజలు ఆనందంగా వేడుకలు చేసుకుంటుంటే, టీడీపీ నేతలు మాత్రం ఏడుపు మొహాలు వేసుకుని నిందలు వేస్తున్నారని విమర్శించారు. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని, సామాజిక బాధ్యతతో వ్యవహరించి వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే ఆర్కే హితవు పలికారు.  

మరిన్ని వార్తలు